మంచిర్యాల సిటీ : ప్రతిష్టాత్మకమైన ఐఐటీ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశించడానికి జాతీయస్థాయిలో సీబీఎస్‌ఈ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ పరీక్ష (జేఈఈ)లో సత్తా చాటాలి. జేఈఈ పరీక్షతోపాటు ఇంటర్ (ఎంపీసీ)లో సైతం విద్యార్థి తన ప్రతిభను చూపించాలి. ఈ రెండింటిలో నెగ్గడానికి ఆసక్తి ఉన్న విద్యారిక్థి ఈ సంవత్సరం కూడా తగిన వ్యవధి లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
ఈసారీ ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి జేఈఈ పరీక్ష నిర్వహించే సమయానికి కేవలం ఏడు రోజుల వ్యవధి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 2013 మార్చిలో ఇంటర్ పరీక్షలు 6న ప్రారంభమై 23న ముగిశాయి. 14 రోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 7న జరిగింది. 2014 మార్చిలో ఇంటర్ పరీక్షలు 12న ప్రారంభమై 26న ముగిశాయి. కేవలం పదిరోజుల తేడాతో ఆఫ్‌లైన్ విధానంతో ఏప్రిల్ 6న ఐఐటి పరీక్షను అధికారులు నిర్వహించారు. 2015 మార్చిలో ఇంటర్ పరీక్షలు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 9 నుంచి 27 వరకు జరుగనున్నాయి. ఐఐటీ పరీక్ష ఆఫ్‌లైన విధానంతో ఏప్రిల్ 4న ఏడు రోజుల తేడాతో జరుగనుంది. అన్‌లైన్ విధానంతో ఏప్రిల్ 10, 11 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
విద్యార్థుల్లో ఆందోళన..
జిల్లా నుంచి జేఈఈ పరీక్షకు ఐదువేల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. మన విద్యార్థులకు ఆన్‌లైన్ విధానంపై అవగాహన, సాధన తక్కువ. ఆఫ్‌లైన్ (రాత పరీక్ష) కే విద్యార్థులు ఎక్కువగా మొగ్గు చూపుతారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల మార్కులను పరిగణలోకి తీసుకుని వెయిటేజీ ఇవ్వనున్నామని సీబీఎస్‌ఈ బోర్డు ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు ముగిసే సమయానికి, జేఈఈ రాత పరీక్షకు వ్యవధి కేవలం ఏడు రోజులే ఉండటంతోపాటు విద్యార్థులు ఆందోళనకు గుర వుతున్నారు.
లోపించిన సమన్వయం..
లక్షలాది రూపాయలు వెచ్చించి శిక్షణ కేంద్రాల్లో ఇంటర్‌తోపాటు ఐఐటీ ప్రవేశ పరీక్ష శిక్షణ పొందుతున్న విద్యార్థులు తక్కువ వ్యవధి ఉండటంతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు సీబీఎస్‌ఈ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే విద్యార్థులపై భారం పడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జేఈఈ పరీక్ష వివరాలను సీబీఎస్‌ఈ బోర్డు ముందుగానే ప్రకటిస్తుంది. ఆ తేదీలకు అనుగుణంగానే ఇంటర్ బోర్డు సిలబస్ పూర్తిచేయడంతోపాటు పరీక్షను నిర్వహించడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
సమన్వయ లోపం.. విద్యార్థులకు శాపం..
Published Sun, Nov 23 2014 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement