Ministry of Water Resources
-
సుజలాం సుఫలాం
ఇంట్లో నీటి సమస్యను తీర్చడానికి దేశంలో చాలా చోట్ల మహిళలు పడే అవస్థల గురించి మనకు తెలిసిందే. అలాంటి ఊరందరి నీటి సమస్యను తీర్చాలంటే ఇంకెంత అవస్థ పడాలి. తమ గ్రామాలకు వచ్చిన నీటి కష్టం తీరాలంటే పూడుకుపోయిన చెరువును పునరుద్ధరించాలని, నదిని పునరుజ్జీవింపచేయాలని, కుళాయిలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలు చేసి, దానిని అమలు చేస్తున్నారు గంగా రాజ్‌పుత్, గాయత్రీదేవి, శారదాదేవి, అనితా చౌదరి, కె.ఆశా. వీరిని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ గుర్తించి ఈ యేడాది స్వచ్ఛ్ సుజల శక్తి సమ్మాన్ పురస్కారంతో సన్మానించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఢిల్లీలో వీరికి అవార్డులు అందజేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళలు పురుషాధిపత్యం పైనే కాదు, మూఢనమ్మకాలపైనా పోరాడుతూ తమ గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్యను తీర్చడానికి నడుం కట్టారు. గంగా ప్రవాహం... మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్కు చెందిన 35 ఏళ్ల గంగా రాజ్‌పుత్ తన గ్రామంలో తీవ్ర నీటి కొరతను తీర్చడానికి ఒక చెరువును పునరుద్ధరించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలో అయితే, ఆమె ఆలోచనను అమలులో పెట్టడానికి పితృస్వామ్యంపైనే కాదు మూఢనమ్మకాలపై కూడా పోరాడాల్సి వచ్చింది. దశాబ్దాల క్రితం జరిగిన ఓ దుర్ఘటన కారణంగా గ్రామస్తులు చెరువును వదిలేశారు. దానిని పునరుద్ధరిస్తే ఎవరికైనా చెడు జరుగుతుందని స్థానికుల గట్టి నమ్మకం. దాంతో ఆ గ్రామంలో నీటి సంక్షోభం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఆ నీటి ఎద్దడిని తీర్చే ఏకైక ఆధారం ఆ చెరువే. ‘మూఢనమ్మకాలతో కన్నా నీటి కోసం చనిపోవడం మేలు’ అని అభ్యంతరం చెప్పిన ప్రతీసారి గ్రామస్తులకు పదే పదే చెబుతూ వచ్చింది గంగ. మెల్లగా ఓ పాతిక మంది మహిళలతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక ఎన్జీవోల మద్దతుతో చెరువును శుభ్రం చేసి, పునరుద్ధరణ పనులు చేపట్టింది. ఊరికి నీటి ఎద్దడి తీరింది. నదికి జీవకళ గంగా రాజ్‌పుత్ మాదిరిగానే రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉంటున్న గాయత్రీదేవి సంభార్ సరస్సు చుట్టూ ఉన్న 15 గ్రామాలకు చెందిన మహిళలకు వర్షపు నీటి సంరక్షణలో సహాయం చేయడానికి కృషి చేస్తోంది. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన శారదాదేవి కూడా తన గ్రామంలోని నీటి ఎద్దడిని పరిష్కరించడానికి స్థానిక బారువా నదిని పునరుజ్జీవింపజేయడానికి తోటివారిని కార్యోన్ముఖులను చేసి విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వార్ జిల్లాకు చెందిన అనితా చౌదరి తన గ్రామంలోని ఇతర మహిళలు నీటి కోసం పడే కష్టాలను చూసింది. ఈ సమస్యను పరిష్కరించే అవకాశం వచ్చినప్పుడు ఆమె వెనకడుగువేయలేదు. రెండేళ్లుగా తన గ్రామమైన గర్మౌలో ప్రభుత్వ హర్ ఘర్ జల్ పథకాన్ని అమలు చేయడానికి కృషి చేసింది. మరో అవార్డు గ్రహీత తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందిన కె.ఆశా, తన గ్రామంలో ఏ ఇంటì వద్ద కుళాయి నీటి సరఫరాలో చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తుంది. -
ఎజెండా రెడీ!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 11న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కృష్ణాబోర్డు, తెలంగాణ సమాయత్తమవుతున్నాయి. సమా వేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, చేయాల్సిన అభ్యర్థనలపై కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగిరం చేశాయి. ఇప్పటికే కృష్ణా బోర్డు నాలుగైదు ప్రధానాంశాలతో ఎజెండా సిద్ధం చేయగా, తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ప్రధానంగా గోదావరి మళ్లింపు జలాల అంశం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్రం ఈ నెల 11న కీలక సమావేశం ఏర్పాటు చేయనుండగా, ఇందులో నాలుగు ప్రధాన అంశాలను కేంద్రం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న గోదావరి మళ్లింపు జలాల అంశాన్ని చర్చించనుంది. పట్టిసీమ, పోలవరంల ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తే, అందులో వాటాగా తెలంగాణ 80 టీఎంసీల మేర కృష్ణా జలాలు వాడుకునే అంశంపై స్పష్టత కోరనుంది. దీంతో పాటే చెన్నై తాగునీటి అవసరాలకు నీటి సరఫరా అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించనుంది. సమయానుకూలంగా ఇరు రాష్ట్రాల తమ వాటా మేరకు నీటిని విడుదల చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్ణయించింది. వీటితో పాటే ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ అంశం ప్రతిసారీ బోర్డు సమావేశాల్లో చర్చకు వస్తున్నా, దీనికి ఓ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. గతంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినా పనులు మాత్రం పూర్తవలేదు. ఈ దృష్ట్యా దీనికి పరిష్కారం వెతకనున్నారు. ఇటు టెలిమెట్రీ ఏర్పాటును బోర్డు తెరపైకి తెస్తోంది. నిధులపైనే ఫోకస్.. ఇక తెలంగాణ మాత్రం ఈ భేటీ ద్వారా బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవాలన్న భావనలో ఉంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు.. అయితే జాతీయ హోదా, లేని పక్షంలో ఇప్పటికే కేంద్రం ముందుంచిన మాదిరి నీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం కోరేందుకు సిద్ధమైంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల పనులు పూర్తి చేసినందున, మిగిలిన పనుల పూర్తికి కేంద్ర సాయాన్ని కోరనుంది. ఇటు ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా 30 వేల చెరువులకు పైగా పునరుద్ధరించినందున వాటికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటే కృష్ణా జల వివాదాలకు సత్వర పరిష్కారం, ట్రిబ్యునల్‌లో కొత్త సభ్యుడి నియామకంపైనా తెలంగాణ ప్రస్తావించేందుకు నిర్ణయం తీసుకుంది. -
రిజర్వాయర్లలో పడిపోతున్న నీటిమట్టం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు మొత్తం సామర్థ్యంలో 19 శాతానికే పరిమితమైనట్లు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగార్జున సాగర్, ఇందిరా సాగర్, భాక్రానంగల్ తదితర రిజర్వాయర్లలో ఈ వారాంతంలో 29.665 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గతేడాది కంటే నీటి నిల్వలు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. పంజాబ్, పశ్చిమబెంగాల్, తెలంగాణ, త్రిపుర, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల్లో గత ఏడాది కంటే నీటి నిల్వలు పెరిగినట్లు జలవనరుల శాఖ పేర్కొంది. -
వీళ్లిట్టా.. వాళ్లట్టా!
నీటి తీరువా వసూలులో ఇరుశాఖల మధ్య సమన్వయలోపం రెవెన్యూ శాఖ ఖాతాలో రూ. 2 కోట్ల పన్నులు నాలుగేళ్లుగా జల వనరుల శాఖ వాటా ఇవ్వని వైనం భూములకు నీరిచ్చేది జల వనరుల శాఖ అధికారులు, పన్ను వసూలు చేయాల్సింది రెవెన్యూ శాఖ అధికారులు కావడంతో ఆ రెండు శాఖల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో కాల్వలు, చెరువులకు చిన్నపాటి గండ్లు పడినా తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. కర్నూలు సిటీ: కాల్వల కింద ఆయకట్టు భూముల నుంచి నీటి తీరువా వసూలులో రెవెన్యూ, జలవనరులశాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో కొన్నేళ్లుగా పన్నులు వసూలు కావడం లేదు. వసూలైన సొమ్ము రెవెన్యూ శాఖ ఖాతాల్లో మూలుగుతున్నా జల వనరుల శాఖకు వాటా రావడం లేదు. ఈ పరిస్థితి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పన్ను వసూలు బాధ్యత నుంచి రెవెన్యూ శాఖను తప్పించే యోచనలో ఉంది. ఇందుకు సంబంధించి గత నెల 30వ తేదీన ఆయకట్టు అభివృద్ధి సంస్థ, అపెక్స్ సభ్యులు అభిప్రాయం కోరగా జల వనరుల శాఖకు చెందిన మెజారీ ఇంజినీర్లు పన్ను వసూలు బాధ్యతను తీసుకునేందుకు సమ్మతించారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో ప్రధానంగా కేసీ, తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, చిన్న నీటిపారుదల శాఖ, ఆంధ్రప్రదేశ్ ఆయకట్టు అభివృద్ధి సంస్థ పరిధిలోని ఎత్తిపోతల పథకాల కింద మొత్తం 6.29 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ భూముల నుంచి పన్ను వసూలు బాధ్యతను ప్రభుత్వం రెవెన్యూ శాఖకు అప్పగించింది. అయితే ఈ విషయంలో ఆ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా పన్నులు భారీగా పెండింగ్‌లో పడిపోయాయి. ఈ క్రమంలో నిధుల వేట మొదలెట్టిన ప్రభుత్వం నీటి తీరువాపై రెవెన్యూ శాఖ నిర్లక్ష్యాన్ని గుర్తించి ఆ బాధ్యతను జల వనరుల శాఖ ఇంజనీర్లకు అప్పగించాలని సంకల్పించి వారి అభిప్రాయాలు తీసుకుంది. రూ. 21.25 కోట్ల బకాయిలు కర్నూలు, కడప జిల్లాల్లోను, తుంగభద్ర దిగువ కాల్వ, ఎస్ఆర్బీసీ, తెలుగుగంగా, గాజులదిన్నె ప్రాజెక్టు, శివభాష్యం, చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద సాగయ్యే ఆయకట్టుకు సంబంధించి గతేడాది మే నెలవరకు తీసుకుంటే రూ. 21.25 కోట్ల బకాయిలున్నాయి. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే పంటలకు వేరువేరుగా పన్నులు వసూలు చేస్తారు. ఎకరాకు వరి పంటకు రూ. 200, ఇరిగేటేడ్ డ్రై పంటకు రూ. 100 ప్రకారంవసూలు చేస్తారు. అభిప్రాయం తీసుకున్నారు.. ఆయకట్టుకు సంబంధించి నీటి తీరువా వసూళ్ల బాధ్యతను ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు నిర్వహించారు. ప్రస్తుతం జలవనరుల శాఖకు అప్పగించేందుకు అపెక్స్ సభ్యులు, ఉన్నతాధికారులు అభిప్రాయాన్ని సేకరించారు. అయితే చాలా మంది మన కాల్వలకు సంబంధించి పన్నులు మనమే వసూలు చేసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. - ఎస్.చంద్రశేఖర్ రావు -
కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా శ్రీరాం వెదిరె
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బీజేపీనేత శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా గురువారం నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశాల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం 15 ఏళ్ల పాటు అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేశారు. 2009 నుంచి బీజేపీ జాతీయ నీటి నిర్వహణ సెల్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదీజలాలు, ముళ్లపెరియార్ డ్యామ్ తదితర అంశాలపై అధ్యయనం చేసి పార్టీకి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదికలు సమర్పించారు. తెహ్రీడ్యాం వద్ద నిరంతరాయంగా గంగాప్రవాహం ఉండేలా చూసేందుకు ఏర్పాటైన సాంకేతిక సలహా బృందంలో సభ్యునిగా, రాజస్థాన్‌లో క్యాచ్మెంట్ ఏరియా అభివృద్ధికి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. పురాణ కాలంనాటి సరస్వతి నది పునరుద్ధరణపై నివేదిక ఇచ్చారు.‘నీటి నిర్వహణలో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను వినియోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’, ‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను ఆయన రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు.