సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ నెల 11న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి కృష్ణాబోర్డు, తెలంగాణ సమాయత్తమవుతున్నాయి. సమా వేశంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, చేయాల్సిన అభ్యర్థనలపై కృష్ణా బోర్డు, తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగిరం చేశాయి. ఇప్పటికే కృష్ణా బోర్డు నాలుగైదు ప్రధానాంశాలతో ఎజెండా సిద్ధం చేయగా, తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై శుక్రవారం ప్రభుత్వ పెద్దలతో చర్చించారు.
ప్రధానంగా గోదావరి మళ్లింపు జలాల అంశం..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో కేంద్రం ఈ నెల 11న కీలక సమావేశం ఏర్పాటు చేయనుండగా, ఇందులో నాలుగు ప్రధాన అంశాలను కేంద్రం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. ప్రధానంగా ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న గోదావరి మళ్లింపు జలాల అంశాన్ని చర్చించనుంది. పట్టిసీమ, పోలవరంల ద్వారా గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలిస్తే, అందులో వాటాగా తెలంగాణ 80 టీఎంసీల మేర కృష్ణా జలాలు వాడుకునే అంశంపై స్పష్టత కోరనుంది. దీంతో పాటే చెన్నై తాగునీటి అవసరాలకు నీటి సరఫరా అంశాన్ని ఈ భేటీలో ప్రస్తావించనుంది. సమయానుకూలంగా ఇరు రాష్ట్రాల తమ వాటా మేరకు నీటిని విడుదల చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్ణయించింది. వీటితో పాటే ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ అంశం ప్రతిసారీ బోర్డు సమావేశాల్లో చర్చకు వస్తున్నా, దీనికి ఓ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. గతంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినా పనులు మాత్రం పూర్తవలేదు. ఈ దృష్ట్యా దీనికి పరిష్కారం వెతకనున్నారు. ఇటు టెలిమెట్రీ ఏర్పాటును బోర్డు తెరపైకి తెస్తోంది.
నిధులపైనే ఫోకస్..
ఇక తెలంగాణ మాత్రం ఈ భేటీ ద్వారా బహుళార్ధక సాధక ప్రాజెక్టులకు నిధులు సాధించుకోవాలన్న భావనలో ఉంది. ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు.. అయితే జాతీయ హోదా, లేని పక్షంలో ఇప్పటికే కేంద్రం ముందుంచిన మాదిరి నీటి సత్వర ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద ఆర్థిక సాయం కోరేందుకు సిద్ధమైంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో ఇప్పటికే రూ.55 వేల కోట్ల పనులు పూర్తి చేసినందున, మిగిలిన పనుల పూర్తికి కేంద్ర సాయాన్ని కోరనుంది. ఇటు ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా 30 వేల చెరువులకు పైగా పునరుద్ధరించినందున వాటికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేసేలా చూడాలని విజ్ఞప్తి చేయనుంది. దీంతో పాటే కృష్ణా జల వివాదాలకు సత్వర పరిష్కారం, ట్రిబ్యునల్‌లో కొత్త సభ్యుడి నియామకంపైనా తెలంగాణ ప్రస్తావించేందుకు నిర్ణయం తీసుకుంది.
ఎజెండా రెడీ!
Published Mon, Nov 4 2019 3:49 AM | Last Updated on Mon, Nov 4 2019 4:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment