శ్రీరాం వెదిరెకు నియామక పత్రం అందజేస్తున్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బీజేపీనేత శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా గురువారం నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశాల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తారు.
నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం 15 ఏళ్ల పాటు అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేశారు. 2009 నుంచి బీజేపీ జాతీయ నీటి నిర్వహణ సెల్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదీజలాలు, ముళ్లపెరియార్ డ్యామ్ తదితర అంశాలపై అధ్యయనం చేసి పార్టీకి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదికలు సమర్పించారు. తెహ్రీడ్యాం వద్ద నిరంతరాయంగా గంగాప్రవాహం ఉండేలా చూసేందుకు ఏర్పాటైన సాంకేతిక సలహా బృందంలో సభ్యునిగా, రాజస్థాన్‌లో క్యాచ్‌మెంట్ ఏరియా అభివృద్ధికి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు.
పురాణ కాలంనాటి సరస్వతి నది పునరుద్ధరణపై నివేదిక ఇచ్చారు.‘నీటి నిర్వహణలో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను వినియోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’, ‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను ఆయన రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు.