Sriram vedire
-
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
ఎడారిలో జలసిరి
⇒ రాజస్థాన్ కరువు ప్రాంతాల్లో పొంగుతున్న గంగ ⇒ తెలుగు ఇంజనీర్ శ్రీరాం వెదిరె సారథ్యంలో భగీరథ యజ్ఞం ఏడాదిలోనే ఫలితాలిస్తున్న జల వనరుల అథారిటీ ప్రణాళిక మోడు వారిన భూముల్లో రెండు, మూడు పంటల సాగు గొంతు తడుపుకొనేందుకు చుక్క నీరు లేదు.. పది కిలోమీటర్లు వెళితే గానీ కడివెడు నీరు దొరకదు.. సాగుకు కనుచూపు మేరలో చెరువన్నదే కనపడదు.. ఊరి జనంలో 90 శాతం వలస పోయే పరిస్థితి.. ఇది రాజస్థాన్ ఎడారుల్లో గ్రామీణ ప్రాంతాల దుస్థితి. ఈ పరిస్థితిని మార్చి, గ్రామాలను హరిత వనాలుగా తీర్చిదిద్దేందుకు ఆరేళ్ల కింద ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. అందులో తెలుగు వ్యక్తి కీలకంగా పనిచేస్తున్నారు. ఆనాడు ఈ సంస్థ ప్రతినిధులు భూములను సర్వే చేస్తోంటే స్థానికులు రాళ్లతో తరిమారు. ఇప్పుడవే చేతులు పూలమాలలతో స్వాగతిస్తున్నాయి. ఎందుకు? ఈ ఐదేళ్లలో ఏం జరిగింది? జాతీయ మీడియా బృందంలో భాగంగా ‘సాక్షి’ ప్రతినిధి రాజస్థాన్‌లో జరుగుతున్న జలయజ్ఞంపై చేసిన పరిశీలనలో ఈ ప్రశ్నలకు జవాబు దొరికింది. చుక్క నీటి కోసం కటకటలాడిన చోట ఇప్పుడు పాతాళ గంగ పోటెత్తుతోంది. మోడువారిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. (రాజస్థాన్ నుంచి లెంకల ప్రవీణ్ కుమార్) రాజస్థాన్‌లో 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న వసుంధరరాజే.. మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కరువు కోరల నుంచి గట్టెక్కించేందుకు గల అవకాశా లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే అమె రికాలో 15 ఏళ్లు ఇంజనీర్‌గా పనిచేసి స్వదేశానికి తిరి గి వచ్చిన తెలుగు వ్యక్తి శ్రీరాం వెదిరెకు పలు రాష్ట్రా ల్లో నీటి వనరుల సంరక్షణపై పనిచేసిన అనుభవం ఉంది. దీంతో శ్రీరాం వెదిరెను ఢిల్లీకి పిలిపించిన వసుంధర.. రాజ స్థాన్లో నీటి ఎద్దడి ప్రాంతాలను సుభిక్షం చేసే పని చేపట్టాలని కోరారు. అప్పటికే లోకహిత స్వచ్ఛంద సంస్థతో అనుబంధమున్న శ్రీరాం.. సంస్థకు చెందిన ప్రతినిధులతో కలసి రాజస్థాన్‌కు వెళ్లారు. కరువు ప్రాంతాల్లో నీటి వనరులను పెంచేందుకు సర్వే చేపట్టారు. కానీ స్థానికులు తమ భూములకేదో ప్రమాదం పొంచి ఉందని భావించి రాళ్లు విసురుతూ వారిని తరిమికొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆ బృందం నిరుత్సాహపడలేదు. సరేనన్న గ్రామాల్లో సర్వే చేసి ప్రణాళికలు సిద్ధం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక పనులు ప్రారంభించింది. వసుంధర రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. శ్రీరాం వెదిరెకు కేబినెట్ ర్యాంకు హోదా ఇస్తూ ‘రాజస్థాన్ రివర్ బేసిన్, స్టేట్ వాటర్ రీసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ’కి చైర్మన్‌ను చేశారు. చతుర్విధ జలప్రక్రియతో జీవం.. రాజస్థాన్ ప్రభుత్వం శ్రీరాం సాయంతో చతుర్విధ జలప్రక్రియను ఎంచుకుంది. వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని భూమాత దాహం తీరుస్తోంది. అదే నీరు పాతాళ గంగై పొంగేలా చేస్తోంది. రాజస్థాన్‌లో సగటు వార్షిక వర్షపాతం 564.89 మిల్లీమీటర్లు. కొన్ని ప్రాంతాల్లో 171 మి.మీ. ఉంటే కొన్ని ప్రాంతాల్లో 950 మి.మీ. వరకు ఉంటుంది. వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంకేలా చేయడం, ఆ తేమ నిండిన భూమిపై నీరు నిలిచి చిన్న చిన్న ఊట చెరువులు, చెరువుల్లో నిల్వగా మారి.. తద్వారా ఆ నీటిని ప్రజలు వినియోగించుకోవడం ఈ చతుర్విధ జల ప్రక్రియలో అనుసరించే విధానం. రివర్ బేసి న్లో ఉండే నీటి వనరులను అనుసంధానం చేసి చివరకు నదులను సజీవంగా చేసే ప్రక్రియ ఈ విధానంలో తుది దశ. వర్షపు నీరు భూమిలోకి ఇంకే లా స్టాగర్డ్ కందకాలు చేసి వాటిపై జట్రోఫా చెట్లను పెంచుతున్నారు. దిగువన చిన్న ఊట చెరువులు, ఆ దిగువన వాటర్ షెడ్లను, చెరువులను నిర్మిస్తున్నారు. చెరువుగా మారేందుకు అవకాశమున్న ప్రతి చోట పైన క్యాచ్‌మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. గతేడాది జనవరిలో తొలి విడతగా జల స్వావలంబన అభియా న్ కింద 3,529 గ్రామాలను ఎంపిక చేసి ఐదారు నెల ల్లోనే పనులు పూర్తిచేశారు. ఇప్పుడు రెండో విడతలో మరో 4,250 గ్రామాల్లో పనులు చేస్తున్నారు. తొలి ఏడాదే ఫలితాలు.. గతేడాదిలో ప్రారంభించి వర్షాకాలం నాటికి పనులు పూర్తయిన ప్రాంతాల్లో.. వర్షపు నీటితో చెరువులు నిం డాయి. వర్షాధారంగా శనగ సాగు చేసుకునే రైతులు ఇప్పుడు 2 నుంచి 3 పంటలు శనగ, గోధుమ సాగుచేస్తున్నారు. వచ్చే ఏడాది వేరుశనగ, మొక్కజొన్న పంటలను సాగుచే స్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి కొరత తీరింది. భూగర్భజలాలు పెరిగి చేతి పంపుల్లో నీరు లభ్యమవుతోంది. ఈ నీటి వనరులు పశువుల దప్పికను తీర్చుతున్నాయి. వలస బాట పట్టే ప్రజలు ఇప్పుడు తమ భూములను సాగులో పెడు తున్నారు. కోటి చెట్ల పెంపకం లక్ష్యంగా మొక్కలు నాటుతున్నారు. వాటిని ఐదేళ్ల పాటు పెంచే బాధ్యతను అటవీ శాఖకు అప్పగించారు. మూడు అడుగుల లోతులోనే నీరు బాన్సా్వరా జిల్లాలోని గోడీ తేజ్‌పూర్‌లో 2,500 హెక్టా ర్ల పరిధిలో ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు నీరు ఇంకేందుకు గతేడాది విస్తృతంగా కందకాలు తవ్వారు. వాటి దిగువన ఊట చెరువులు నిర్మించారు. దాంతో ప్రస్తుతం ఎండా కాలంలోనూ అక్కడ నేలలో తేమ కనిపిస్తోంది. మూడు అడుగులు తవ్వగానే నీళ్లు కనిపిస్తున్నాయి. దీంతో సమీప ప్రాంతాల్లోనూ భూగర్భ జలాలు పెరగడం విశేషం. నాణ్యత లోపిస్తే కఠిన నిర్ణయాలు రాజస్థాన్‌లో వందల కోట్లతో చేపడుతున్న ఈ పనుల్లో ఎక్కడైనా శాస్త్రీయత లోపించిందని తేలితే ఆ పనులను రద్దు చేసి కాంట్రాక్టర్లతో మళ్లీ చేయిస్తు న్నారు. ఒక ఊట చెరువు కట్ట నిర్మించాలంటే దశల వారీగా నీళ్లు చల్లి కట్ట పటిష్టం చేస్తూ ఎత్తు పెంచాలి. కానీ అలా జరగలేదని తేలితే వాటిని రద్దు చేస్తున్నా రు. ఆ కట్టలను తొలగించి మళ్లీ నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి, మలి దశల్లో ఇప్పటివరకు ఇలా దాదాపు 135 పనులను రద్దు చేశారు. తెలుగు వారిది కీలకపాత్ర ఈ పథకాన్ని నిర్విఘ్నంగా, యజ్ఞంగా కొనసాగిం చడంలో తెలుగు వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ ఉద్యో గులైన జక్కిడి జంగారెడ్డి, అఫ్సర్ సాంకేతిక నిపుణు లుగా ప్రత్యేక డిప్యుటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీరాం సన్నిహితుడైన ఇంజనీర్ రాకేష్‌రెడ్డి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వాసు తదితరులు తోడ్పాటు అందిస్తున్నారు. ఏడాదిలో 12 టీఎంసీల నీరు: శ్రీరాం వెదిరె చక్కటి ప్రణాళిక, పనుల్లో నాణ్యత, నిరంతర పర్యవేక్షణతోనే తమ లక్ష్యం సాధ్యమవుతోందని శ్రీరాం వెదిరె తెలిపారు. తమ పనులు విజయవంతమైన ప్రతి చోట పొరుగు గ్రామాల్లోని ప్రజలు ఇలాంటి పనులే కోరుకుంటున్నారని తెలిపారు. బాన్సా్వరా ప్రాంతంలోని కోరాపాడాలో నిర్మించిన చెరువును పరిశీలించేందుకు వెళ్లిన మీడియా బృందంతో ఆయన మాట్లాడారు. ‘‘ప్రజల భాగస్వామ్యంతో ఇదంతా జరుగుతోంది. ఇప్పటివరకు ప్రజలు దాదాపు రూ. 55 కోట్ల విరాళాలను అందించారు. ఇప్పటివరకు 41 లక్షల మంది ప్రజలు, 45 లక్షల మూగజీవాలకు ఈ నీటి వనరుల ద్వారా ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు అతి తక్కువ ఖర్చుతో దాదాపు 12 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేగలిగాం. భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోయి ఉన్న ప్రాంతాలు ఇప్పుడు జలసిరితో కళకళలాడుతున్నాయి. ఈ పనుల పూర్తి ఫలాలు అందడానికి మరో రెండు మూడేళ్లు పడుతుంది..’’అని పేర్కొన్నారు. వేరు శనగ కూడా పండిస్తా ‘‘ఇంతకుముందు ఒకటే పంట పండేది. ఈ ఏడాది ఎకరం పావులో గోధుమ వేశా. ఈ చెరువుతో మా బతుకు మారుతోంది. వచ్చే ఏడాదిలో గోధుమతోపాటు వేరుశనగ, పత్తి పండిస్తా. కాలం కాస్త బాగున్నా మూడు పంటలు పండిస్తా..’’ – రావోజీ, రైతు, కోరాపాడా శనగ, గోధుమ పండిస్తున్నా గ్రామంలో నిర్మించిన చెరువు ఆశలు చిగురింపజేసింది. గతంలో ఇక్కడ నీళ్లే కని పించేవి కాదు. ఇప్పుడు రెండు మూడు పంటలు పండిస్తు న్నాం. గతంలో వర్షాధా రంతో కేవలం ఒక పంట పండేది. గ్రామంలో 90 శాతం ప్రజలు వలస వెళ్లేవారు. – కమ్జి, రైతు, కోరాపాడా నీటి కమిటీలు పనిచేస్తున్నాయి ‘‘రాజస్థాన్ ప్రభుత్వం కేవలం చెరువులు నిర్మించడమే కాకుండా నీటి వనరులకు గ్రా మస్తులతో కమిటీలు వేస్తోంది. సాగు చేసుకునే వారు నీటిని పొందుతారు. ఇతరత్రా ఉపా ధి లేనివారు చేపలు పట్టుకునేందుకు ఈ కమిటీలు వీలు కల్పిస్తాయి..’’ – జక్కిడి జంగారెడ్డి, సాంకేతిక నిపుణుడు స్వయం సమృద్ధి లక్ష్యంగా.. ‘గ్రామీణ ప్రాంతాలు స్వయం సమృద్ధి సాధించే దిశగా జల స్వావలంబన అభియాన్ పనిచేస్తోంది. గ్రామీణులు ఈ పథకంతో మమేకం అవుతున్నారు. రెండు మూడేళ్లలో పల్లెలన్నీ హరితరూపు దాల్చుతాయి..’ – ధన్సింగ్ రావత్, రాజస్థాన్ గ్రామీణాభివృద్ధి మంత్రి -
రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా శ్రీరాం వెదిరె
న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బీజేపీ నేత శ్రీరాం వెదిరె రాజస్థాన్ రివర్ బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ఆయనకు రాజస్థాన్ ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదా కల్పించింది. రాజస్థాన్ లోని 19 నదుల ప్రాజెక్టుల్లోని నీటి వినియోగంపై ఆయన పనిచేయనున్నారు. ప్రస్తుతం కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా ఆయన ఉన్నారు. 'నదుల అనుసంధానం' ప్రాజెక్టు త్వరగా సాకారమయ్యేందుకు వీలుగా కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన 'టాస్క్ ఫోర్స్' కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం అమెరికాలో ఓ కంపెనీలో 15ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2009లో భారత్‌కు తిరిగొచ్చారు. నీరు పారుదలపై అనేక రచనలు చేశారు. బీజేపీలో చేరిన ఆయన పార్టీ వాటర్ మేనేజ్మెంట్ సెల్ జాతీయ కన్వీనర్‌గా విధులు నిర్వర్తించారు. -
వరద జలాల కోసమే ‘అనుసంధానం’
రాష్ట్రాల నికర జలాల్లో వాటాకు నష్టంలేదు నదుల అనుసంధాన కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం బుధవారం ఢిల్లీలో కమిటీ తొలి సమావేశం సాక్షి, హైదరాబాద్: వరద, మిగులు జలాల వినియోగం కోసమే నదుల అనుసంధాన ప్రతిపాదన తెరపైకి వచ్చిందని జాతీయ నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. నదీజలాల వినియోగం, నికర జలాల్లో రాష్ట్రాలకు ఉన్న హక్కులను, వాటాలను పరిరక్షిస్తూనే వరద జలాలను వినియోగించుకోవడం నదుల అనుసంధానం లక్ష్యమన్నారు. దీనిపై రాష్ట్రాలకు అవగాహన కల్పించి, ఒప్పించి, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని నదులకు కలిపి 30 ప్రాంతాల్లో నదులను కలిపే అవకాశమున్నట్టుగా కేంద్రం గుర్తించిందని, నదుల అనుసంధాన ప్రక్రియ 1980-90 దశకంలోనే చర్చకు వచ్చిందని, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సాంకేతిక అంచనాలు కూడా తయారయ్యాయని వివరించారు. పార్టీ నేతలు కుమార్‌రావు, దాసరి మల్లేశంతో కలసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో నంబర్‌వన్‌గా ఎదగడానికి భారత్ పోటీపడుతున్న క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో వరదలతో తీవ్ర నష్టం జరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ప్రతిబంధకంగా మారుతోందని చెప్పారు. అస్సాం, బిహార్ వంటి రాష్ట్రాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయన్నారు. తెలంగాణతోపాటు విదర్భ, రాజస్థాన్, రాయలసీమ కరువుతో సాగునీటికే కాక తాగునీటికి కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉందని శ్రీరాం వివరించారు. బ్రహ్మపుత్ర, గంగా నదుల్లో నీటి లభ్యత ఎక్కువ ఉన్నా కరువు ఉన్న రాష్ట్రాల్లో వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వరదలకు, కరువు కాటకాలకు ఏకైక పరిష్కార మార్గం నదుల అనుసంధానమని శ్రీరాం పేర్కొన్నారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం 10 కోట్ల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించడానికి, 30 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 30 లింకులను ప్రతిపాదించినట్టుగా వివరించారు. దీనికి రూ. 4.5 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అప్పడు అంచనాలు తయారయ్యాయని, యూపీఏ ప్రభుత్వం దీనిని పదేళ్లపాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చిందన్నారు. 2004లో రూపొందించిన లింకుల్లో అవసరమైన మార్పుచేర్పులు ఉంటాయన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల సమీకరణ ఎలా, పెట్టిన పెట్టుబడుల ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది, ఖర్చుకు తగిన ప్రతిఫలం ఉంటుందా అనేదానిపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. వీటితో పాటు పర్యావరణ, సామాజిక ప్రభావం, సహాయ పునరావాస కార్యక్రమాల వంటివాటిపైనా అధ్యయనం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు కూడా నదుల అనుసంధానం చేయాలని సూచనలు చేసిందని, ప్రతీ రెండు వారాలకు ఒకసారి దీనిపై నివేదికను కూడా కోరుతోందని చెప్పారు. ఒక రాష్ట్రంలోనే నదుల పరీవాహక ప్రాంతాల మధ్య అనుసంధానం, రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం వంటి వాటిపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. నికర జలాల్లో రాష్ట్ర వాటాలో ఒకచుక్క కూడా తగ్గించకుండా ముంపు బారిన పడకుండా వరద నీటిని తీసుకుపోతామంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చునని శ్రీరాం ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్క్ఫోర్సు కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో బుధవారం జరుగుతుందన్నారు. వీలైనంత తొందరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీరాం వెల్లడించారు. -
‘నదుల అనుసంధానం’ సభ్యుడిగా శ్రీరాం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి కలల ప్రాజెక్టు అయిన ‘నదుల అనుసంధానం’ ప్రాజెక్టు త్వరగా సాకారమయ్యేందుకు వీలుగా ‘టాస్క్ ఫోర్స్’ కమిటీని కేంద్ర జలవనరుల శాఖ మంగళవారం ఏర్పాటుచేసింది. ఇందులో సభ్యుడిగా తెలుగు ప్రముఖుడు శ్రీరాం వెదిరె నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కమిటీకి చైర్మన్‌గా బీఎన్ నవాలావాలా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం అమెరికాలో ఓ కంపెనీలో 15ఏళ్లపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2009లో భారత్‌కు తిరిగొచ్చారు. నీరు పారుదలపై అనేక రచనలు చేశారు. బీజేపీలో చేరిన ఆయన పార్టీ వాటర్ మేనేజ్మెంట్ సెల్ జాతీయ కన్వీనర్‌గా విధులు నిర్వర్తించారు. ఏకాభిప్రాయం కోసం కృషి శ్రీరాంను టాస్క్‌ఫోర్స్ విధులపై ‘సాక్షి’ ప్రశ్నించగా పలు విషయాలు వివరించారు. ‘దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ఈ కమిటీ పనిచేస్తుంది. నదుల అనుసంధానాకి సంబంధించి కొత్త లింకులను అధ్యయనం చేస్తుంది. ఇబ్బందులున్న చోట ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తుంది. సమగ్ర , సాధ్యాసాధ్యాల నివేదికలతోపాటు ప్రాజెక్టు పూర్తికి షెడ్యూలు ఇస్తుంది’ అని అన్నారు. -
రెండు తీరాల కరచాలనం
భారత దేశ మౌలిక సదుపాయాల కల్పన వ్యవస్థ మార్గదర్శి, ప్రస్తుతం కేంద్రంలో ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించగానే సూత్రప్రాయంగా ఆమోదం తెలియచేశారు. ఈ హైవే నిర్మాణం గురించి తగిన ప్రతిపాదనలతో రావలసిందిగా ఆయన వెంటనే ఆ రెండు నౌకాశ్రయాల అధికారులను, రోడ్డు రవాణా అధికారులను ఆదేశించారు. ‘అమెరికా రహదారులు బాగున్నా యంటే అందుకు కారణం అది సంపన్న దేశం కావడం వల్లకాదు. రహ దారులు బాగుండడం వల్లనే అమె రికా సంపన్నదేశమైంది.’ జాన్ ఎఫ్. కెన్నెడీ (అమెరికా మాజీ అధ్యక్షుడు) ఏ దేశమైనా త్వరితగతిన పురో గతి సాధించాలంటే రోడ్లు, నౌకాశ్రయాలు, విద్యుదుత్పాక కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసు కోవడమే ధ్యేయంగా చేసుకోవాలి. కానీ భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినది మొదలు ఇప్పటివరకు, భారీ జలా శయాలు, విద్యుదుత్పాదక కేంద్రాల మాదిరిగానే ఉపరితల రవాణా సైతం దారుణమైన నిర్లక్ష్యానికి గురైంది. దేశంలో సరైన రోడ్లు, జల రవాణా లేకపోవడం, నౌకాశ్రయాల మధ్య అనుసంధానం లోపించడం వలన అంతర్గతంగానే కాదు, విదేశాలకు కూడా వస్తువుల ఎగుమతికి మార్గమే కరవైంది. అలా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది. అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో గత ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని పాలించినపుడు ప్రజలు స్వర్ణ చతుర్భుజి పేరుతో జాతీయ రహదారి నెట్వర్క్ ఏర్పాటును చూశారు. అది ఢిల్లీ, ముంబై, కోల్కత్తా, చెన్నైల మధ్యనే కాకుండా, దేశంలోని ప్రధాన పారిశ్రామిక, వ్యవసాయ సాంస్కృతిక కేంద్రాలతో అనుసంధానం కల్పించింది. 5,846 కిలోమీటర్ల పొడవైన స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ఈ కింది జాతీయ రహదారుల(ఎన్‌హెచ్)ను నాలుగు లైన్ల భారీ రోడ్ల కింద తీర్చిదిద్దింది. అవి: ఎన్‌హెచ్-2 (ఢిల్లీ- కోల్కత్తా, 1453 కిలోమీటర్లు); ఎన్‌హెచ్ 8, ఎన్‌హెచ్ 79, ఎన్‌హెచ్ 79ఎ, ఎన్‌హెచ్-6, ఎన్‌హెచ్-60, ఎన్‌హెచ్-5 (కోల్కత్తా - చెన్నై, 1684 కిలోమీటర్లు). అదే సమయంలో, అంటే నాటి ఎన్డీఏ హయాంలోనే మహారాష్ట్రలో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం కూడా జరిగింది. ఇది భారత్‌లో నిర్మించిన తొలి ఆరు లేన్ల కాంక్రీట్, హైస్పీడ్ రహదారి. 93 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి భారత ఆర్థిక రాజధాని ముంబైనీ; పారిశ్రామిక, విద్యాకేంద్రమైన పుణే నగరాన్నీ కలుపుతోంది. 2002 నుంచి సేవలు అందిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ హైవే; వేగవం తమైన, సురక్షితమైన ఆటోమొబైల్ రవాణా విషయంలో కొత్త ప్రమాణాలను పరిచయం చేసింది. స్వర్ణ చతుర్భుజి ఆలోచన వెనుక కీలకంగా ఉన్న ప్రస్తుత ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీయే, ముంబై - పుణే ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం సమయంలో మహారాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తూర్పు-పశ్చిమ నౌకాశ్రయాల కారిడార్ తూర్పు, పశ్చిమ దిశలలోని సముద్ర నౌకాశ్రయాలను అను సంధానించాలని నా ఆలోచన. అందువల్ల ఎలాంటి విభేదాలు చూపకుండా భారత ద్వీపకల్పం గుండా నాలుగు లేన్ల, సాధ్య మైతే ఆరు లేన్ల జాతీయ రహదారిని నిర్మించవచ్చు. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను గురించి గడచిన ఆరు మాసాలలో నిపుణుల కమిటీ అధ్యయనం చేసి, ఇది ఆచరణ సాధ్యమైన ప్రాజెక్టేనని నివేదిక ఇచ్చింది. పశ్చిమ కోస్తా తీరంలోని ముం బై నౌకాశ్రయం, తూర్పు తీరంలోని గోపాల్పూర్ నౌకాశ్రయం అక్షాంశ రేఖ మీద 19 డిగ్రీల వద్దనే ఉన్నాయి. గోపాల్పూర్ పరిసరాలలోని బాహుద వ ద్ద 12వ ప్రణాళికా కాలంలో ఒక గ్రీన్‌ఫీల్డ్ (ఏ నిర్మాణాలు కూల్చకుండా తొలి ప్రయత్నంగా కట్టేది) ప్రధాన నౌకాశ్రయం రూపుదిద్దుకోబోతోంది. ఆ రెం డు నౌకాశ్రయాలను కలుపుతూ 19 డిగ్రీల అక్షాంశ రేఖ మీద నిర్మించ తలపెట్టినదే భారత ద్వీపకల్పం గుండా సాగే ఆ రహదారి. ఉత్తర - దక్షిణ కారిడార్ (శ్రీనగర్ నుంచి కన్యాకు మారి)లో భాగంగా ఉండే ఈ రహదారికి దాదాపు 150-200 కిలోమీటర్ల దూరంలో ఇటు అటు నాగపూర్, హైదరాబాద్ ఉంటాయి. ఈ రోడ్డు ప్రాజెక్టులో విస్తరించబోయే జాతీయ రహదారులు ఇవి: 1. ఎన్‌హెచ్ 222- ముంబై నుంచి నిర్మల్ (తెలంగాణలో ఎన్‌హెచ్ -7 నిజామాబాద్ దగ్గర). 2. ఆర్మూ ర్ నుంచి (ఎన్‌హెచ్ -7 మీద) ఛత్తీస్‌గడ్‌లోని జగదల్పూర్ వరకు సాగే ఎన్‌హెచ్-16. 3. ఒడిశాలోని కోరాపుట్ కూడా ఎన్‌హెచ్ -43 ద్వారా ఈ రహదారితో అనుసంధానమవు తుంది. 4. కోరాపుట్ - దిగాపహాండి మధ్య దూరం కూడా ఎన్‌హెచ్ 326 నిర్మాణం తరువాత ఇటీవలి కాలంలో తగ్గింది. 5. ఎన్‌హెచ్-217 ఒడిశాలోని గోపాల్పూర్- బరంపురాలను కలుపుతుంది. ఒడిశాలో ఇక జాతీయ రహదారిగా ప్రకటించ వలసినది కేవలం 55 కిలోమీటర్లు. బరంపురం-దిగాపహాండి మధ్య ఈ భాగం ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే- ముంబై నుంచి గోపాల్పూర్ వరకు జాతీయ రహదారి-222 (610 కి.మీ.), జాతీయ రహదారి-16 (460 కి.మీ.), జాతీయ రహదారి-43 (97 కి.మీ.), జాతీయ రహదారి-326 (288 కి.మీ.), రాష్ట్ర రహదారి-17 (55 కి.మీ), జాతీయ రహదారి -217 (15 కి.మీ.)లతో కలసి, అక్షాంశం 19 డిగ్రీల మీద 1525 కి.మీ.తో తూర్పు-పశ్చిమ రహదారి ఆవిర్భవిస్తుంది. ఈ రహదారి దేశంలో ఖనిజ సంపద అపారంగా ఉన్న ప్రాంతాల గుండా వెళుతుంది. అలాగే ఈ రెండు నౌకాశ్ర యాల మధ్యలో అభివృద్ధి చెందకుండా ఉండిపోయిన గిరిజన ప్రాంతాలకు వెళ్లడానికి ఉపకరిస్తుంది. అందివచ్చే లాభాలు ఈ నాలుగు లేన్ల రహదారిని నిర్మించడం వల్ల దేశానికి ఎన్నో లాభాలు సమకూరతాయి. * ఈ రహదారి ఛత్తీస్గడ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలోని దట్టమైన గిరిజన ఆవాసాల గుండా సాగుతుంది. దీని వల్ల అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిన గిరిజను లకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలు దక్కడం లేదంటూ నక్సల్స్ చేస్తున్న ఆరోపణకు సమాధానమవుతుంది. దీనితో నక్సల్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. * నిజానికి దేశంలో ఉన్న ఖనిజ వనరులలో 40 శాతం ఈ గిరిజన ప్రాంతాలలోనే ఉన్నాయి. ఛత్తీస్గడ్, తెలంగాణ, మహారాష్ట్రలలోని బొగ్గు నిల్వల వల్ల, ఛత్తీస్గడ్లోనే ఉన్న ఇనుప ఖనిజం (బైలదిల్ల), ఒడిశా (పాచ్పటిమల్లి, కోరాపుట్ జిల్లాలు)లోని బాక్సైట్ నిల్వల కారణంగా ఈ ప్రాంతాలు దేశంలోనే సంపద్వంతమైనవిగా పేరుపొం దాయి. తూర్పు తీరంలోని లేదా పశ్చిమ తీరంలోని నౌకాశ్రయంతో ఈ ప్రాంతాలను అనుసంధానిస్తే, ఈ వనరులను ఉపయోగించుకుంటున్న వస్తూత్పత్తి సంస్థలు తమ కార్యకలాపాలను పెంచుతాయి. దీనితో స్థానికులకు ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయి. తరు వాత వీరి సహకారంతో విదేశీ ఎగుమతులకు కూడా వీలు కలుగుతుంది. * ఓఎన్జీసీ, రిలయెన్స్ సంస్థలు ఈ మధ్యనే మలేసి యాలో నాలుగు చమురు క్షేత్రాలను తీసుకున్నాయి. వీటి నుంచి ఉత్పత్తి అయ్యే సహజవాయువు, ఎరువులను తూర్పు తీరంలోని నౌకాశ్రయానికి చేర్చడానికి ఈ జాతీ య రహదారులు ఉపకరిస్తాయి. దీనితో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా వృద్ధి చెందుతాయి. * నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ‘తూర్పు వైపు దృష్టి’ (లుక్ ఈస్ట్) విధానాన్ని చేపట్టింది. దీనితో భారత్‌కు తూర్పు దిశగా ఉన్న దేశాలతో ద్వైపాక్షిక సం బంధాలకు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అంటే తూర్పు తీర నౌకాశ్రయం ద్వారా ఆ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయంలో ఈ ప్రయత్నం ఆరంభమైనట్టు చెప్పాలి. ప్రాజెక్టుతో తెలంగాణ డ్రైపోర్ట్పై స్పష్టత ఈ విధంగా తూర్పు- పశ్చిమ నౌకాశ్రయ కారిడార్ల రహ దారి దేశంలో వెనుకబడిన నాలుగు రాష్ట్రాలు - ఛత్తీస్గడ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల ఆర్థికాభివృద్ధిలో కీలకమవు తుంది. ద్వీపక ల్పం గుండా సముద్రంతో ఉపరితల రవాణాకు అనుసంధానం చేయడం వల్ల వస్తూత్పత్తి, రవాణా, ఎగు మతి, దిగుమతి వ్యవస్థల అభివృద్ధితో పాటు ఉద్యోగా వకాశాలు కూడా ఇతోధికంగా పెరుగుతాయి. భారత దేశ మౌలిక సదుపాయాల కల్పన వ్యవస్థ మార్గదర్శి, ప్రస్తుతం కేంద్రంలో ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలను సమర్పించగానే సూత్రప్రాయంగా ఆమోదం తెలియచేశారు. ఈ హైవే నిర్మాణం గురించి తగిన ప్రతిపాదనలతో రావలసిందిగా ఆయన వెంటనే ఆ రెండు నౌకాశ్రయాల అధికారులను, రోడ్డు రవాణా అధికారులను ఆదేశించారు. ఆ నౌకాశ్రయాల అనుసంధానంతో తెలంగాణలో డ్రైపోర్ట్ (నౌకా శ్రయాలకు సరుకులను రవాణా చేసేందుకు ఉపయోగపడే కేంద్రం) ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు ఊపు వస్తుందని కూడా గడ్కరీ చెప్పారు. కాగా ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు లైన్ల లేదా ఆరులైన్ల రహదారిని నిర్మించ డానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. ఇందుకోసం దిగాపహాండీ నుంచి బరంపురం వెళ్లే (వయా కనిషి, లాథి)55 కి.మీ. మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రక టించాలి. అలాగే భూపాలపట్నం నుంచి నిమేద్ మార్గాన్నీ (తెలంగాణ- ఛత్తీస్గడ్ మార్గంలో), ఒడిశాలోని బోరిగుమ్మ నుంచి మొదలై దశ్వంత్పూర్-లకింపూర్-కంతె పేట- రాయగడల వరకు ఉన్న 50 కిమీ. మార్గాన్నీ కూడా జాతీయ రహ దారులుగా రూపొందించవలసి ఉంటుంది. తెలంగాణలోని ప్రాణహిత మీద వంతెనను నిర్మిస్తే ఈ ప్రాంతాలకు దూరా భారాలు బాగా తగ్గుతాయి. (వ్యాసకర్త కేంద్ర జలవనరుల, నదుల అభివృద్ధి, గంగా ప్రణాళికలో భారత ప్రభుత్వ సలహాదారు) e-mail:ramvedire@gmail.com శ్రీరామ్ వెదిరె -
కేంద్ర జలవనరుల శాఖ సలహాదారుగా శ్రీరాం వెదిరె
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన బీజేపీనేత శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా గురువారం నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశాల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తారు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం 15 ఏళ్ల పాటు అమెరికాలో ఇంజనీర్‌గా పనిచేశారు. 2009 నుంచి బీజేపీ జాతీయ నీటి నిర్వహణ సెల్‌కు కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదీజలాలు, ముళ్లపెరియార్ డ్యామ్ తదితర అంశాలపై అధ్యయనం చేసి పార్టీకి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదికలు సమర్పించారు. తెహ్రీడ్యాం వద్ద నిరంతరాయంగా గంగాప్రవాహం ఉండేలా చూసేందుకు ఏర్పాటైన సాంకేతిక సలహా బృందంలో సభ్యునిగా, రాజస్థాన్‌లో క్యాచ్మెంట్ ఏరియా అభివృద్ధికి ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు. పురాణ కాలంనాటి సరస్వతి నది పునరుద్ధరణపై నివేదిక ఇచ్చారు.‘నీటి నిర్వహణలో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను వినియోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’, ‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను ఆయన రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు.