క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు.
ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు.
కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు.
95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు.
సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మున్సిపాలిటీల్లో..
మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్‌ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు.
ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి
మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు.
ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment