Land record
-
భూమి రికార్డుల్లో నమోదు కాలేదని..
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 76 సర్వే నంబర్లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్‌ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు. అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో.. రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు. -
‘రికార్డు’ సంస్కరణలు ప్రజలకు చెబుదాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చేపట్టిన భూ సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రెవిన్యూ శాఖలో తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, సమగ్ర భూసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేటేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయాలు, వాటి వల్ల చేకూరుతున్న ప్రయోజనాలను క్షుణ్నంగా వివరిస్తూ ప్రజల్లోకి విస్తృత సమాచారాన్ని పంపాలన్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు తీరుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. ప్రజలకు మేలు జరుగుతున్న నిర్ణయాలపై కూడా ఎల్లో మీడియా వక్రీకరిస్తూ ద్రుష్పచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు రాతలు రాస్తోందని, వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మంచిని మంచిగా చూపించడం ఇష్టం లేకనే వక్రీకరణలకు పాల్పడుతున్నారని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో ఆయా మండలాలు, తాలూకాల్లో ఒకరిద్దరు మాత్రమే సర్వేయర్లు ఉండగా మన రాష్ట్రంలో ప్రతి గ్రామ సచివాలయానికీ ఒక సర్వేయరు ఉన్నారని సీఎం జగన్ గుర్తు చేశారు. భూ యజమానుల హక్కుల పరిరక్షణ, రికార్డుల్లో స్వచ్ఛత, కచ్చితత్వానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. కీలక సంస్కరణలు చేపట్టి రిజిస్ట్రేటేషన్ల వ్యవస్థను నేరుగా గ్రామ సచివాలయాల వద్దకే తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని గ్రామ సచివాలయాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేటేషన్ చేయించుకునేవారు ఇంటి నుంచే ఆ పనిని చేయించుకునేలా సాంకేతికతను తెస్తున్నామన్నారు. ఇన్ని సౌలభ్యాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటే కొందరు తప్పుడు రాతలు, వక్రీకరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తిప్పికొడుతూ మన ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, వాటి వల్ల చేకూరిన ప్రయోజనాలను ప్రజలకు సమగ్రంగా వివరించాలని దిశా నిర్దేశం చేశారు. మనం చేస్తున్న మంచి అంతా ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. 95 శాతం డ్రోన్ ఫ్లయింగ్ పూర్తి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జరుగుతున్న సమగ్ర సర్వే ప్రగతిని సమీక్షలో అధికారులు వివరించారు. 13,460 గ్రామాలకు గానూ 12,836 గ్రామాల్లో అంటే 95 శాతం గ్రామాల్లో డ్రోన్ల ఫ్లయింగ్ పూర్తయిందని తెలిపారు. మిగతా పనిని అక్టోబరు 15లోగా పూర్తి చేస్తామన్నారు. 81 శాతం గ్రామాలకు సంబంధించి సర్వే ఇమేజ్‌ల ప్రక్రియ పూర్తైనట్లు చెప్పారు.60 శాతం గ్రామాలకు సంబంధించి ఓఆర్‌ఐలను (ఆర్థో రెక్టిఫైడ్ ఇమేజ్) జిల్లాలకు పంపే పని పూర్తి చేయాల్సి ఉందన్నారు. సర్వేలో 3,240 రోవర్లను వినియోగించామని, గతం కంటే 1,620 అదనంగా పెరిగినట్లు చెప్పారు. తొలి విడతగా చేపట్టిన 2 వేల గ్రామాల్లో అన్ని రకాలుగా సర్వే పూర్తయిందని వివరించారు. మ్యుటేషన్లు, కొత్త సర్వే సబ్ డివిజన్లు, 19 వేల సరిహద్దుల సమస్యల పరిష్కారం,సర్వే రాళ్లు పాతడం సహా 7.8 లక్షల మందికి భూహక్కు పత్రాల పంపిణీ పూర్తైనట్లు వెల్లడించారు. ఫేజ్ 2లో మరో 2 వేల గ్రామాల్లో భూహక్కు పత్రాల పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండో దఫా సర్వే గ్రామాల్లో అక్టోబరు 15 నాటికి రిజిస్ట్రేటేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీల్లో.. మున్సిపల్ శాఖ పరిధిలో సర్వే ప్రగతిని కూడా అధికారులు నివేదించారు. ఇప్పటికే 91.93 శాతం ఆస్తుల వెరిఫికేషన్ పూర్తైందని, 66 మున్సిపాలిటీల్లో ఓఆర్ఐ ప్రక్రియ ముగిసిందని తెలిపారు. ప్రత్యేక బృందాల ఏర్పాటు ద్వారా సర్వే ప్రక్రియను ముమ్మరం చేయాలని సీఎం సూచించారు. ఫేజ్ 2 సర్వే పూర్తైన చోట రిజిస్ట్రేటేషన్ సేవలకు సిద్ధం కావాలి మొదటి దశ సర్వే పూర్తైన 2 వేల గ్రామాల్లో అమల్లోకి తెచ్చిన రిజిస్ట్రేషన్ సేవలపై పూర్తి స్థాయిలో సమీక్ష చేయడంతోపాటు ఫేజ్ 2 సమగ్ర సర్వే పూర్తైన గ్రామాల్లో కూడా రిజిస్ట్రేటేషన్ సేవలను అందించేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రిజిస్టేషన్ల ప్రక్రియ సజావుగా సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రిజిస్ట్రేటేషన్ల కోసం ప్రజలు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ వ్యవస్థను గ్రామాల్లోకే తెచ్చామన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. భూ వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి మండల స్థాయిలో మొబైల్ కోర్టులు సేవలందించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
భూ రికార్డుల బూమ్.. బూమ్..!
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న భూముల వివరాలు, రికార్డుల వివరాల్లో భారీ ఎత్తునే మార్పులు జరగనున్నాయి. ఇప్పటికి పూర్తయిన భూ రికార్డుల ప్రక్షాళన గణాంకాలను పరిశీలిస్తే భూముల విస్తీర్ణం, సర్వే నంబర్లు, ఖాతాల వివరాల్లో లక్షల సంఖ్యలో మార్పులొచ్చాయి. రాష్ట్రంలో గతంలో అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం 2.4 కోట్లకు పైగా ఎకరాలుండగా, ఇప్పుడు అది 2.51 కోట్లకు చేరింది. అదేవిధంగా 2.3 లక్షల సర్వే నంబర్లు, 6.9 లక్షల మంది రైతుల ఖాతాలు కూడా పెరగడం గమనార్హం. నల్లగొండలో అత్యధిక భూములు రాష్ట్రంలోని 30 జిల్లాల్లో నల్లగొండ జిల్లాలో ఎక్కువ భూములున్నట్టు తేలింది. ఈ జిల్లాలో 18,66,481 ఎకరాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఆ తర్వాత పాలమూరు జిల్లాలో 13.50 లక్షల ఎకరాలు ఉంది. టాప్–2లో ఉన్న ఈ రెండు జిల్లాల మధ్య వ్యత్యాసమే 5 లక్షల ఎకరాలు దాటడం విశేషం. ఈ రెండు జిల్లాలకు తోడు మరో 8 జిల్లాల్లో 10 లక్షలకు పైగా ఎకరాల భూమి తేలింది. అయిదు లక్షల కన్నా తక్కువ భూములన్న జిల్లాలు కూడా నమోదయ్యాయి. మొత్తం 5 జిల్లాలో అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్‌గిరిలో 2,63,582 ఎకరాలు నమోదయ్యాయి. ఈ జిల్లాలో ఇంకా రికార్డుల పరిశీలన పూర్తికాలేదు. ఆ తర్వాత వరంగల్ అర్బన్‌లో తక్కువగా 3,17,500 ఎకరాలు నమోదయ్యాయి. అయితే, మొత్తం 10,874 రెవెన్యూ గ్రామాల్లోని 10,774 గ్రామాల్లో భూ రికార్డుల ప్రక్షాళన జరగ్గా.. అందులో 50–100 గ్రామాలు మినహా అన్నిచోట్లా రికార్డుల పరిశీలన పూర్తయిం దని రెవెన్యూ వర్గాలంటున్నాయి. మిగతా గ్రామాల్లో కూడా ఈ నెల 25 కల్లా ప్రక్షాళన కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్టు సమాచారం. -
రికార్డుల సవరణ.. రయ్.. రయ్..
సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రికార్డుల సవరణ శరవేగంగా జరుగుతోంది. రికార్డులను పరిశీలించిన తర్వాత రైతుల వద్ద ఉన్న వివరాలకు, రికార్డులకు మధ్య ఉన్న తేడాలను రెవెన్యూ యంత్రాంగం సరి చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో రాష్ట్రవ్యాప్తంగా 1.50 కోట్ల ఎకరాల విస్తీర్ణంలోని భూముల రికార్డులను పరిశీలించారు. అందులో 45 లక్షలకు పైగా ఎకరాల భూమి సరి చేయాల్సిందిగా తేలింది. ఈ సరి చేయాల్సిన భూమిలో ఇప్పటివరకు 23 లక్షల ఎకరాల రికార్డులను సరి చేసినట్టు భూ ప్రక్షాళన గణాంకాలు చెపుతున్నాయి. ఆ ప్రకారం నమోదైన మొత్తం తప్పుల్లో 55 శాతం వరకు రికార్డులను సరి చేశారు. మరోవైపు రెవెన్యూ రికార్డులను సరి చేసేందుకు క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది సొమ్ములు అడుగుతున్నారని, చిన్న తప్పులను కూడా కాసులు లేనిదే సరిచేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతుండటం గమనార్హం. చాలా వరకు చిన్న సవరణలే.. వాస్తవానికి రికార్డుల సవరణకు అవసరమైన విషయాలను పరిశీలిస్తే చాలా వరకు చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని భూ రికార్డుల ప్రక్షాళనలో అర్థమవుతోంది. ఎక్కువగా సర్వే నంబర్లలో తప్పులు, పట్టాదార్ల పేర్లలో క్లరికల్ తప్పులు, పౌతి చేయాల్సినవి, ఆన్లైన్ రికార్డుల్లో ఎక్కించాల్సినవి, మ్యుటేషన్ అప్డేట్ చేయాల్సినవి, పాస్ బుక్కుల వివరాలు ఆన్లైన్లో ఎక్కించాల్సినవి.. ఇలా అన్నీ ఉన్నపళంగా సరి చేసేందుకు వీలైన తప్పులే 90 శాతానికి పైగా నమోదవుతున్నాయి. ఇక కోర్టు కేసులు, అటవీ భూములు, అసైన్డ్ భూముల్లో నమోదవుతున్న పొరపాట్లను ఇప్పటికిప్పుడు సరిచేసే అవకాశం లేదు. దీనికితోడు దాదాపు 3 లక్షల సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటే రికార్డుల్లో తక్కువగా ఉండటం, రికార్డుల్లో ఎక్కువగా ఉండి భూమి తక్కువ ఉండటం వంటి కేసులు నమోదయ్యాయి. ఈ రికార్డులను కూడా సర్వే చేయకుండా నివృత్తి చేయలేని పరిస్థితి. ఇలాంటివన్నీ కలసి 10 శాతం వరకు ఉంటున్నాయి. కోర్టు కేసులైతే ఇప్పటివరకు 24 వేల సర్వే నంబర్లలోని భూముల్లోనే వచ్చాయి. అసైన్డ్, ఫారెస్టు అన్నీ కలిపినా 85 వేల సర్వే నంబర్లకు మించలేదు. రికార్డుల ప్రక్షాళన పూర్తయ్యే సరికి కూడా ఈ గణాంకాల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం లేదు. దీంతో చిన్న తప్పులను సరిచేసేందుకు పెద్దగా సమయం తీసుకోవడం లేదని, రైతుల అంగీకారంతో రికార్డులను సవరించి 1బీ ఫారాలు ఇచ్చి సంతకాలు తీసుకుంటున్నామని, వాటిని గ్రామసభల్లో అంటిస్తున్నామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. 31 నాటికి కష్టమే భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో తప్పుల సవరణ శరవేగంగా జరుగుతున్నప్ప టికీ డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. రికార్డుల సవరణ లో భాగంగా రోజుకు 40 వేల వరకు సర్వే నంబర్లను సరి చేస్తున్నామని, అలా చేసినా మరో 10 లక్షలకు మించి పూర్తయ్యే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. ఇంకా వేగంగా చేయడం వల్ల పొరపాట్లు జరిగే అవకాశముం దని, దీనికితోడు ఈ రికార్డులను ఆన్లైన్ చేసేందుకు ఇంకా సమయం తీసుకుంటుంద ని వారంటున్నారు. ప్రక్రియ సజావుగా సాగాలంటే కనీసం మరో నెలరోజులైనా గడువును పొడిగించాలని కోరుతున్నారు. ‘ఆమ్యామ్యాలు’ ఇవ్వాల్సిందే..! రికార్డుల ప్రక్షాళనలో క్షేత్రస్థాయిలో ‘ఆమ్యామ్యాలు’ నడుస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లోని తప్పులను సరి చేసేందుకు ఎకరాల లెక్కన రైతుల నుంచి రెవెన్యూ సిబ్బంది వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎకరానికి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు డిమాండ్‌ను బట్టి వసూలు చేసి తప్పులు సరి చేస్తున్నారని, ఇదేమంటే తాము పై అధికారులకు ఇచ్చుకోవాలని వీఆర్వోలు చెబుతున్నారంటూ రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జగిత్యాల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో రెవెన్యూ అధికారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అయితే అందరు సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయకపోయినా, రైతు అవసరాన్ని బట్టి గట్టిగానే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు మాత్రం క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతుండటం గమనార్హం. -
ప్రక్షాళనకు ‘సర్వేయర్’ కష్టాలు
- వ్యవసాయేతర భూ రికార్డుల పరిశీలనకు రెవెన్యూ ఆపసోపాలు - కనీసం మండలానికో సర్వేయర్ ఉంటే పరిశీలన సులభతరం సాక్షి, హైదరాబాద్: భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో సర్వేయర్ల అంశం సమస్యగా మారుతోంది. వ్యవసాయ భూముల వరకు సర్వేయర్లతో అవసరం లేకుండానే రికార్డుల పరిశీలన జరుగుతుండగా.. వ్యవసాయేతర భూములు, ప్రభుత్వం సేకరించిన భూముల విషయంలో సర్వేయర్ల అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రక్షాళనలో 10 శాతం వరకు ఇలాంటి భూముల సమస్యలే వస్తున్నాయి. రికార్డుల్లో ఎక్కువ భూమి ఉండి, అసలు భూమి తక్కువగా ఉండటం, రికార్డుల్లో తక్కువగా ఉండి, అసలు భూమి ఎక్కువగా ఉండటం లాంటి సమయాల్లో కూడా కచ్చితంగా సర్వేయర్ల అవసరం వస్తోంది. ఇప్పటివరకు 86 వేల సర్వే నంబర్ల రికార్డులను రెవెన్యూ యంత్రాంగం పరిశీలించగా.. అందులో 2 వేల వరకు భూముల కొలత ల్లో తేడాలొచ్చాయి. 840 సర్వే నంబర్లలో వ్యవసాయేతర కార్యకలాపాలు జరుగుతుంటే రికార్డుల్లో ఇంకా వ్యవసా యమనే ఉంది. మరో 539 సర్వే నంబర్ల భూమిని ప్రజావసరాలకు ప్రభుత్వం సేకరించినా.. ఇంకా పట్టాదా రుల పేర్లే రికార్డుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ నాలుగు కేటగిరీల భూ రికార్డులను సవరించాలంటే సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళన పూర్తయ్యే సరికి ఈ సంఖ్య లక్షల సర్వే నంబర్లకు చేరుతుందని, ప్రక్షాళన జరుగుతుండగానే వీటిని పరిష్కరిస్తే రికార్డుల సవరణ సులభ తరమవుతుందని భావిస్తున్నాయి. ఎప్పుడో చేపట్టిన సాగు, తాగునీటి ప్రాజెక్టులకు భూమిని సేకరించిన రికార్డులూ అందు బాటులోకి రావడం లేదని, అక్కడ సర్వేయర్ల అవసరం ఉంటుందని రెవెన్యూ అధికారులు అంటున్నారు. 70 శాతం సర్వేయర్ పోస్టులు ఖాళీయే.. రాష్ట్రంలో 474 సర్వేయర్ పోస్టులు మంజూరు కాగా, అందులో 354 ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే ఇందులో 110 పోస్టులను డీగ్రేడ్ చేసి డిప్యూటీ సర్వేయర్లుగా మార్చారు. ఈ డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించారు. కానీ ఇంతవరకు ఫలితాలు రాలేదు. మంజూరైన పోస్టుల్లో 70 శాతం మేర ఖాళీలుండటంతో వారిని భూరికార్డుల ప్రక్షాళనకు విని యోగించుకోలేకపోతున్నారు. సర్వేయర్లున్న మండలాల్లో మాత్రం ప్రక్షాళన బృందాల్లో వారిని చేర్చుకున్నారు. లేనిచోట్ల వదిలేస్తున్నారు. అయితే, నల్లగొండ జిల్లాలోని 31 మండలాలకుగాను 31 మంది సర్వేయర్లను ప్రక్షాళన బృందాల్లో నియమించారు. ప్రభుత్వ సర్వేయర్లు, ఐకేపీలో 25 మంది ఉండగా, వారితో పాటు మరో 10 మంది లైసెన్స్డ్ ప్రైవేటు సర్వేయర్లను ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్.గౌరవ్ ఉప్పల్ ఔట్‌సోర్సింగ్‌పై తీసుకుని ప్రక్షాళన బృందాల్లో చేర్చారు. -
ఊరూరా చాటింపు
భూరికార్డుల ప్రక్షాళనకు ముందురోజు గ్రామాల్లో దండోరా - రెండు సార్లు గ్రామసభల నిర్వహణ - మొదటి సభలో కార్యక్రమ ఉద్దేశం.. రెండో సభలో సరిచేసిన రికార్డులపై వివరణ - తహసీల్దార్ ఆధ్వర్యంలో టీంలు.. ఒక్కో బృందానికి తొమ్మిది గ్రామాలు మన ఊర్లో ఉన్న భూముల రికార్డులన్నీ సరిచేస్తరంటహో.. రైతులందరూ తమ భూములకు సంబంధించిన ఆధారాలు పట్టుకుని రేప్పొద్దున ఆంజనేయస్వామి గుడి కాడ ఉన్న అరుగుచెట్టు కాడికి రావాలహో.. ► రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనకు ముందు గ్రామగ్రామాన వినిపించనున్న చాటింపు ఇది! ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరిస్తూ గ్రామసభ (రైతుసభ) నిర్వహించాలని, అంతకుముందు రోజు గ్రామంలో చాటింపు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మార్గదర్శకాలతో కూడిన 22 పేజీల నోట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? అందుకు చేయాల్సిన కసరత్తు ఏంటి? గ్రామంలోకి వెళ్లే సమయంలో ఏయే రికార్డులు తీసుకెళ్లాలి? వంటి వివరాలు ఈ నోట్లో ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్ తహసీల్దారే ఫైనల్ భూరికార్డుల ప్రక్షాళన ఏ ప్రాతిపదికన చేయాలనే అంశాలను కూడా కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో వివరించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ చట్టం–1971 ప్రకారం రికార్డులు సరిచేసే అధికారం తహసీల్దార్‌కు మాత్రమే ఉంటుంది. రికార్డుల ప్రక్షాళన అనంతరం గ్రామం వారీగా రూపొందించిన ఆన్లైన్–1బీపై సంతకం చేసిన తర్వాతే అది ఫైనల్ అవుతుంది. దీన్ని సర్వే నంబర్ల వారీగా గ్రామ కూడళ్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ రికార్డులుఉండాలి ప్రతి టీం గ్రామంలోకి వెళ్లే ముందు ఆ గ్రామానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక రికార్డులను సమీకరించాల్సి ఉంటుంది. సేత్వార్, ఖాస్రా, చెస్సలా పహాణీలతోపాటు అందుబాటులో ఉన్న ఏదైనా పాత పహాణీ, ఆన్లైన్ రికార్డుల్లో ఉన్న ప్రస్తుత పహాణీ, 1–బీ రిజిస్టర్, పదేళ్ల పాటు సవరణలు జరిగిన రికార్డులు, విలేజ్ మ్యాప్‌లను తీసుకున్న తర్వాతే గ్రామాల్లోకి వెళ్లాలి. ప్రతి బృందానికి 9 గ్రామాలు గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేసే బృందాలను కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఈ టీంలకు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐలలో ఒకరిని ఇన్చార్జిగా నియమిస్తారు. ప్రతి టీం 9 గ్రామాలను తీసుకుంటుంది. రెవెన్యూ వర్గాలతోనే ఈ బృందాలు ఉంటాయి. అవసరమనుకుంటే గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం తీసుకుంటారు. లేదంటే శిక్షణ పొందిన యువతను వినియోగించుకుంటారు. ప్రతి టీం రోజుకు కనీసం 250 ఎకరాలకు సంబంధించిన రికార్డులను సరిచూడాలి. ప్రతి గ్రామంలో టీం 10 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ ప్రక్రియ 100 రోజుల్లో పూర్తవుతుంది. ఈ టీం గ్రామంలోకి వెళ్లడానికంటే ముందే శిక్షణనిస్తారు. ఇలా వెళ్లండి.. భూరికార్డుల ప్రక్షాళనకు గ్రామాల్లోకి వెళ్లే ముందు చేయాల్సిన కసరత్తుపై నోట్లో పేర్కొన్న మార్గదర్శకాలివీ.. ► గ్రామంలోకి వెళ్లేందుకు ముందే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో ఎన్ని సవరణలు చేయాల్సి ఉంటుందన్న అంశంపై అంచనాకు రావాలి. ► ఆన్లైన్ 1–బీ రిజిస్టర్‌లోని ప్రతి ఖాతా ప్రింట్‌ను (రైతువారీ) రైతులకు అందజేయాలి. దీన్నే భూరికార్డుల ప్రక్షాళన నోటీసుగా పరిగణించాలి. ఇందులో సదరు రైతుకు రికార్డుల ప్రకారం ఏ సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో రాసి ఉంటుంది. ► గ్రామంలోకి వెళ్లడానికి ఒకరోజు ముందు దండోరా వేయించాలి. మీడియా సంస్థల ద్వారా కూడా ప్రచారం కల్పించాలి. ఏ గ్రామంలో సర్వే జరుగుతుందనే వివరాలను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్, మంత్రులకు కలెక్టర్లు తెలియజేయాలి. అలాగే డివిజన్, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు ఆర్డీవోలు, తహసీల్దార్లు సమాచారం ఇవ్వాలి. గ్రామాల్లోకి వెళ్లాక.. ► గ్రామసభ లేదా రైతుసభ ఏర్పాటు చేసి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమ ఉద్దేశం, ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలి. ► నోటీసుల రూపంలో ఇచ్చిన 1–బీ ఖాతాలపై అభ్యంతరాలు, సవరణలను అధికారులకు దర ఖాస్తు రూపంలో తెలియజేయాలి. ఆ దరఖాస్తుతోపాటు పన్ను రశీదు జిరాక్స్ కాపీ, టైటిల్ డీడ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా జతచేయాలి. ► వ్యవసాయేతర, ప్రభుత్వ భూములను పరిశీలించి వాటి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సవరణలు స్వీకరించాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారుంటే రికార్డుల్లో నమోదు చేయాలి. ► అన్ని రికార్డులు పరిశీలించి సవరించిన తర్వాత రూపొందించిన 1–బీ ఖాతా ప్రతులను రైతులకు ఇచ్చి, వారి సంతకాలు తీసుకోవాలి. ఈ సంతకాలతో కూడిన ప్రతులన్నింటినీ గ్రామంలోని కూడళ్లలో ప్రదర్శించాలి. ఇందుకు రెండోసారి గ్రామసభ ఏర్పాటు చేసి సరిచేసిన వివరాలను గ్రామస్తులకు తెలియజేయాలి. ► వివాదాల్లో ఉండి పరిష్కారం కాని భూముల వివరాలు సర్వే నంబర్ల వారీగా విడిగా తయారుచేసి అందుకు గల కారణాలను పేర్కొంటూ నివేదిక రూపొందించాలి. ► ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతిరోజు భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వివరాలను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు కచ్చితంగా తెలియజేయాలి. -
ల్యాండ్ రికార్డులను అప్డేట్ చేయండి : జేసీ
అమలాపురం : భూ సంబంధిత రికార్డులన్నింటినీ నవంబరు 30వ తేదీలోపు అప్డేట్ చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తహశీల్దారులను ఆదేశించారు. ల్యాండ్ రికార్డులపై అమలాపురం ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం డివిజన్లోని అన్ని మండలాల తహశీల్దార్లతో జేసీ సమీక్షించారు. ల్యాండ్ రికార్డులన్నీ పక్కాగా ఉండేలా ప్రణాళికాబద్ధంగా అప్డేట్ చేయాలన్నారు. వెబ్ ల్యాండ్ అడంగళ్‌లో తప్పిదాలకు తావులేకుండా సరిచూడాలని ఆదేశించారు. గ్రామాల్లోని ప్రభుత్వ భూములకు సంబంధించిన మార్పులు ఉంటే తహశీల్దార్లు ప్రొసీడింగ్సతో ల్యాండ్ రికార్డులను డేటా ఎంట్రీ చేయాలని ఆదేశించారు. మరణించిన భూ యజమానుల స్థానే వారి వారసులు వెబ్ ల్యాండ్ రికార్డుల్లో నమోదయ్యేందుకు మీ-సేవా కేంద్రానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వెబ్ ల్యాండ్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపాలను సరిచేసుకునేందుకు రెక్టిఫికేషన్ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్చార్జ్ ఆర్డీఓ టీవీఎస్‌జీ కుమార్, డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు పాల్గొన్నారు. -
గల్లంతుల రికార్డు
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: గ్రామాల్లో భూ లావాదేవీలు అత్యధికంగా జరుగుతుంటాయి. వివాదాలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. వీటి పరిష్కారానికి అతి కీలకమైనవి రెవెన్యూ రికార్డులే. అవి ఉంటే తప్ప ఏ చిన్న వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి. అయితే ఎల్.ఎన్.పేట మండలంలో ముఖ్యమైన చాలా రెవెన్యూ రికార్డుల జాడ కనిపించడం లేదు. మండలంలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పడం తో ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుల భూమి హక్కులను నిర్ధారించే రికార్డులు చాలా కాలంగా కనిపించడం లేదు. రెవెన్యూ విభాగం విధుల్లో రికార్డుల నిర్వహణ ప్రధానమైనదే. రికార్డులే కనిపించని పరిస్థితుల్లో ఈ విభాగం పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉన్నాయా?..అమ్మేశారా? భూమి రికార్డుల్లో 1బి రికార్డులు కీలకమైనవి. ఇప్పుడు అవే లేవు. గతంలో ఇక్కడ పనిచేసి పదవీ విరమణ పొందిన, బదిలీపై వెళ్లిన వీఆర్వోలు, సీనియర్ సహాయకులు, ఆర్ఐలు నకిలీ భూ పట్టాదారులతో కుమ్మక్కై వారికి రికార్డులను అమ్మేయడమో, మాయం చేయడమో చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన వారిని సంబంధిత రికార్డులన్నీ అప్పగించిన తర్వాతే రిలీవ్ చేయాలి, జీతాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయాలి. ఈ నిబంధనను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆ రికార్డులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. 15 రెవెన్యూ గ్రామాలకు 1బి..ల్లేవు మండలంలో 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 15 గ్రామాలకు చెందిన 1బి రికార్డులు లేవు. భూముల కొనుగోళ్లు, వారసత్వ హక్కుల వివరాలను 1బి రికార్డులో నమోదు చేస్తారు. రైతు ఫొటోతో సహా అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. మండలంలోని కొత్తపేట, ముంగెన్నపాడు, చొర్లంగి, కవిటి, బొరమాంబాపురం, యంబరాం, బొడ్డవలస, ఫాక్సుదొరపేట, నరెంద్రపురం, పాలవలస, బొత్తాడసింగి, జాడుపేట, గార్లపాడు తదితర రెవెన్యూ గ్రామాలకు చెందిన 1బి రికార్డులు పూర్తిగా లేవని అధికారులే చెబుతున్నారు. అన్నీ దిద్దుబాట్లే ఇదిలా ఉండగా కంప్యూటర్ అడంగల్ పుస్తకం నిండా దిద్దుబాట్లే ఉన్నాయి. రైతుల పేర్ల కొట్టివేతలు, దిద్దుబాట్లు, తప్పుడు నమోదులు కనిపిస్తున్నాయి. రికార్డులు ఇంత దారుణంగా ఉంటే భూములకు గ్యారెంటీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు నచ్చిన విధంగా రికార్డులు మార్పించుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొత్త రికార్డుల తయారీ రికార్డులు కనిపించని పరిస్థితుల్లో కొత్త రికార్డులు తయారు చేయాలని వీఆర్వోలను రెవెన్యూ అధికారులు ఆదేశించారు. 1బి రికార్డులు లేనందున ఇటీవలి వస్తున్న నమోదులను కొత్త 1బిల్లో చేర్పిస్తున్నామని తహశీల్దార్ రమణమూర్తి చెప్పారు. కొత్త ఫసలీలో కంప్యూటర్ అడంగల్ పుస్తకాల్లో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా సరిచేస్తామని చెప్పారు.