గల్లంతుల రికార్డు
Published Tue, Jan 21 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM
ఎల్.ఎన్.పేట, న్యూస్‌లైన్: గ్రామాల్లో భూ లావాదేవీలు అత్యధికంగా జరుగుతుంటాయి. వివాదాలూ ఆ స్థాయిలోనే ఉంటాయి. వీటి పరిష్కారానికి అతి కీలకమైనవి రెవెన్యూ రికార్డులే. అవి ఉంటే తప్ప ఏ చిన్న వివాదాన్ని పరిష్కరించలేని పరిస్థితి. అయితే ఎల్.ఎన్.పేట మండలంలో ముఖ్యమైన చాలా రెవెన్యూ రికార్డుల జాడ కనిపించడం లేదు. మండలంలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పడం తో ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా అధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రైతుల భూమి హక్కులను నిర్ధారించే రికార్డులు చాలా కాలంగా కనిపించడం లేదు. రెవెన్యూ విభాగం విధుల్లో రికార్డుల నిర్వహణ ప్రధానమైనదే. రికార్డులే కనిపించని పరిస్థితుల్లో ఈ విభాగం పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఉన్నాయా?..అమ్మేశారా?
భూమి రికార్డుల్లో 1బి రికార్డులు కీలకమైనవి. ఇప్పుడు అవే లేవు. గతంలో ఇక్కడ పనిచేసి పదవీ విరమణ
పొందిన, బదిలీపై వెళ్లిన వీఆర్వోలు, సీనియర్ సహాయకులు, ఆర్‌ఐలు నకిలీ భూ పట్టాదారులతో కుమ్మక్కై వారికి రికార్డులను అమ్మేయడమో, మాయం చేయడమో చేసి ఉంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా బదిలీ అయిన, పదవీ విరమణ చేసిన వారిని సంబంధిత రికార్డులన్నీ అప్పగించిన తర్వాతే రిలీవ్ చేయాలి, జీతాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు క్లియర్ చేయాలి. ఈ నిబంధనను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఆ రికార్డులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
15 రెవెన్యూ గ్రామాలకు 1బి..ల్లేవు
మండలంలో 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో 15 గ్రామాలకు చెందిన 1బి రికార్డులు లేవు. భూముల కొనుగోళ్లు, వారసత్వ హక్కుల వివరాలను 1బి రికార్డులో నమోదు చేస్తారు. రైతు ఫొటోతో సహా అన్ని వివరాలు ఇందులో ఉంటాయి. మండలంలోని కొత్తపేట, ముంగెన్నపాడు, చొర్లంగి, కవిటి, బొరమాంబాపురం, యంబరాం, బొడ్డవలస, ఫాక్సుదొరపేట, నరెంద్రపురం, పాలవలస, బొత్తాడసింగి, జాడుపేట, గార్లపాడు తదితర రెవెన్యూ గ్రామాలకు చెందిన 1బి రికార్డులు పూర్తిగా లేవని అధికారులే చెబుతున్నారు.
అన్నీ దిద్దుబాట్లే
ఇదిలా ఉండగా కంప్యూటర్ అడంగల్ పుస్తకం నిండా దిద్దుబాట్లే ఉన్నాయి. రైతుల పేర్ల కొట్టివేతలు, దిద్దుబాట్లు, తప్పుడు నమోదులు కనిపిస్తున్నాయి. రికార్డులు ఇంత దారుణంగా ఉంటే భూములకు గ్యారెంటీ ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వారు నచ్చిన విధంగా రికార్డులు మార్పించుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కొత్త రికార్డుల తయారీ
రికార్డులు కనిపించని పరిస్థితుల్లో కొత్త రికార్డులు తయారు చేయాలని వీఆర్వోలను రెవెన్యూ అధికారులు ఆదేశించారు. 1బి రికార్డులు లేనందున ఇటీవలి వస్తున్న నమోదులను కొత్త 1బిల్లో చేర్పిస్తున్నామని తహశీల్దార్ రమణమూర్తి చెప్పారు. కొత్త ఫసలీలో కంప్యూటర్ అడంగల్ పుస్తకాల్లో తప్పులు, దిద్దుబాట్లు లేకుండా సరిచేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement