ఊరూరా చాటింపు | SP Singh sent 22-page note to collectors of all districts on Monday. | Sakshi
Sakshi News home page

ఊరూరా చాటింపు

Published Tue, Sep 12 2017 2:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

ఊరూరా చాటింపు - Sakshi

ఊరూరా చాటింపు

భూరికార్డుల ప్రక్షాళనకు ముందురోజు గ్రామాల్లో దండోరా
రెండు సార్లు గ్రామసభల నిర్వహణ 
మొదటి సభలో కార్యక్రమ ఉద్దేశం.. రెండో సభలో సరిచేసిన రికార్డులపై వివరణ 
తహసీల్దార్‌ ఆధ్వర్యంలో టీంలు.. ఒక్కో బృందానికి తొమ్మిది గ్రామాలు
 
మన ఊర్లో ఉన్న భూముల రికార్డులన్నీ సరిచేస్తరంటహో.. రైతులందరూ తమ భూములకు సంబంధించిన ఆధారాలు పట్టుకుని రేప్పొద్దున ఆంజనేయస్వామి గుడి కాడ ఉన్న అరుగుచెట్టు కాడికి రావాలహో..
 
► రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనకు ముందు గ్రామగ్రామాన వినిపించనున్న చాటింపు ఇది! ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరిస్తూ గ్రామసభ (రైతుసభ) నిర్వహించాలని, అంతకుముందు రోజు గ్రామంలో చాటింపు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ మార్గదర్శకాలతో కూడిన 22 పేజీల నోట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? అందుకు చేయాల్సిన కసరత్తు ఏంటి? గ్రామంలోకి వెళ్లే సమయంలో ఏయే రికార్డులు తీసుకెళ్లాలి? వంటి వివరాలు ఈ నోట్‌లో ఉన్నాయి.
– సాక్షి, హైదరాబాద్‌ 
 
తహసీల్దారే ఫైనల్‌  
భూరికార్డుల ప్రక్షాళన ఏ ప్రాతిపదికన చేయాలనే అంశాలను కూడా కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో వివరించారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్‌ చట్టం–1971 ప్రకారం రికార్డులు సరిచేసే అధికారం తహసీల్దార్‌కు మాత్రమే ఉంటుంది. రికార్డుల ప్రక్షాళన అనంతరం గ్రామం వారీగా రూపొందించిన ఆన్‌లైన్‌–1బీపై సంతకం చేసిన తర్వాతే అది ఫైనల్‌ అవుతుంది. దీన్ని సర్వే నంబర్ల వారీగా గ్రామ కూడళ్లలో ప్రదర్శించాల్సి ఉంటుంది. 
 
ఈ రికార్డులుఉండాలి 
ప్రతి టీం గ్రామంలోకి వెళ్లే ముందు ఆ గ్రామానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక రికార్డులను సమీకరించాల్సి ఉంటుంది. సేత్వార్, ఖాస్రా, చెస్సలా పహాణీలతోపాటు అందుబాటులో ఉన్న ఏదైనా పాత పహాణీ, ఆన్‌లైన్‌ రికార్డుల్లో ఉన్న ప్రస్తుత పహాణీ, 1–బీ రిజిస్టర్, పదేళ్ల పాటు సవరణలు జరిగిన రికార్డులు, విలేజ్‌ మ్యాప్‌లను తీసుకున్న తర్వాతే గ్రామాల్లోకి వెళ్లాలి.  
 
ప్రతి బృందానికి 9 గ్రామాలు 
గ్రామాల్లో రికార్డులు ప్రక్షాళన చేసే బృందాలను కలెక్టర్‌లు నిర్ణయిస్తారు. ఈ టీంలకు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్‌ఐలలో ఒకరిని ఇన్‌చార్జిగా నియమిస్తారు. ప్రతి టీం 9 గ్రామాలను తీసుకుంటుంది. రెవెన్యూ వర్గాలతోనే ఈ బృందాలు ఉంటాయి. అవసరమనుకుంటే గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారం తీసుకుంటారు. లేదంటే శిక్షణ పొందిన యువతను వినియోగించుకుంటారు. ప్రతి టీం రోజుకు కనీసం 250 ఎకరాలకు సంబంధించిన రికార్డులను సరిచూడాలి. ప్రతి గ్రామంలో టీం 10 రోజుల పాటు పనిచేస్తుంది. ఈ ప్రక్రియ 100 రోజుల్లో పూర్తవుతుంది. ఈ టీం గ్రామంలోకి వెళ్లడానికంటే ముందే శిక్షణనిస్తారు. 
 
ఇలా వెళ్లండి.. 
భూరికార్డుల ప్రక్షాళనకు గ్రామాల్లోకి వెళ్లే ముందు చేయాల్సిన కసరత్తుపై నోట్‌లో పేర్కొన్న మార్గదర్శకాలివీ.. 
గ్రామంలోకి వెళ్లేందుకు ముందే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో ఎన్ని సవరణలు చేయాల్సి ఉంటుందన్న అంశంపై అంచనాకు రావాలి. 
► ఆన్‌లైన్‌ 1–బీ రిజిస్టర్‌లోని ప్రతి ఖాతా ప్రింట్‌ను (రైతువారీ) రైతులకు అందజేయాలి. దీన్నే భూరికార్డుల ప్రక్షాళన నోటీసుగా పరిగణించాలి. ఇందులో సదరు రైతుకు రికార్డుల ప్రకారం ఏ సర్వే నంబర్‌లో ఎంత భూమి ఉందో రాసి ఉంటుంది.  
► గ్రామంలోకి వెళ్లడానికి ఒకరోజు ముందు దండోరా వేయించాలి. మీడియా సంస్థల ద్వారా కూడా ప్రచారం కల్పించాలి. ఏ గ్రామంలో సర్వే జరుగుతుందనే వివరాలను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌ చైర్మన్, మంత్రులకు కలెక్టర్లు తెలియజేయాలి. అలాగే డివిజన్, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు ఆర్డీవోలు, తహసీల్దార్లు సమాచారం ఇవ్వాలి. 
 
గ్రామాల్లోకి వెళ్లాక.. 
► గ్రామసభ లేదా రైతుసభ ఏర్పాటు చేసి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమ ఉద్దేశం, ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజలకు వివరించాలి. 
► నోటీసుల రూపంలో ఇచ్చిన 1–బీ ఖాతాలపై అభ్యంతరాలు, సవరణలను అధికారులకు దర ఖాస్తు రూపంలో తెలియజేయాలి. ఆ దరఖాస్తుతోపాటు పన్ను రశీదు జిరాక్స్‌ కాపీ, టైటిల్‌ డీడ్, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో తప్పనిసరిగా జతచేయాలి. 
వ్యవసాయేతర, ప్రభుత్వ భూములను పరిశీలించి వాటి వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సవరణలు స్వీకరించాలి. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారుంటే రికార్డుల్లో నమోదు చేయాలి.  
అన్ని రికార్డులు పరిశీలించి సవరించిన తర్వాత రూపొందించిన 1–బీ ఖాతా ప్రతులను రైతులకు ఇచ్చి, వారి సంతకాలు తీసుకోవాలి. ఈ సంతకాలతో కూడిన ప్రతులన్నింటినీ గ్రామంలోని కూడళ్లలో ప్రదర్శించాలి. ఇందుకు రెండోసారి గ్రామసభ ఏర్పాటు చేసి సరిచేసిన వివరాలను గ్రామస్తులకు తెలియజేయాలి. 
వివాదాల్లో ఉండి పరిష్కారం కాని భూముల వివరాలు సర్వే నంబర్ల వారీగా విడిగా తయారుచేసి అందుకు గల కారణాలను పేర్కొంటూ నివేదిక రూపొందించాలి. 
► ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రాష్ట్రస్థాయిలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతిరోజు భూరికార్డుల ప్రక్షాళన ప్రక్రియ వివరాలను జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు కచ్చితంగా తెలియజేయాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement