మనస్తాపంతో రైతు ఆత్మహత్య
భూమిని రికార్డుల్లో ఎక్కించడానికి డబ్బులు తీసుకున్న రెవెన్యూ అధికారులు
తర్వాత చేతులెత్తేసిన వైనం
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటికేశ్వాపూర్‌కు చెందిన కొమ్మాట రఘుపతి (45) అనే రైతు శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుని కుటుంబ సభ్యులు తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రఘుపతికి కొన్నె గ్రామ శివారులో 75, 76 సర్వేనంబర్లలో కలిపి మూడు ఎకరాల 10 గుంటల భూమి ఉంది. అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే 76 సర్వే నంబర్‌లోని ఎకరం 20 గుంటల భూమి రికార్డుల్లో లేకపోవడంతో ఏడాదిన్నర క్రితం భూమిని కొలవడానికి ఫీజు చెల్లించగా.. సర్వేయర్ కె.రవీందర్ భూమిని కొలతవేసి.. ఈ భూమి నీదేనని రికార్డులో ఎక్కించడానికి రూ.6 లక్షలు అవుతాయని చెప్పి, సీనియర్ అసిస్టెంట్ కొలిపాక సుమన్‌ను కలవాలని సలహా ఇచ్చాడు. ఆ మేరకు రఘుపతి.. సుమన్ వద్దకు వెళ్లి రూ.4.50 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని ఒకసారి రూ.2 లక్షలు, మరోమారు రూ.2.50 లక్షలు సర్వేయర్ రవీందర్ ద్వారా చెల్లించాడు.
అయితే భూమి నమోదుకోసం రఘుపతి 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ‘ఆ భూమి వేరే వ్యక్తుల పేరున రికార్డు అయింది.. నీ పేరు మీదకు రావడం కష్టం’అని సుమన్, రఘుపతికి చెప్పాడు. దీంతో తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని అడగ్గా పై అధి కారులకు ముట్టాయంటూ నిర్లక్ష్యంగా సమా ధానం చెప్పాడు. వారం రోజుల క్రితం మళ్లీ వెళ్లినా ఫలితం దక్కలేదు.
ఆర్థిక ఇబ్బందులతో..
రఘుపతి గత ఏడాది కూతురు వివాహం చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు తీసుకున్నాడు. వాళ్లు డబ్బులు అడగడంతో పది రోజుల క్రితం తనకున్న రూ.3 లక్షల విలువైన మూడు పాడి ఆవులు, గేదెలను రూ.1.10 లక్షలకు విక్రయించాడు. దీనికితోడు రెవెన్యూ అధికారులకు ఇచ్చిన డబ్బులు తిరిగి రావన్న మనస్తాపంతో శుక్రవారం తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రఘుపతి మృతదేహాన్ని తీసుకువచ్చి గ్రామస్తులతో కలసి రెవెన్యూ కార్యాలయం ఎదుట రెండు గంటల పాటు ధర్నా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment