మహారాణిపేట (విశాఖ దక్షిణ): తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ పూర్తిచేసింది. ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేసేందుకు రంగం సిద్ధంచేస్తున్నట్లు సిట్ చైర్మన్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ఏలేరు గెస్టు హౌస్‌లోని సిట్ కార్యాలయంలో సిట్ సభ్యులతో మంగళవారం సమావేశమైన ఆయన.. వారి సిఫార్సులు, అభిప్రాయాలతో పాటు గతంలోని మధ్యంతర నివేదికపై సమీక్షించారు. సభ్యులతో పాటు తన అభిప్రాయాలను కూడా నివేదికలో పొందుపరిచిన చైర్మన్.. తన తుది నివేదికను సిద్ధంచేశారు. అనంతరం డాక్టర్ విజయకుమార్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 309 పేజీలతో సమగ్ర నివేదిక సిద్ధమైందన్నారు. తమకు వచ్చిన 1400 ఫిర్యాదులతో పాటు.. గతంలో సిట్ అందించిన నివేదికలో కొన్ని అంశాలపైనా విచారణ చేపట్టి పలు సిఫార్సులు చేశామన్నారు. మొత్తం 350–400 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్లు తమ విచారణలో తేలిందన్నారు. తమకు వచ్చిన ఫిర్యాదులన్నింటిపైనా క్షుణ్ణంగా విచారణ చేపట్టామని.. అనేక ఫిర్యాదుల మీద అధికారుల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకున్నామని విజయ్‌కుమార్ చెప్పారు. విచారణలో వెలుగులోకి వచ్చిన అన్ని అంశాల్నీ నివేదికలో పొందుపరిచామని చైర్మన్ వివరించారు.
వెలుగుచూసిన అక్రమాల పుట్ట
అంతకుముందు.. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనేక భూ ఆక్రమణలు, అక్రమాలు చోటుచేసుకున్నాయి. నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీ), భూస్థితి మార్పు, రికార్డుల ట్యాంపరింగ్, ప్రభుత్వ స్థలాల్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు కట్టబెట్టడం, 22ఎ తదితర అంశాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై సిట్ జరిపిన దర్యాప్తులో అనేక అంశాలు వెలుగుచూశాయి. ఈ అక్రమాల్లో ఇద్దరు తహసీల్దార్ల ప్రమేయంతో పాటు కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 13 మండలాల్లో భూ అక్రమాలు భారీగానే జరిగినట్లుగా కూడా గుర్తించింది. 1996 నుంచి జారీచేసిన 66 ఎన్‌ఓసీలను లోతుగా పరిశీలించి అక్రమాలు జరిగాయని సభ్యులు గుర్తించారు. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వాధికారులు, ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిట్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
సొంత కార్యాలయాలకు సిట్ సిబ్బంది
మరోవైపు.. విచారణ పూర్తికావడంతో సిట్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించారు. సిట్ పరిధిలో పనిచేసేందుకు జిల్లాలోని వివిధ రెవిన్యూ కార్యాలయాల నుంచి 19 మందిని డెప్యుటేషన్‌పై నియమించారు. వీరిని తిరిగి వారి వారి కార్యాలయాలకు పంపించినట్లు సిట్ ఛైర్మన్ విజయ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే 20 బాక్సులతో కూడిన విచారణ పత్రాలను జిల్లా ట్రెజరీ కార్యాలయంలో భద్రపరిచినట్లు వెల్లడించారు.
విశాఖ సిట్ నివేదిక సిద్ధం
Published Wed, Dec 23 2020 3:16 AM | Last Updated on Wed, Dec 23 2020 9:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment