మీదెంత.. మాదెంత?
♦ భూముల స్పష్టతపై వుడా, రెవెన్యూ తర్జనభర్జన
♦ 8 మండలాల్లో తేలని లెక్క
♦ అభివృద్ధికి పనికిరాని స్థలాల్ని త్యజించాలని వుడా నిర్ణయం
విశాఖ నగర అభివృద్ధి సంస్థకు రెవెన్యూ భూముల బదలాయింపు వ్యవహారం తలకు మించిన భారంగా మారింది. రెవెన్యూ అప్పగించిన భూముల్లో వేల ఎకరాలు అభివృద్ధికిపనికిరానివే ఉండటంతో వాటిని త్యజించాలని భావిస్తోంది. మరోవైపు అప్పగించిన భూములు ఎక్కడ ఉన్నాయనే అంశంపై ఇంకా ఎనిమిది మండలాలపై రెవెన్యూ శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
విశాఖసిటీ:
వుడా పరిధి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు గోదావరి జిల్లాల వరకూ విస్తరించి ఉంది. వుడాకు గతంలో 11,610.24 ఎకరాల భూములను రెవెన్యూ శాఖ అప్పగించాలని నిర్ణయించింది. వీటిని వివిధ రకాలుగా అభివృద్ధి చేసి వాటి ద్వారా కొత్త ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవాలని సూచించింది. స్టేట్ ఎలినేషన్ కమిటీ మాత్రం కేవలం 1,431 ఎకరాలకు మాత్రమే ఆమోదముద్ర వేసింది. మిగిలిన భూములన్నీ రెవెన్యూ పరిధిలోనే ఉండిపోయాయి. దీంతో వివిధ అభివృద్ధి పనులకు, ఇతర అవసరాలకు వుడాకు తెలియకుండానే రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాలను ఇతర సంస్థలకు కట్టబెట్టింది. మిగిలిన భూముల్లో వుడా 2,132.72 ఎకరాల్ని వినియోగించుకుంది.
8 మండలాల్లో తేలని లెక్క చిక్కు
ఇదిలా ఉండగా.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు సంబంధించి 8 మండలాల్లో రెవెన్యూ శాఖ అప్పగించిన భూములు ఎక్కడెక్కడున్నాయన్న అంశంపై స్పష్టత రావడం లేదు. అటు రెవెన్యూ రికార్డుల్లోనూ, ఇటు వుడా రికార్డుల్లోనూ సర్వే పరంగా ఇబ్బందులు ఉన్నాయి. విశాఖ జిల్లా పరిధిలో అర్బన్, పెందుర్తి, గాజువాక మండలాల్లోనూ, విజయనగరం జిల్లాలోని డెంకాడ, భోగాపురం, విజయనగరం, కొత్తవలస, పూసపాటిరేగ మండలాల్లోనూ మొత్తం 519 ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వీటిని గుర్తించడంతో పాటు సంయుక్తంగా నిర్వహించాల్సిన 1383.80 ఎకరాల్లో వుడా సిబ్బందితో కలిసి సర్వే చేయాలని జాయింట్ కలెక్టర్ జి.సృజన ఇటీవల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ పూర్తయితే.. వుడా భూములపై స్పష్టత వచ్చే అవకాశముంది.
రెండు వేల ఎకరాలకు నో
భూముల రికార్డులు ట్యాంపరింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో తమ పరిధిలో ఉన్న వుడా భూముల్ని తీసుకోవాలంటూ ఇటీవల కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ వుడా వీసీ బసంత్‌కుమార్‌కు సూచించారు. ఈ భూబదలాయింపు ప్రక్రియ అధికారికంగా సాగాలి. అంటే.. నిబంధనల ప్రకారం ఈ భూములన్నింటికీ నిర్ణీత రుసుం చెల్లించి రెవెన్యూ రికార్డుల నుంచి వుడా రికార్డులకు బదలాయింపు చేసుకోవాలి. ప్రస్తుత ధరల ప్రకారం.. తమకు చెందాల్సిన భూములకు దాదాపు రూ.1400 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
మరోవైపు తమ ఆధీనంలో ఉన్న భూములు స్థితిగతులు, ఆక్రమణకు గురైన వాటి వివరాలు, ఏయే ప్రాంతాల్లో ఎంత భూమి ఉంది., కొండ ప్రాంతంలో ఎంత భూములున్నాయనే వివరాలపై వుడా ఎస్టేట్ విభాగం ఇప్పటి వరకూ 10,226.44 ఎకరాల్లో సర్వే నిర్వహించింది. మొత్తం భూమిలో 3314.84 ఎకరాలను ఖాళీ స్థలాలుగా గుర్తించారు. ఇందులో 2313.31 ఎకరాల్లో కొండ ప్రాంతాలు, గుట్టలు, వాగులు, గెడ్డలు, పచ్చికబయళ్లు, రహదారులు, లోయలున్నాయి. ఇవి అభివృద్ధికి ఏమాత్రం పనికిరావు. బదలాయింపు ప్రక్రియలో ఈ 2,313.31 ఎకరాలకూ రెవెన్యూకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రెవెన్యూ శాఖ 4,214.12 ఎకరాల్ని ఇతర సంస్థలకు ఇప్పటికే కట్టబెట్టేసింది. అంటే మొత్తం దాదాపు 6,527.43 ఎకరాలు వుడాకి కానివే ఉన్నాయి. వీటిని బదలాయింపు ప్రక్రియ నుంచి మినహాయించాలని రెవెన్యూ శాఖను వుడా కోరింది.
త్వరలోనే స్పష్టత వస్తుంది
ఆరు బృందాలతో నిర్వహించిన సర్వే దాదాపు పూర్తయింది. రెవెన్యూతో కలిసి చేయాల్సింది త్వరలోనే పూర్తవుతుంది. అప్పుడే వుడా భూములపై స్పష్టత వస్తుంది. వుడాకు కేటాయించిన భూముల్లో కొంత మేర పలు ప్రభుత్వ శాఖలకు రెవెన్యూ శాఖ అప్పగించింది. వాటి బదులుగా కొన్ని భూముల్ని అప్పగించాలని వీసీ బసంత్‌కుమార్ సూచనల మేరకు రెవెన్యూ అధికారుల్ని కోరాం. అభివృద్ధికి పనికిరాని భూముల్ని బదలాయింపు నుంచి మినహాయించాలని సూచించాం. దీనిపై రెవెన్యూ శాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. – వసంతరాయుడు, వుడా ఎస్టేట్ అధికారి