రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం | Dharmana Prasada Rao On Land Reforms In Andhra Pradesh Assembly | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో భూ సంస్కరణలు ఓ విప్లవం

Published Tue, Sep 26 2023 4:17 AM | Last Updated on Tue, Sep 26 2023 4:28 PM

Dharmana Prasada Rao On Land Reforms In Andhra Pradesh Assembly - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెచ్చిన భూసంస్కరణలు ఓ విప్లవమని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం అన్నింటినీ ఎదుర్కొని కేవలం నాలుగేళ్లలోనే ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. ఈ సంస్కరణలు రాష్ట్రంలోని లక్షలాది పేద కుటుంబాల జీవన స్థితిగతులను మారుస్తాయని, వారి గౌర­వాన్ని పెంచుతాయని వివరించారు.

సీఎం జగన్‌ చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ  సంస్కరణలు తెచ్చారని తెలిపారు. భూమి యాజమాన్యం, వినియోగదారులకు సంబంధించి ఈ నాలుగేళ్లు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ – రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే – పేదల కోసం చుక్కల భూముల సంస్కరణలు’ అనే అంశంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు.

అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా 15 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పారు. 28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. భూమి టైటిల్‌ ఫ్రీగా ఉంటే పెట్టుబడులు తెస్తుందని, దానివల్ల ఉద్యోగాలు వస్తాయని, తద్వారా జీడీపీ పెరిగి రాష్ట్రం వృద్ధిలోకి వస్తుందని తెలిపారు.

భూమిని సరిగా వినియోగంలో తీసుకురాలేకపోతే అది సరైన పాలన కాదని అన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలూ భూమిని లిటిగేషన్‌ ఫ్రీ చేస్తున్నాయని చెప్పారు. భూమి వినియోగంలో లేకుండా చేస్తే చెడు ప్రభావాలు పెరుగుతాయన్నారు. అసైన్డ్‌ భూముల చట్ట సవరణ భూమిని అమ్మడానికి చేసినది కాదని, వాటిపై సర్వ హక్కులు కల్పించడం కోసమని చెప్పారు.

ఎప్పుడైనా దాన్ని ఉపయోగించుకునేలా ప్రైవేటు భూమితో సరిసమానమైన హక్కులు కల్పించామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తెచ్చిన ఈ సంస్కరణలను ప్రజలు బాగా స్వీకరించారని, ఇంత పెద్ద సమస్యకు ఆర్డినెన్స్‌ ఇస్తే ఒక్క విమర్శ కూడా రాలేదన్నారు. అసైన్‌మెంట్‌ జరిగి 20 సంవత్సరాలు దాటితే యాజమాన్య హక్కులు లభిస్తాయన్నారు.

ఈ భూముల యజమానులు ఎన్‌ఓసీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదని చెప్పారు. అధికారులు వీటి జాబితాను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపుతారని, ప్రజలకు ఇబ్బంది లేకుండా అక్కడ ప్రక్రియ అంతా జరుగుతుందని చెప్పారు. 

ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన వాడే నాయకుడు 
ప్రజల కష్టాలను తగ్గించి, జీవన ప్రమాణాలు పెంచి, వారి గుండుల్లో చిరకాలం ఉండే వాడు, పెద్ద ఎత్తున జరిగే దాడిని తట్టుకుని సంస్కరణలు చేయగలిగిన వాడే నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడే వైఎస్‌ జగన్‌ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చే సమయానికి పేదలకు భూమి ఇస్తే, అది మళ్లీ ధనవంతుల దగ్గరకు చేరిపోయే పరిస్థితి ఉందని, అందుకే పేదలకిచ్చిన భూముల్ని అమ్మకూడదని, వ్యవసాయం మాత్రమే చేయాలని నిబంధన పెట్టారని తెలిపారు.

ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేనందున, ఇంకా భూమిని ప్రభుత్వం చేతుల్లోనే పెట్టుకోవడం సరికాదని,  ఆ భూములపై వారికి సర్వ హక్కులు ఇవ్వాల్సిందేనని సీఎం జగన్‌ భావించారని తెలిపారు. పేద రైతుల గౌరవాన్ని పెంచడానికి అసైన్డ్‌ భూముల చట్టానికి సీఎం సవరణ సవరణ చేశారని తెలిపారు. దీనివల్ల 15 లక్షల కుటుంబాల సామాజిక స్థితి మారి, వారికి గౌరవం ఏర్పడుతుందన్నారు.

28 లక్షల ఎకరాల భూమిపై ఒకేసారి యాజమాన్య హక్కులు రాబోతున్నాయని తెలిపారు. ఎవరూ కోరకుండానే సీఎం జగన్‌ ఈ సంస్కరణలు తెచ్చారని తెలిపారు. దీనిపై బాగా అధ్యయనం చేశామని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు వెళ్లి చూశామని, అన్నింటిపైనా చర్చింన తర్వాత అక్కడికంటే సరళంగా సీఎం చట్టాన్ని మార్చారని చెప్పారు.  

వైఎస్సార్‌ తర్వాత మళ్లీ ఇప్పుడే భూ పంపిణీ 
అనాధీన భూములను క్రమబద్దీకరించి, వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యనూ సీఎం జగన్‌ పరిష్కరించారని చెప్పారు. దీనిద్వారా 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొందాయని, ఆ రైతులకు హక్కులు వచ్చాయని తెలిపారు. దళితవాడల్లో భూమి కొని అయినా శ్వశానవాటికలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించినట్లు తెలిపారు.

భూ పంపిణీ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ హయాంలో జరిగిందని, అప్పట్లో 7 లక్షల ఎకరాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు భూ పంపిణీ చేయాలని సీఎం జగన్‌ నిర్ణయించారని తెలిపారు. సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, త్వరలో సభ పెట్టి పంపిణీ ప్రారంభిస్తారని చెప్పారు. అసైన్డ్‌ భూముల చట్టంలో ఇళ్ల స్థలాలపై ఉన్న ఆటంకాన్ని కూడా ముఖ్యమంత్రి ఎత్తివేశారని, 10 సంవత్సరాల తర్వాత ఆ స్థలాలను అమ్ముకోవచ్చని తెలిపారు.  

31 లక్షల మందికి ఇళ్ల స్థలాలివ్వడం గొప్ప విషయం 
31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం గొప్ప విషయమని మంత్రి చెప్పారు. ఇందుకోసం భూమని కొనడానికి రూ. 12 వేల కోట్లు ఖర్చయినా సీఎం జగన్‌ వెనకడుగు వేయలేదని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల్లో పేదల కోసం భూమి కొనడానికి రూ.12 వేల కోట్లు బడ్జెట్‌లో పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమేనని చెప్పారు.

ఆ కాలనీల్లో సౌకర్యాలు కల్పించడానికి ఇంకా చాలా ఖర్చు పెడుతున్నామని తెలిపారు. ఈ స్థలాల లేఅవుట్లు, అక్కడ కల్పిస్తున్న వసతులు చూసి అక్కడికి వెళ్లాలని చాలామంది అనుకుంటున్నారని తెలిపారు. ఇదంతా  కేవలం రెండేళ్లలోనే వచ్చిందన్నారు. ఈర‡్ష్యతో ఉన్న వాళ్లు తప్ప ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా ఎవరుంటారని ప్రశ్నించారు.  

సర్వే జరక్కపోవడం వల్లే గ్రామాల్లో వివాదాలు 
బ్రిటిషర్ల కాలంలో భూముల సర్వే జరిగిందని, అప్పటి నుంచి మళ్లీ సర్వే జరక్కపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయని చెప్పారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ రీ సర్వే ప్రారంభించారని తెలిపారు. 17 వేల గ్రామాలకుగానూ 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని,  రెండు నెలలకు 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని తెలిపారు.

15 శాతం మందికి ఖాతా నంబర్లు కూడా లేవని, 1.20 లక్షల మందికి ఎఫ్‌ఎంబీలు కూడా కనిపించడంలేదన్నారు. ఒక్క సర్వే జరిగితే ఇలాంటివన్నీ పరిష్కారమవుతాయన్నారు. 5 సెంటీమీటర్ల కచ్చితత్వంతో సర్వే చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10 వేల మంది సర్వేయర్లను నియమించామని, పరికరాల కోసం ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు.

దేశంలో సమగ్రమైన సర్వే చేసిన రాష్ట్రంగా ఏపీ ఆదర్శంగా నిలవబోతోందన్నారు. దీనివల్ల ప్రయోజనం పొందుతున్న ఏ ఒక్క రైతు పైసా పెట్టక్కర్లేదన్నారు. ఇవన్నీ భవిష్యత్‌ తరాల కోసం చేసే పనులని, రాజనీతిజు్ఞలే ఈ పనులు చేస్తారని చెప్పారు. 

ఇవన్నీ ఓట్ల కోసం చేసేది కాదు 
ఒక స్కూల్‌ పిల్లాడికి అవసరమైన అన్నింటినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అందిస్తున్నారని మంత్రి చెప్పారు. పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, బూట్లు, సాక్సులు ఇవ్వడం.. మంచి టీచర్‌ను పెట్టడం, వారికి భోజనం పెట్టడం.. ఒకవేళ వాళ్లమ్మ పనికి పంపేస్తుందనే భయంతో ఆమెకు డబ్బులివ్వడం.. ఇవన్నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం సీఎం జగన్‌ చేస్తున్న కార్యక్రమాలని తెలిపారు. ఓట్ల కోసం కాదని చెప్పారు.

తల్లితండ్రులు, పిల్లల కోసం దేశంలో ఎక్కడా లేని మంచి విద్యా వ్యవస్థను సీఎం జగన్‌ ఇక్కడ తెచ్చారన్నారు. టీచర్లంటే తనకు చాలా అభిమానం ఉందని, వారిపై వ్యతిరేకత లేదని చెప్పారు. వారు కోరకుండానే విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని, దీన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చేయాలని అన్నానని, దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అవసరమైతే తన మాటలను ఉపసంహరించుకుంటానని చెప్పారు. 

ప్రతి సెక్రటేరియట్‌ ఓ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం 
సామాన్యలు మరింత త్వరతగతిన రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి సీఎం జగన్‌ కొత్తగా టైటిలింగ్‌ యాక్ట్‌ తెస్తున్నారని చెప్పారు. దీని ద్వారా రిజిస్ట్రేషన్‌తోపాటే మ్యుటేషన్‌ కూడా జరిగిపోతుందన్నారు. ప్రతి గ్రామ సెక్రటేరియేట్‌ ఒక రిజిస్ట్రేషన్‌ కార్యాలయం కాబోతోందన్నారు. కొత్త చట్టం వచ్చాక ఆర్‌ఓఆర్‌ చట్టం ఉండదన్నారు. ఒకే ఆస్తిని రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయడం వంటివి ఉండవన్నారు. క్లియర్‌ టైటిల్‌తో ఉండే రాష్ట్రంగా ఏపీ నిలవబోతోందన్నారు.

వంద సంవత్సరాలుగా కృశించినపోయిన రెవెన్యూ శాఖను సీఎం జగన్‌ కోట్లాది మంది ఆకాంక్షలకు అనుగుణంగా మార్చారని తెలిపారు. వెబ్‌ల్యాండ్‌లో తప్పులు సరి చేయడానికి తహశీల్దార్‌కి అధికారాలు ఇచ్చారన్నారు. ఎస్సీ కోఆపరేటివ్‌ భూములకు పట్టాలివ్వడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దేవాలయాల సర్వీస్‌ ఈనాం భూములపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. 
  
రెవెన్యూలో విప్లవాత్మక మార్పులు: శాసన వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి 
రెవెన్యూ వ్యవస్థలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. అసైన్డ్, చుక్కల భూముల సమస్యలు పరిష్కరించడం వల్ల కొన్ని లక్షల మంది దళితులు, బీసీలు, పేదలకు లబ్ధి కలిగింది. అసైన్డ్‌ భూములపై హక్కులు నిరుపేదలకు వరం.

గత ప్రభుత్వంలో రెవెన్యూ విషయంలో చాలా తప్పలు జరిగాయి. ఒకరి భూములను మరొకరు ఆన్‌లైన్‌ చేయించుకున్న దాఖలాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కోరుతున్నా. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెవెన్యూ లోపాలపై గట్టిగా దృష్టి సారించి, వాటిని సవరిస్తోంది. హక్కుదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తోంది. ఇది పేదల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. 
 
అసైన్డ్‌ హక్కులు చారిత్రాత్మకం : సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అసైన్డ్‌ భూములపై హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. అనేక జటిలమైన సమస్యలకు సీఎం జగన్‌ ఈరోజు పరిష్కారాలు చూపిస్తున్నారు. చంద్రబాబు ఫిలాసఫీ హైటెక్‌. సీఎం జగన్‌ ఫిలాసఫీ లోకల్‌టెక్‌. చంద్రబాబు కార్పొరేట్‌ శక్తుల్ని ప్రేమిస్తే.. జగన్‌ కార్మికుల్ని ప్రేమిస్తారు. భూమాతను కొందరికే సొంతం చేసిన చరిత్ర బాబుది.

అదే భూమిని పేదలకు ఇచ్చి వారికి హక్కులు కల్పించిన సీఎం జగన్‌. చంద్రబాబు రాజమండ్రిలో ప్రజలను చంపిన చోటే దేవుడు ఆయన్ని జైల్లో పెట్టాడు. 31 లక్షల మందికి ఇళ్ల పట్లాలు లేవనే విషయం చద్రబాబుకు తెలుసా? ఒక సినిమా హీరో విలన్‌కి సపోర్ట్‌ చేస్తున్నాడు. నైపుణ్యమైన దొంగను కాపాడ్డానికి హీరో వెళ్లాడు. ఆయన హీరో కాదు విలన్‌. అణగారిన వర్గాలకు, బలిసిన వాళ్లకి మధ్య యుద్ధం జరుగుతోంది. 
 
బాబు అసైన్డ్‌ భూముల్ని దోచుకున్నారు.. జగన్‌ వాటిపై హక్కులిచ్చారు: నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం జగన్మోహనరావు 
చంద్రబాబు అసైన్డ్‌ భూములను దోచుకుంటే, సీఎం వైఎస్‌ జగన్‌ వాటిపై పేదలకు హక్కులు కల్పించారు. బాబు హయాంలో క్యాపిటల్‌ రీజియన్‌లో 1,400 ఎకరాల అసైన్డ్‌ భూములను దోచుకున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో అసైన్డ్‌ రైతులను భయపెట్టి వారి భూముల్ని లాక్కున్నారు. చుక్కల భూములు, షరతుల గల భూములు వంటి లక్షల ఎకరాలపై హక్కులివ్వడం ఎప్పుడూ జరగలేదు. సమగ్ర భూ సర్వేను స్వాతంత్య్రం  వచ్చాక  ఏ ప్రభుత్వం చేపట్టలేదు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఈ సర్వే జరుగుతోంది. 
 
అభినవ కొమరం భీం జగన్‌ : పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి 
అసైన్డ్‌ భూములకు సీఎం వైఎస్‌ జగన్‌ సంపూర్ణమైన యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మకం. ఈ నిర్ణయం లక్షలాది రైతుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ భూములకు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు. గిరిజనులకు భూములపై సర్వ హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినవ అంబేద్కర్‌.. అభినవ కొమరం భీం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement