సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల శాఖలో నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూములపై అనేక వినతులు వస్తున్నాయి. వీటిపైనే ఎక్కువగా వివాదాలు కూడా ఏర్పడుతున్నాయి. అనేక రకాల ఇబ్బందులు సైతం ఉండటంతో ఈ భూములకు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లా స్థాయిలో పరిష్కారం కావాల్సిన అనేక ఫైళ్లు భూ పరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ)కు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టంలో సెక్షన్–22ఏ కింద నమోదైన భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండదు. 22–ఏ(1)ఏ నుంచి 22ఏ (1)ఈ వరకు ఉన్న 5 రకాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు.
ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం అనుమతిస్తే తప్ప ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో పలు కారణాలతో ఇలాంటి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఇవ్వాలని వినతులు వస్తున్నాయి. వివాదాల భయం, స్పష్టత లేకపోవడం, సిబ్బంది కొరత వంటి కారణాల వల్ల వాటిని క్లియర్ చేసేందుకు చాలాకాలం నుంచి ప్రయత్నం జరగలేదు. దీంతో ఇలా వచ్చే ఫైళ్లు పేరుకుపోయాయి. కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏ కార్యాలయంలో 18 లక్షలకు పైగా ఫైళ్లు ఇలా పెండింగ్‌లో ఉన్నట్టు ఇటీవల గుర్తించారు.
అవి ఏ దశలో ఉన్నాయి, పరిష్కరించేందుకు గల అవకాశాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఉన్నతాధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ ఉద్యోగులతో ఏర్పాటైన ఈ కమిటీ ఆ ఫైళ్ల పూర్తి వివరాలను సేకరిస్తోంది. వాటన్నింటినీ క్రోడీకరించి సీసీఎల్‌ఏకు నివేదిక ఇవ్వనుంది. దాన్ని పరిశీలించి ఫైళ్లను క్లియర్ చేసేందుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి సీసీఎల్‌ఏ ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
‘భూముల’ సమస్య పరిష్కారానికి చర్యలు
Published Sun, Oct 10 2021 4:15 AM | Last Updated on Sun, Oct 10 2021 4:15 AM
Comments
Please login to add a commentAdd a comment