
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల పేరిట పలు జిల్లాల్లో భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రి నిర్మాణం కోసం 50 ఎకరాలను, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం 29.60 ఎకరాల భూమిని కేటాయించింది.
అదేవిధంగా గుంటూరు జిల్లా జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 12.58 ఎకరాలను కేటాయించింది. కాకినాడ అర్బన్ మండలం రమణయ్య పేటలో 15.76 ఎకరాలను రంగరాయ వైద్య కళాశాల స్థాయి పెంపు కోసం కేటాయించింది. అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రభుత్వ వైద్య కళాశాల కోసం పశు సంవర్థక శాఖకు చెందిన 48.49 ఎకరాలను బదలాయించింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రుల కోసం ఉచితంగా భూములను కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment