
సాక్షి, అమరావతి: ఉగాది పర్వదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీతోపాటు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవరోధం తొలగిపోయింది. ఈ నేపథ్యంలో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో 26 లక్షల మందికి నివాస స్థల పట్టాలను కన్వేయన్స్ డీడ్స్ (విక్రయ దస్తావేజుల) రూపంలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.
సంక్షేమం ఇక చకచకా.. నిధులు విడుదల
- ఇళ్ల స్థలాల కోసం భూమి ఇచ్చిన వారికి పరిహారం చెల్లింపు, ప్లాట్ల అభివృద్ధి కోసం రెవెన్యూ శాఖ తాజాగా బుధవారం రూ.1,400 కోట్లు విడుదల చేసింది.
- రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ పేరుతో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి జీఓ జారీ చేశారు.
- ఈ నిధుల్లో కృష్ణాకు రూ.450 కోట్లు, గుంటూరుకు రూ.450 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాకు రూ.200 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.300 కోట్లు చొప్పున కేటాయించారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.5000 కోట్లు విడుదల చేసింది.
- త్వరితగతిన ఫ్లాటింగ్, పట్టాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులు జిల్లాల అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment