
భూ క్రమబద్ధీకరణలో ఆన్‌లైన్‌కు మంగళం!
♦ మాన్యువల్‌గానే కన్వేయన్స్ డీడ్‌ల జారీ
♦ జాప్యాన్ని నివారించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయం
♦ సాఫ్ట్‌వేర్ కోసం ఖర్చు చేసిన కోటి వృథా
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపు కేటగిరీలో జీవో 59 కింద కన్వేయన్స్ డీడ్‌ల జారీని ఆన్‌లైన్‌లో కాకుండా మాన్యువల్‌గానే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూము ల్లో నివాసమేర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను నిర్దేశిత ధర చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం 2014 డిసెంబర్‌లో జీవో 59ని జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తర్వులు జారీ అయిన మూడు నెలల్లో ఈ ప్రక్రియను ముగించాల్సి ఉండగా, ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఒక్క దరఖాస్తును కూడా అధికారులు క్లియర్ చేయలేదు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన సొమ్మును ఒకేసారి చెల్లించిన దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎడతెగని జాప్యం నెలకొనడాన్ని సర్కారు సీరియస్‌గా తీసుకుంది. సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కలుగజేసుకుని తక్షణం ఆన్‌లైన్ ప్రక్రియను నిలిపివేసి మాన్యువల్‌గా కన్వీయన్స్ డీడ్‌లు జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని ఆదేశించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారని తెలుస్తోంది.
ఆన్‌లైన్‌తో అవస్థలెన్నో..
క్రమబద్ధీకరణ ప్రక్రియలో అవకతవకలను నియంత్రిం చేందుకని భూపరిపాలన విభాగం ఆన్‌లైన్ ప్రక్రియను చేపట్టింది. దీనికోసం రూ.కోటి వ్యయం చేసి సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేక చేసిన తప్పులను ఎడిట్ చేసేందుకు ఆప్షన్ ఇవ్వాలని తహసీల్దార్లు పలుమార్లు కోరినా సీసీఎల్‌ఏ కార్యాలయ అధికారులు ససేమిరా అనడం, దరఖాస్తులో పేర్కొన్న విస్తీర్ణానికి, పరిశీలనలో తేలిన వివరాలకు వ్యత్యాసం ఉండటం, దరఖాస్తుదారులు రెండు మూడు దఫాలుగా సొమ్ము చెల్లించిన నేపథ్యంలో కొంత మొత్తం ఎక్కువగా ఉన్నా సాఫ్ట్‌వేర్ అనుమతించకపోవడం, ఆపై ఎడిట్ ఆప్షన్‌ను ఉన్నతాధికారులు ఇవ్వకపోవడం.. తదితర అంశాలతో క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు ఇబ్బం దులు పడాల్సి వచ్చింది. తీరా రెండ్రోజుల క్రితం ఎడిట్ ఆప్షన్ ఇచ్చాక కూడా అనుమతి కోసం తహసీల్దారు పంపిన వివరాలు ఆన్‌లైన్‌లో ఆర్డీవోకు చేరకపోవడం, కమర్షియల్ స్థలాలకు సాఫ్ట్‌వేర్ ద్వారా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోవడం.. తదితర సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాస్తవానికి నివాస స్థలాలకు పరిశీలన ప్రక్రియ మొత్తం గత డిసెంబర్‌లోనే పూర్తయినా కేవలం ఎడిట్ ఆప్షన్ కోసం 4 నెలలు ఆగాల్సి వచ్చిందని తహసీల్దార్లు వాపోతున్నారు.
రూ. కోటి వృథా: భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ కోసం సుమారు రూ.కోటి వ్యయం చేసి తీసుకున్న సాఫ్ట్‌వేర్, తాజా నిర్ణయంతో వృథా అయిపోయింది. ఆన్‌లైన్ ప్రక్రియలో ఇబ్బందులున్నాయని, గతంలోనే తహసీల్దార్లు, ఆర్డీవోలు చెప్పినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. సీఎం కలుగజేసుకుంటే తప్ప, క్రమబద్ధీకరణ ప్రక్రియ కొలి క్కి రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని పలువురు తహసీల్దార్లు, ఆర్డీవోలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.