ఇదేం దోపిడీ బాబూ!
ఎకరా రూ. 25 లక్షల విలువైన భూమికి రూ. 2.25 లక్షల పరిహారం
సాక్షి, హైదరాబాద్: ఎకరా రూ. 25 లక్షల మార్కెట్ విలువగల భూమిని నిరుపేదల నుంచి తీసుకున్న ప్రభుత్వం అందుకు ప్రతిగా నిర్వాసితులకు ఎకరాకు రూ. 2.25 లక్షల నామమాత్రపు పరిహారం చెల్లిస్తుందట. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ఇది. విశాఖ జిల్లాలోని ఫార్మా సెజ్ కోసం భీమునిపట్నం మండలం అన్నవరం, చిప్పాడల్లో 25.74 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ప్రభుత్వం కేటాయించింది.
దీని మార్కెట్ ధరను అధికారులు ఎకరాకు రూ. 25 లక్షలుగా ప్రతిపాదించారు. దీన్ని భూ యాజమాన్య సంస్థ కూడా ఆమోదించినా, ఎకరా రూ. 12 లక్షల ధరతోనే ఏపీఐఐసీకి 25.74 ఎకరాలు కేటాయించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. ఇలా సగం కంటే తక్కువ ధరకే ఫార్మా సెజ్‌కు భూమిని కట్టబెట్టింది.
కాగా ఈ భూమిలో కొంత అసైన్‌మెంట్ భూమి ఉంది. ఈ భూమి యజమానులకు ఎకరాకు రూ. 2.25 లక్షల పరిహారం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తామనడం విచిత్రం. దీనిపై రెవెన్యూ అధికారులే ఆశ్చర్య పోతున్నారు.