మృత్యుఘోష.. అచ్యుతాపురం సెజ్‌లో భారీ విస్ఫోటం
సాక్షి, అనకాపల్లి, అచ్యుతాపురం: అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. మధ్యాహ్నం 2.15 గంటలు.. భోజన విరామం.. ఇటు విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్తున్నవారు.. అటు రెండో షిఫ్ట్ కోసం వస్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. అకస్మాత్తుగా భారీ పేలుడు.. ఏడంతస్తుల భవనం చిగురుటాకులా కంపించింది. చుట్టూ కిలోమీటర్ మేర దట్టమైన పొగలు.. ఏం జరిగిందో తెలుసుకునే లోపే నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. పలువురు అపస్మారక స్థితికి చేరుకున్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు.. మాసం ముద్దలు.. ఒలికిన రసాయనాలు.. ఫ్లోరంతా రక్తపు చారికలు, హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. భవనం కిందనున్నవారు చూస్తుండగానే తమ సహచరుల శరీర భాగాలు గాల్లో ఎగురుతూ కనిపించాయి. కొన్ని మృత దేహాలు యంత్రాలకు, చెట్లకు వేలాడుతున్నాయి. దట్టమైన పొగల మధ్య నుంచి బయటకు పరుగులు తీస్తున్న కార్మీకులకు ఊపిరాడని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని ఎసైన్షియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో 17 మంది మరణించారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎసైన్షియా కంపెనీ ప్రధాన కార్యాలయంలో రియాక్టర్ పేలిపోవడంతో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా ఎందరున్నారో.. రక్తపు ముద్దలు, శరీర భాగాలు ఎవరివో తెలియని విషాద పరిస్థితి నెలకొంది. పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో హెచ్‌పీసీఎల్ తర్వాత ఆ స్థాయిలో కార్మీకులు/సిబ్బంది ఈ దుర్ఘటనలోనే చనిపోయినట్లు చెబుతున్నారు. పెను విషాదం చోటు చేసుకున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బాధితులను ఓదార్చే ప్రయత్నం చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమవారి సమాచారం కోసం కంపెనీ ముందు ఆతృతగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల బంధువులు పేలుడు ధాటికి తునాతునకలు.. సెజ్‌లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం అంతులేని విషాదాన్ని నింపింది. ఎసైన్షియాలోని మూడో ఫ్లోర్లో 500 కిలోల సామర్ధ్యం గల రియాక్టర్ పేలిపోవటంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పేలుడు ధాటికి మృతదేçహాలు తునాతునకలుగా చెల్లాచెదురయ్యాయి. చెట్ల కొమ్మలపై.. శ్లాబ్ కింద నుజ్జు నుజ్జుగా కనిపించాయి. ప్రమాదం ధాటికి ఫార్మా కంపెనీ పరిసరాల్లో భీతావహ పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించగా ముగ్గురు అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో, ఒకరు ఉషాప్రైమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరుకున్నారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ప్రమాద స్థలిని పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం కావడంతో.. ఎసైన్షియా కంపెనీలో చిక్కుకున్న కార్మీకులను కాపాడేందుకు 14 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో గోడలు పగిలి దూరంగా పడిపోయాయి. ఫ్యాక్టరీలో రెండు షిప్ట్‌లలో 381 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. భోజన విరామం కావడంతో పేలుడు సంభవించినప్పుడు ఉద్యోగులు తక్కువ సంఖ్యలో విధుల్లో ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదంలో 60 మంది కార్మికులు, ఉద్యోగులు చిక్కుకున్నారు. సాల్వెంట్ మిశ్రమంలో రియాక్షన్‌తో.. అచ్యుతాపురం సెజ్‌లో రూ.200 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీ సెజ్‌లోని ప్లాట్ నం 11, 11ఏ, 12, 12ఏలో 40 ఎకరాల్లో విస్తరించి ఉంది. కంపెనీలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్ధాలు (టానిక్‌లు, డ్రాప్స్), బల్క్ డ్రగ్స్, స్పిరిట్ అండ్ సాల్వెంట్స్ తయారీ, సప్లయింగ్ చేస్తున్నారు. సాల్వెంట్‌లో రియాక్షన్ కారణంగా ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. రసాయన మిశ్రమం కలిసే రెండో రియాక్టర్లో ఈ పేలుడు సంభవించింది. మృతదేహాలు మూట గట్టి..ముక్కలుగా చెల్లాచెదురైన మృతదేహాలను మూటగట్టి గుట్టు చప్పుడు కాకుండా కేజీహెచ్‌కు సుమారు 15 ప్రైవేట్ అంబులెన్స్‌ల్లో రాత్రి 9 గంటల తరువాత తరలించారు. మీడియా ప్రతినిధులు, బాధితుల కుటుంబ సభ్యులు లోపలకి వెళ్లకుండా సెక్యూరిటీ పెంచారు. గాయపడ్డ వారి వివరాలు తెలుసుకునేందుకు కనీసం అంబులెన్స్‌ల వద్దకు కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకుని పోలీసులను భారీగా మోహరించారు.⇒ మొత్తం మృతులు 17 మంది. 9 మంది ఆచూకీ తెలియడం లేదు.⇒ ప్రమాదం జరిగినప్పుడు అణుబాంబు పేలినంత భారీ శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 10 నిమిషాలపాటు చెవులు గింగుర్లు ఎత్తిపోయాయన్నారు.⇒ పేలుడు కంటే భవనం కూలడంతో శిథిలాల మధ్య చిక్కుకొని ఎక్కువమంది మరణించారు.మా వాళ్లేమయ్యారో..!రాంబిల్లి (యలమంచిలి): అచ్యుతాపురం ఫార్మా సెజ్‌లో ప్రమాదం నేపథ్యంలో పలువురు కార్మీకుల ఆచూకీ తెలియకపోవడంతో కంపెనీ వద్ద వారి బంధువులు ఆందోళనకు దిగారు. తమ వారి వివరాలు చెప్పాలని పోలీసులను, కంపెనీ ప్రతినిధులను, అధికారులను వేడుకుంటున్నా కనీస స్పందన లేదని వాపోతున్నారు. బతికే ఉన్నారో.. చనిపోయారో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక, డీఐజీ గోపీనాథ్ జెట్టీ తదితరులు బయటకు వెళ్లకుండా మెయిన్ గేట్ వద్ద అడ్డుకుని బైఠాయించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద స్థలికి రాత్రి 11 గంటల సమయంలో వస్తారనే సమాచారంతో బాధితుల కుటుంబీకులు, బంధువులు ఆకలి దప్పులు మరిచి అక్కడే కూర్చున్నారు. కంపెనీ వెనుక గేటు నుంచి మృతదేహాలను రహస్యంగా తరలిస్తున్నట్లు తెలియడంతో కొందరు అక్కడకు చేరుకుని బైఠాయించారు. కనీసం మృతదేహాలను కూడా చూపలేదని, అన్నింటినీ మూటకట్టి గుట్టుగా తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పరిహారం ప్రకటించే వరకు మృతదేహాలను తీసుకెళ్లబోమని బంధువులు కేజీహెచ్ ఎదుట అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.అమెరికాలో కంపెనీ ఏర్పాటు..ఎసైన్షియా లైఫ్ సైన్సెస్ కంపెనీ 2007లో అమెరికాలోని సౌత్ విండ్సర్‌లో స్థాపించారు. కంపెనీ తన కార్యకలాపాలను అమెరికాతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో నిర్వహిస్తోంది. యాదగిరి పెండ్రి దీన్ని స్థాపించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నారు. యాదగిరి పెండ్రి 15 యూఎస్ పేటెంట్స్ పొందారు. ఈ కంపెనీ 2016లో విశాఖలోని అచ్యుతాపురం సెజ్‌లో రిజిస్టర్ అయ్యింది. 2018లో కార్యకలాపాలను ప్రారంభించింది. వివిధ రకాల సిరప్‌లతో పాటు కొత్త ఔషధాల కోసం ప్రయోగాలు నిర్వహిస్తుంటారు.కేజీహెచ్‌కు 13 మృతదేహాలుమహారాణిపేట (విశాఖ): ప్రమాదంలో మరణించిన 13 మంది మృతదేహాలను బుధవారం రాత్రి విశాఖపట్నం కేజీహెచ్ శవాగారానికి తీసుకొచ్చారు. ప్రమాదంలో తునాతునకలైన శరీరభాగాలను మూటలు కట్టారు. దీంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ఎవరిది ఏ కాలో.. ఎవరిది ఏ చెయ్యో తెలియడం లేదు.మృతుల వివరాలు1. నీలపు రామిరెడ్డి (49), అసోసియేట్ జనరల్ మేనేజర్/అసోసియేట్ డైరెక్టర్, కొత్త వెంకోజీపాలెం, విశాఖపట్నం2. హంస ప్రశాంత్ (34), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పొందూరు, శ్రీకాకుళం జిల్లా3. మహంతి నారాయణరావు (34), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, అర్తమూరు, గరివిడి, విజయనగరం జిల్లా4. కొప్పర్తి గణేష్‌కుమార్ (33), సీనియర్ ఎగ్జిక్యూటివ్, జువ్వలదొడ్డి, బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా5. చల్లపల్లి హారిక (22), ట్రైనీ ఇంజనీర్, రమణయ్యపేట, కాకినాడ6. పైడి రాజశేఖర్ (23) ట్రైనీ ప్రాసెస్ ఇంజనీర్, వంజంగి, ఆముదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా7. మారిశెట్టి సతీశ్ (31), సీనియర్ ఎగ్జిక్యూటివ్, పాశర్లపూడి, తూర్పుగోదావరి జిల్లా8. మొండి నాగబాబు (36), అసిస్టెంట్ మేనేజర్, సామర్లకోట9. నాగేశ్వర రామచంద్రరావు (47), అసిస్టెంట్ మేనేజర్/టీమ్ లీడర్, కూర్మన్నపాలెం, విశాఖ10. వేగి సన్యాసినాయుడు (53), హౌస్ కీపింగ్ బాయ్, అనకాపల్లి11.ఎల్లబిల్లి చిన్నారావు (27), పెయింటర్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా12.జవ్వాది పార్థసారధి (27), ఫిట్టర్, పార్వతీపురం13. పూడి మోహన్దుర్గా ప్రసాద్, హౌస్ కీపింగ్ బాయ్, అచ్యుతాపురం, అనకాపల్లి జిల్లా14.జె.చిరంజీవి (25)15.బి.ఆనందరావు (35)16. ఎం. సురేంద్ర, అశ్వారావుపేట, ఖమ్మం 17. పి.వెంకటసాయి (28)అంబులెన్సులేవీ..ఎసైన్షియాలో ప్రమాదం జరిగాక సుమారు గంటన్నర వరకూ కూడా అంబులెన్స్‌లు కూడా రాలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కంపెనీ బస్సుల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సకాలంలో అంబులెన్స్ వచ్చి.. సరైన ఆసుపత్రిలో వైద్యం అందించి ఉంటే ఒకరిద్దరైనా బతికే అవకాశం ఉండేది. అలాగే అంబులెన్స్‌లు లేకపోవడంతో విశాఖలోని కేజీహెచ్‌కు కూడా క్షతగాత్రులను తరలించలేని పరిస్థితి ఏర్పడింది. తరువాత వచ్చిన పది అంబులెన్స్‌లు మృతదేహాలను తరలించడానికే పనికొచ్చాయి.ప్రమాదానికి కారణమిదే..రియాక్టర్లలో ఆర్గానిక్ కాంపౌండ్స్లో కర్బన రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్థారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వ్యాపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ జరిగింది. అంటే.. ఒక రియాక్టర్‌లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి చేరుకోవడం వల్ల ఆవిరి తీవ్రత పెరిగింది. ఈ ఆవిరి పరిమాణం రియాక్టర్లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారస్థాయికి చేరుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే.. ప్రమాదానికి అసలు కారణాలపై లోతైన దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.నాతో ఉన్న ముగ్గురు చనిపోయారు భోజనం చేసి బ్లాక్‌లోకి వచ్చాను. అప్పుడే భారీ శబ్దం వినిపించింది. ఆ ధాటికి తూలిపోయి కింద పడిపోయాను. లేచి చూస్తే చుట్టూ పొగ.. కష్టంతో కళ్లు తెరిచి చూస్తే నాతోపాటు ఉన్న ముగ్గురు చనిపోయారు. – బి.రాజారావు, వెంకటాపురంఫ్యామిలీకి చెప్పలేదు మాది హనుమకొండ. కంపెనీ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మూడు నెలల కిందట ఇక్కడికి వచ్చా. పేలుడుతో ఏమైందో తెలుసుకునే లోపే శ్లాబ్ పెచ్చులు వేగంగా వచ్చి తలకు తగిలి కుడి వైపు గాయాలయ్యాయి. కంగారు పడతారని కుటుంబ సభ్యులకు ఇంకా ఏమీ చెప్పలేదు.– ప్రభాత్మా అన్నయ్య మృతదేహాన్ని చూపట్లేదుమా అన్నయ్య బీఎన్ రామచంద్రరావు (48) ఇక్కడే పనిచేస్తున్నాడు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే కంపెనీ దగ్గరికి వచ్చా.. అన్నయ్య జాడ తెలియట్లేదు. కంపెనీలో అడిగితే చనిపోయాడని, ఆస్పత్రికి పంపించామని చెబుతున్నారు. కనీసం మృతదేహాన్ని కూడా చూపట్లేదు.– వెంకటలక్ష్మి, అచ్యుతాపురం కళ్లకు ఏమైందో.. మాది విజయనగరం జిల్లా ఎస్.సీతారామపురం. కంపెనీలో నిర్వహణ పనులు చేస్తుంటా. రోజులానే ఈ రోజూ కంపెనీకి వచ్చా. ప్రమాదంలో కళ్లలో ఏదో లిక్విడ్ పడి, రెండు కళ్లూ కనిపించట్లేదు. ముఖమంతా గాయాలతో రక్తపు మరకలయ్యాయి. కళ్లు కనిపిస్తాయో, లేదో కూడా తెలియట్లేదు. – కలిశెట్టి చంద్రశేఖర్సరైన వైద్యం అందట్లేదుచాలా మంది తలకు, కళ్లకు దెబ్బలు తగిలాయి. మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో చేర్చి చాలా గంటలైనా.. వైద్యం మాత్రం సరిగా అందట్లేదు. ఎక్కువ మంది క్షతగాత్రులందరినీ ఒకే ఆస్పత్రిలో చేర్చడంతో ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. – కె.నారాయణరావు, అసిస్టెంట్ మేనేజర్