రైతుల అవసరాలను తీర్చండి
జిల్లా కలెక్టర్ల టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు
కాలిఫోర్నియా వెళ్లి రోడ్లను పరిశీలించాలని అధికారులకు ఆదేశాలు
సాక్షి, విజయవాడ బ్యూరో : ప్రస్తుత ఖరీఫ్, రాబోయే రబీ సీజన్లలో రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులు, విత్తనాలను సమకూర్చాలని రుణ పరపతి అందేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శనివారం ఆయన వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలస్యంగానైనా ఇటీవల కురిసిన భారీ వర్షాలు కొంతమేర మేలు చేశాయని, వ్యవసాయ, రెవెన్యూ శాఖలను సమన్వయపరిచి రైతాంగానికి అండగా ఉండాలన్నారు. తన క్యాంపు కార్యాలయంలో పలువురు సందర్శకుల నుంచి వినతులు స్వీకరించారు.
ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష...
రోడ్డు భద్రత కోసం అన్ని ప్రధాన రోడ్లపైనా సీసీ కెమెరాలు అమర్చి నిరంతరం పర్యవేక్షించాలని సీఎం ఆర్ అండ్ బీ శాఖాధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జరిపిన సమీక్షలో మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాలనూ రాజధాని ఔటర్ రింగ్‌రోడ్డుతో అనుసంధానం చేయాలన్నారు. భీమునిపట్నం నుంచి ఒంగోలు మధ్య 216 కోస్తా (బీచ్) జాతీయ రహదారి ఒక మోడల్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు.
కాలిఫోర్నియాలోని పసిఫిక్ కోస్ట్ హైవే తరహాలో ఈ బీచ్ రోడ్డు ఉండాలని అవసరమైతే అధికారులు కాలిఫోర్నియా వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. హిందూపురం బైపాస్‌రోడ్డుతో పాటు బెంగళూరును కలుపుతూ నాలుగులైన్ల రహదారిని నిర్మించాలన్నారు. హైదరాబాద్-కల్వకుర్తి-తిరుపతిని అనుసంధానిస్తే చెన్నైకు దగ్గర దారి అవుతుందని, కడప-రాజంపేట-కోడూరు-తిరుపతిని కలుపుతూ రహదారిని అభివృద్ధి చేయాలన్నారు.
రాష్ట్రంలోనూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్
నేషనల్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ తరహాలో రాష్ర్టంలోనూ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఆదేశించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేషన్ సలహా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ స్థాయిలో గుర్తించిన 42 రంగాల్లోని స్థానిక పారిశ్రామికవేత్తల నేతృత్వంలో దీన్ని ఏర్పాటుచేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు హబ్ అం డ్ స్పోక్ విధానంలో ఆరు క్లస్టర్లలో 36 ఎక్సలెన్స్ సెంటర్‌లను ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ అధికారులు సీఎంకు వివరించారు.
చంద్రబాబును కలిసిన సండ్ర
ఓటుకు నోటు కేసులో అరెస్టయి బెయిల్‌పై విడుదలైన తెలంగాణకు చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే శనివారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు. రెండుగంటల పాటు బాబుతో సమావేశమైనట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీలో ఓటుకు నోటు కేసును ఎలా ఎదుర్కోవాలి, తాను ఏం చెప్పాలనే దానిపై సండ్ర సీఎంతో చర్చించినట్లు సమాచారం.