
ఆదాయ పన్ను రేట్లు ఇంకొన్నాళ్లు యథాతథం
రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: రాబోయే నాలుగేళ్లలో కార్పొరేట్ ట్యాక్స్ 5% మేర తగ్గినా.. వ్యక్తిగత ఆదాయ పన్ను(ఐటీ) రేటు మాత్రం మరికొన్నాళ్లు యథాతథంగానే ఉండగలదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూసినా వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి 30% గరిష్ట పన్ను సరైనదేనని, దీన్ని రాబోయే 3-4 సంవత్సరాల పాటు కొనసాగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం వార్షికంగా రూ. 10 లక్షలపైగా ఆదాయంపై 30 శాతం, రూ. 5-10 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ. 5 లక్షల కన్నా తక్కువ ఆదాయంపై 10 శాతం పన్ను ఉంటోంది. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్ రేటులో కోతపై స్పందిస్తూ.. పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆసియాన్ కూటమి దేశాలతో పోటీపడేందుకు ఈ చర్య ఉపయోగపడగలదని ఒక ఇంటర్వ్యూలో దాస్ పేర్కొన్నారు.
చాలా మటుకు ఆగ్నేయాసియా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే కార్పొరేట్ ట్యాక్స్ అధికంగా ఉందని, అందుకే దీన్ని తగ్గించాలని నిర్ణయించినట్లు వె ల్లడించారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకే ఈ చర్య తీసుకున్నారన్న ఆరోపణలను దాస్ తోసిపుచ్చారు. ఇది కేవలం కంపెనీ స్థాయిలోనే ఉంటుందే తప్ప వ్యక్తిగతంగా ప్రమోటర్లకు గానీ షేర్‌హోల్డర్లకు గానీ ఎలాంటి ప్రయోజనాలూ ఉండవని గుర్తు చేశారు. కార్పొరేట్ల వద్ద మరిన్ని నిధులు ఉంటే మరిన్ని పెట్టుబడులు రాగలవని, తద్వారా మరింతగా ఉపాధి కల్పన జరగగలదన్నది ప్రభుత్వ ఉద్దేశం అని దాస్ చెప్పారు.
సేవా పన్ను పెంపు సముచితమే..
వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) విధానం అమలు దిశగా తాజా బడ్జెట్‌లో సర్వీస్ ట్యాక్స్‌ను 12.36 శాతం నుంచి 14 శాతానికి పెంచడం సరైన నిర్ణయమేనని మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దాస్ తెలిపారు. జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక సేవా పన్నును ఎకాయెకీన 12% నుంచి 22 %కి పెంచేస్తే ఎకానమీ భరించలేదన్నారు.
44 లక్షల మందిపై ఐటీ కన్ను...
భారీ విలువ లావాదేవీలు జరిపినప్పటికీ ఇంకా ఐటీ రిటర్నులు దాఖలు చేయని 44,07,193 మంది కొనుగోలుదారులపై ఆదాయ పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వీరు ఈ నెలాఖరులోగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది, లేదంటే వారిపై తక్షణమే జరిమానాల విధింపు తదితర చర్యలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.