
ఒకేసారి రెండు పండుగలు..!
నేటి నుంచి దసరా ఉత్సవాలు
విజయదశమి రోజున రాజధానికి శంకుస్థాపన
రాష్ర్ట పండుగగా దసరా ఏర్పాట్లపై అధికారుల నిరంతర పర్యవేక్షణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఈ ఏడాది దసరాకు ఒకేసారి రెండు పండుగలు జరుగనున్నాయి. దసరా ఉత్సవాలు ఒకటైతే, రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన రెండోది. దసరాను రాష్ర్ట పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రి విద్యుత్ దీపాల వెలుగులతో ధగధగమెరుస్తోంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహణకు దేవాదాయ, రెవెన్యూ శాఖలు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ బాబు.ఏ ఉత్సవాల ఏర్పాట్లపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి పర్యవేక్షిస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉత్సవాలకు రోజుకు సుమారు 60వేల నుంచి 80 వేల మంది భక్తులు విచ్చేస్తారని ఆలయ అధికారులు అంచనావేశారు. మరో వైపున అమరావతి శంకుస్థాపన పనులు విజయదశమి రోజునే కావడంతో ఈ ఏడాది వీఐపీల తాకిడి అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు.
ఉత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు స్వాగతం పలుకుతూ నగర నాలుగు దిక్కులా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. వినాయకుడి గుడి నుంచి క్యూలైన్ల పనులు పూర్తయ్యాయి. అమ్మవారి దర్శనం పూర్తయిన భక్తులు కొండ దిగువకు చేరుకుందుకు రెండు మార్గాల ద్వారా 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. మహా మండపం వద్ద సాంస్కృతిక కళావేదిక ఏర్పాటు చేసిన అధికారులు భక్తులకు ఆహ్లాదాన్ని కల్పించేలా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఉచిత అన్నప్రసాద విరతణ చేసేందుకు గాను అర్జున వీధిలోని శృంగేరి పీఠంతో పాటు బ్రాహ్మణ వీధిలోని మాజేటి ప్రహ్లాదరావు కల్యాణమండపంలోను ఏర్పాట్లు చేశారు. మరో వైపున ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుకుండా మంచినీటి సదుపాయం, షామియానాల ఏర్పాటుతో పాటు అశోకస్థూపం, ఘాట్‌రోడ్డు, ఓం టర్నింగ్, ఆలయ ప్రాంగణాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.
వీఐపీల కోసం మూడుంచెల విధానం
దసరా ఉత్సవాలు, అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భారీగా వీఐపీలు, రాజకీయ ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉండడంతో కొండపై భాగంలో మూడు అంచెల సెక్యూరిటీగా ఏర్పాటు చేశారు. తొలుత మోడల్ గెస్ట్ హౌస్ నుంచి వీఐపీ వాహనం ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న వారికి అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవుట్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రోటోకాల్ ఆఫీసర్ సదరు వీఐపీని అమ్మవారి దర్శనానికి తీసుకువెళ్లతారు. ఈ దఫా అనధికార వీఐపీలను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు పక్కా ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. సోమవారం జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టర్ నాగలక్ష్మి, దుర్గగుడి ఈవో నర్సింగరావు, ఇతర రెవెన్యూ అధికారులు స్నానఘాట్లు, క్యూలైన్లు, ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఉదయం 9 గంటలకు దర్శనం
దసరా ఉత్సవాలలో తొలి రోజైన మంగళవారం తెల్లవారు జామున అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకరణ, పూజల అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఉదయం 9.30 గంటలకు అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకిపై ఊరేగింపుగా భవానీదీక్ష మండపానికి తీసుకువెళ్లి ప్రతిష్టిస్తారు. ఉదయం 10 గంటలకు భవానీదీక్ష మండపంలో లక్ష కుంకుమార్చన ప్రారంభమవుతుంది. మంగళవారం ఒక బ్యాచ్ మాత్రమే కుంకుమార్చన నిర్వహిస్తారు.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీపీ
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ సోమవారం దుర్గమ్మకు పట్టుచీరను సమర్పించారు. తొలుత వన్‌టౌన్ పీఎస్‌కు చేరుకున్న సీపీ స్టేషన్‌లో అమ్మవారిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, తీన్‌మాన్ డప్పులతో గుర్రపు బగ్గీపై పట్టుచీరను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు.
అమ్మవారికి పట్టుచీరను సమర్పించేందుకు విచ్చేసిన సీపీకి ఆలయ ఈవో నర్సింగరావు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టుచీరను సమర్పించి ఉత్సవాలు విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో డీసీపీ అశోక్‌కుమార్, కాళీదాసు, వెస్ట్ ఏసీపీ శివరామ్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, పలువురు ఉన్నతాధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.