ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం
► రెండెకరాలు సాగు చేస్తున్నట్టు రికార్డుల్లో నమోదు
► తాడోపేడో తేల్చుకునేందుకు
► రాజుపేట గ్రామస్తుల నిర్ణయం
వడ్డించేవాడు మనోడైతో బంతిలో అఖరిన కూర్చొన్న అన్నీ అందుతాయన్న సామెత అక్షరాల నిజం అనిపిస్తుంది. అధికారం ఉంది కదా అని అధికారులను ప్రసన్నం చేసుకొని ఏకంగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేస్తున్న సంఘటన మండలంలోని రాజుపేటలో చోటు చేసుకుంది. గ్రామంతో సంబంధం లేని వ్యక్తి పేరిట రెండెకరాల స్థలం ఉండటం మరింత బలం చేకూర్చుతోంది.
మునగపాక: మండలంలోని రాజుపేట గ్రామంలో సర్వే నంబరు 310లో 5.16 ఎకరాల మేర ప్రభుత్వ స్థలాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పోర్స్ట్ కాంప్లెక్స్‌కు కేటాయించారు. అయితే మండల కేంద్రానికి దూరంగా ఉన్నందున ఖాళీగా ఉండిపోయింది. అయితే ఈస్థలాన్ని కాజేసేందుకు అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. ఇదే అదనుగా భావించిన తిమ్మరాజుపేట గ్రామానికి చెందిన భీమిశెట్టి వెంకటరమణ తాను గత కొంతకాలంగా సర్వేనంబర్ 310 -1లో 2 ఎకరాల స్థలాన్ని సాగు చేస్తున్నట్లు రికార్డులు సృష్టించి పట్టాదారు పాసు పుస్తకం పొందినట్టు సమాచారం. రెవెన్యూశాఖ, భూమి రికార్డుల కంప్యూటరీకరణలో పట్టాదారుని అడంగల్, సహానీ కాఫీలో రైతు పేరు భీమిశెట్టి వెంకటరమణ , సన్‌ఆఫ్ లేటు జగ్గారావు, ఖాతా నంబర్ 283, సర్వేనెంబర్ 310-1లో 2 ఎకరాల సాగు చేస్తున్నట్లు ఉండటంతో గ్రామస్తులు కంగుతిన్నారు. ప్రభుత్వ భూమిని తాము సాగులో ఉన్నామంటూ పొందుపరచడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా చోటుచేసుకుందని వారు ధ్వజమెత్తుతున్నారు.
దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు రాజుపేట గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. రాజుపేట పంచాయతీలో ప్రభుత్వ భూమికి సంబంధించి తిమ్మరాజుపేట గ్రామస్తుల పేరిట రికార్డులో నమోదు కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండదండలతోనే ఇదంతా జరిగిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై తహశీల్దార్ రాంబాబును వివరణ కోరగా ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అడంగల్‌లో తిమ్మరాజుపేట వాసిపేరిట ఎలా నమోదైందన్న దానిపై విచారణ చేస్తామని చెప్పారు.