అధికార భూదందా
టీడీపీ చేతిలో రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి
‘అధికార’ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ
మండిపడుతున్న పుత్తూరు పట్టణ ప్రజలు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో చోటా నాయకులంతా ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ ఆక్రమణలకు సిద్ధపడుతున్నారు. తాజాగా పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం తమ్ముళ్లు విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే భూమిలో ఉన్న ముళ్ల కంపలు తొలగించి చదును చేశారు. స్థానిక తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించినా ఫలితం లేకపోరుుంది.
విజయపురం: పట్టణంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిని ఆనుకుని చెర్లోపల్లి రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 19లో సుమారు 3.84 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో గతంలో నెత్తం గ్రామానికి చెందిన వారు శ్మశాన స్థలంగా వాడుకునేవారు. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. గత కొన్నేళ్లుగా ఈ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్థలంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేశారు. ఈ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖాధికారులు కనీసం ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు కూడా పెట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నేతల మద్దతు ఉండడంతో రెవెన్యూ శాఖాధికారుల ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్థలం ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. పుత్తూరు పట్టణవాసులు తెలిపారు. పేదల పేరు చెప్పి టీడీపీ నాయకులు ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఈ భూమిలో కొంత కాల్వ పోరంబోకు భూమి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆక్రమణదారులు కాల్వను సైతం మట్టితో కప్పేశారు.
ఇందులో ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నెత్తం గ్రామస్తులు కొందరు ఈ భూమిలో పాకలు వేసుకున్నారు. అరుుతే రెవెన్యూ శాఖాధికారులు శ్మశాన స్థలంతో పాటు చట్ట ప్రకారం కాల్వ పోరంబోకు స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి పేదలు వేసిన పాకలను పీకి పారేశారు. దీనిపై పేదలు పలుమార్లు ధర్నాలు కూడా చేసినా అధికారులు ససేమిరా అన్నారు. కాని ప్రస్తుతం మాత్రం టీడీపీ నాయకుల ఒత్తిడితో పచ్చ తమ్ముళ్ల ఆక్రమణను రెవె న్యూ శాఖాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారుు. అంతే కాకుండా రెవెన్యూ అధికారులను ఓ పేరు మోసిన అధికార పార్టీ నాయకుడు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకుని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పుత్తూరు, చెర్లోపల్లి, నెత్తం గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు.
మా ఆధీనంలోనే ఉంది
రెండు రోజులకు ముందు నెత్తం గ్రామస్తులు ఇంటి స్థలం కోసం సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ భూమిని చదును చేశారు. అది తెలుసుకొని మేం నిలిపి వేశాం. ఆ భూమి ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. ఎవ్వరూ ఆక్రమించలేదు. - రంగస్వామి, పుత్తూరు తహశీల్దార్