Public land
-
అధికార భూదందా
టీడీపీ చేతిలో రూ.5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ‘అధికార’ నాయకులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ మండిపడుతున్న పుత్తూరు పట్టణ ప్రజలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు విచ్చలవిడిగా భూ దందాలకు పాల్పడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో చోటా నాయకులంతా ఎక్కడ ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ ఆక్రమణలకు సిద్ధపడుతున్నారు. తాజాగా పుత్తూరు పట్టణంలో తెలుగుదేశం తమ్ముళ్లు విలువైన ప్రభుత్వ భూమిపై కన్నేశారు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రే భూమిలో ఉన్న ముళ్ల కంపలు తొలగించి చదును చేశారు. స్థానిక తహశీల్దార్ సంఘటనా స్థలాన్ని సందర్శించినా ఫలితం లేకపోరుుంది. విజయపురం: పట్టణంలోని పుత్తూరు-చిత్తూరు రహదారిని ఆనుకుని చెర్లోపల్లి రోడ్డు సమీపంలో సర్వే నెంబర్ 19లో సుమారు 3.84 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిలో గతంలో నెత్తం గ్రామానికి చెందిన వారు శ్మశాన స్థలంగా వాడుకునేవారు. కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో ఆ భూమిపై టీడీపీ నాయకుల కన్ను పడింది. గత కొన్నేళ్లుగా ఈ భూమి ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం స్థలంలో ఉన్న ముళ్ల చెట్లను తొలగించి స్థలాన్ని చదును చేశారు. ఈ స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖాధికారులు కనీసం ప్రభుత్వ భూమి అని హెచ్చరిక బోర్డు కూడా పెట్టకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఈ ఆక్రమణ వెనుక టీడీపీ నేతల మద్దతు ఉండడంతో రెవెన్యూ శాఖాధికారుల ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోయారు. మార్కెట్ రేట్ ప్రకారం ఈ స్థలం ఖరీదు సుమారు 5 కోట్ల రూపాయలు ధర పలుకుతోంది. పుత్తూరు పట్టణవాసులు తెలిపారు. పేదల పేరు చెప్పి టీడీపీ నాయకులు ఖరీదైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారుు. ఈ భూమిలో కొంత కాల్వ పోరంబోకు భూమి కూడా ఉన్నట్లు తెలిసింది. ఆక్రమణదారులు కాల్వను సైతం మట్టితో కప్పేశారు. ఇందులో ప్లాట్లు వేసి అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నెత్తం గ్రామస్తులు కొందరు ఈ భూమిలో పాకలు వేసుకున్నారు. అరుుతే రెవెన్యూ శాఖాధికారులు శ్మశాన స్థలంతో పాటు చట్ట ప్రకారం కాల్వ పోరంబోకు స్థలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పి పేదలు వేసిన పాకలను పీకి పారేశారు. దీనిపై పేదలు పలుమార్లు ధర్నాలు కూడా చేసినా అధికారులు ససేమిరా అన్నారు. కాని ప్రస్తుతం మాత్రం టీడీపీ నాయకుల ఒత్తిడితో పచ్చ తమ్ముళ్ల ఆక్రమణను రెవె న్యూ శాఖాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నారుు. అంతే కాకుండా రెవెన్యూ అధికారులను ఓ పేరు మోసిన అధికార పార్టీ నాయకుడు ఆ స్థలం వైపు కన్నెత్తి చూడకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకుని కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని పుత్తూరు, చెర్లోపల్లి, నెత్తం గ్రామస్తులు, ప్రజలు కోరుతున్నారు. మా ఆధీనంలోనే ఉంది రెండు రోజులకు ముందు నెత్తం గ్రామస్తులు ఇంటి స్థలం కోసం సర్వే నెంబర్ 19లో ప్రభుత్వ భూమిని చదును చేశారు. అది తెలుసుకొని మేం నిలిపి వేశాం. ఆ భూమి ఇప్పటికీ మా ఆధీనంలోనే ఉంది. ఎవ్వరూ ఆక్రమించలేదు. - రంగస్వామి, పుత్తూరు తహశీల్దార్ -
భూ మాయాజాలం
♦ మనియార్పల్లిలో బహిర్గతం ♦ ప్రభుత్వ భూమి సర్కార్కే విక్రయం ♦ భూ పంపిణీ పథకం అపహాస్యం కోహీర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ పథకం పక్కదారి పట్టింది. ఓ గ్రామంలో ప్రభు త్వ భూమిని ప్రభుత్వానికే విక్రయిం చడం విమర్శలకు దారితీసింది. వాటిని అందుకున్న లబ్ధిదారులు ఏమిపాలుపోక అయోమయంలో పడిపోయారు. మండలంలోని మనియార్‌పల్లి, గొడిగార్‌పల్లి గ్రామాల్లో మొదటి విడత భూపంపిణీ జరిగింది. గొడిగార్పల్లిలో బండరాళ్లతో నిండిన భూములను పంపిణీ చేశారు. మనియార్పల్లిలో ప్రభుత్వ భూమినే తిరిగి కొనుగోలు చేసి పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.యానియార్పల్లికి 31 మార్చి 2015న భూ పంపిణీ పథకం మంజూరైంది. గ్రామ శివారులోని సయ్యద్ షఫియొద్దీన్, వికారొద్దీన్, సిరాజొద్దీన్, అబ్దుల్ నజీర్, ముతాసిమ్లకు చెందిన 170, 186, 187వ సర్వే నంబర్ భూములకు సంబంధించిన 35.30 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. ఈ భూమిని 11 మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయడానికి వీలుగా 16 ఏప్రిల్ 2015న ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. సదరు భూమిని స్థానిక అధికారులతోపాటు ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, అప్పటి జేసీ శరత్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి చరణ్‌దాస్, ఎస్సీ కార్పొరేషన్ డెరైక్టర్ జైరాజ్ తదితరులు పరిశీలించారు. రూ.4.40 లక్షలకు ఎకరా చొప్పున కొనుగోలుకు నిర్ణయించారు. ఆ భూమిలో బోరు వేసి సాగుకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వాలని నిబంధన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన 2 జూన్ 2015న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. అయితే 170 సర్వే నంబర్లోని 9 ఎకరాలు, 186 సర్వే నంబర్లోని 16.67 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు పంపిణీ నివేదికలో సైతం ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. నివేదికలో సమర్పించిన వివరాల ప్రకారం 1954-55 సంవత్సరంలో భూములకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవు. చౌపస్లాలో నాట్ అవైల్ అని రాసి ఉంది. 1959-60లో 170 సర్వే నంబర్ బిచ్చప్ప, 186 సర్వే నంబర్ జాఫర్ పేరిట భూమిని కేటాయించారు. ఆ భూమి 1972-73 పట్టాభూమిగా మార్చారు. 1958 తర్వాత ప్రభుత్వ భూములను అమ్మొద్దు, కొనొద్దు అనే నిబంధన ఉంది. ప్రభుత్వ భూమి కొనడానికి అమ్మడానికి వీలులేని పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఈ విషయమై ఆర్డీఓ మధుకర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్!
పటాన్చెరు: సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో రైళ్ల రద్దీ కారణంగా వాటికి ప్రత్యామ్నాయంగా నగరశివారులోని ఈదులనాగులపల్లి(మెదక్ జిల్లా రామచంద్రాపురం)లో కొత్తగా రైల్వే టెర్మినల్ ఏర్పాటు చేయాలని దక్షిణమధ్య రైల్వే అధికారుల భావిస్తున్నారు. ఇప్పటికే వారు మౌలాలి, ఈదులనాగులపల్లిని పరిశీలించారు. అయితే టెర్మినల్ నిర్మాణానికి కావాల్సిన 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఈదులనాగులపల్లిలో ఉంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఇక్కడ రైల్వే స్టేషన్ ఏర్పాటు కోసం గట్టి ప్రయత్నాలు సాగిస్తూ.. రైల్వే అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తూ వచ్చారు. తాజాగా విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్ ఏర్పాటుపై కలెక్టర్‌తో మాట్లాడినట్లు తెలిసింది. ఇక్కడ టెర్మినల్ ఏర్పాటైతే వికారాబాద్, మెదక్ రైతులకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. దాదాపు సికింద్రాబాద్ స్టేషన్లో ఉండే రైళ్ల రాకపోకల సంఖ్యలో సగం వరకు ఈదులనాగులపల్లికి వచ్చిపోయే అవకాశం ఉంది.కాగా, ఈదులనాగులపల్లిలో రైల్వే టెర్మినల్‌కు అవసరమైన స్థలాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ బొజ్జా పరిశీలించారు. -
150 గజాల వరకూ ఉచితం!
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో పేదల కేటగిరీ పరిధి పెంపు మిగతా కేటగిరీల్లోనూ రాయితీలు పెంపు.. 250 గజాల వరకూ రిజిస్ట్రేషన్ ధరలో 25% చెల్లిస్తే క్రమబద్ధీకరణ 500 గజాల వరకు 50 %, ఆపై విస్తీర్ణమున్న స్థలాలకు 75% కడితే చాలు అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నేడు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అనుకున్నంత స్పందన లేకపోవటం, ఆశించినంత ఆదాయం రాకపోవటంతో ఈ విధానానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు లబ్ధి కల్పించడంతో పాటు సర్కారుకు ఆదాయం ఒనగూరేలా బహుళ ప్రయోజనాలు ఉండేలా మార్పులు చేసేదిశగా మరో కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలం పరిమితిని 125 గజాల నుంచి 150 గజాలకు పెంచాలని భావిస్తోంది. అంతేకాదు మిగతా కేటగిరీల్లో ఇస్తున్న రాయితీలనూ పెంచాలని నిర్ణయించింది. శుక్రవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గత నెల 30న ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 125 గజాల్లోపు స్థలంలో నివాసాలు ఏర్పరచుకున్న నిరుపేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మధ్యతరగతి వర్గాల కోసం 125 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాలపై రిజిస్ట్రేషన్ ధరలో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇచ్చింది. 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్దేశించింది. 500 గజాలపైన స్థలానికి పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమబద్ధీకరణకు తొలుత ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 166 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం ఏడాదిన్నర వ్యవధిలో 1.40 లక్షల దరఖాస్తులు రాగా... తాజాగా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణకు ఇరవై రోజుల వ్యవధిలోనే 1.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా దాదాపు మూడు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ విభాగం అంచనా. కానీ రాష్ట్ర విభజన ప్రభావంతో మార్కెట్లో భూముల ధరలు తగ్గినా, రిజిస్ట్రేషన్ ధరలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివే అమలవుతుండడంతో... భారీ విస్తీర్ణంలో స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు ఈ క్రమబద్ధీకరణకు దూరంగానే ఉన్నారు. దీంతోపాటు 125 గజాలకు మించిన విస్తీర్ణంలోనివాసమున్న నిరుపేదలు డబ్బులు చెల్లించే స్తోమత లేక వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ పథకం పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం రెవెన్యూ, సీసీఎల్ఏ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఇప్పుడున్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి... పేదలకు మరింత ప్రయోజనం ఉండేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమబద్ధీకరణపై సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే ఆశించిన స్పందన రాలేదని.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో నిరుపేదలకు సంబంధించిన ఉచిత క్రమబద్ధీకరణ పరిమితిని 150 గజాల వరకు పెంచాలని నిర్ణయించారు. ఇక రుసుము చెల్లించే కేటగిరీల్లో.. 150 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 25 శాతం... 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు 50 శాతం... 500 గజాలపైబడిన స్థలాలకు 75 శాతం ధరను చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంత రాయితీ పెం చితే.. ఏ మేరకు స్పందన వస్తుంది, ఎంత ఆదా యం సమకూరుతుందనే వివరాలపై సైతం అధికారులు చర్చించారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలుండటంతో.. అలాంటి వాటిని కూడా క్రమబద్ధీకరించే అంశం పరిశీలనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి. -
రూ.4 కోట్ల స్థలం కబ్జా!
సాక్షి ప్రతినిధి,కడప: ప్రభుత్వ భూమి పక్కాగా అన్యాక్రాంతమైంది. పరిరక్షించాల్సిన యంత్రాంగం మత్తులో ఉంది. ప్రభుత్వ భూమికే ప్రజాధనం పరిహారంగా అప్పగించాలని రాష్ట్ర ఘనుల శాఖ సిద్ధమౌతోంది. ఓ రాజకీయ నాయకుడు, ఉన్నతాధికారి పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగించారు. అక్రమంగా పరిహారం పొందేందుకు సిద్ధం చేశారు. గ్రామస్థుల గతి ఏం కావాలి.. అని ప్రశ్నించిన నేరానికి వేధింపులు, ఛీత్కారాలు ఎదురవుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లె మండలం మంగంపేట పంచాయతీ కాపుపల్లె పరిధిలో సర్వే నంబర్ 8లో 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అందులో సుమారు 20 ఎకరాలు ఓ మాజీ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరో 5ఎకరాలను ఏపీఎండీసీ ఆక్రమించి వేస్ట్ డంప్ వేస్తోంది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది, పరిర క్షించండి అంటూ 2013లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. అయితే అనూహ్యంగా ఏపీఎండీసీ ఉన్నతాధికారి ఒకరు మాజీ ప్రజాప్రతినిధితో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వ భూమికి అక్రమంగా ప్రజాధనం అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. భూసేకరణ ముసుగులో.... ఏపీఎండీసీ వేస్ట్ డంపు కోసం భూమి అవసరం ఉందని, 150 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తులు చేసుకుంది. ఏపీఎండీసీ ఆశిస్తున్న 150 ఎకరాల భూమికి మధ్యలో సర్వేనంబర్ 8లోని 72.77 ప్రభుత్వ భూమి సైతం ఉంది. దానిలోని 20 ఎకరాలను ఇప్పటికే బినామీ పేర్లుతో రాజకీయ నేత దక్కించుకున్నారు. ఓ వైపు తహశీల్దార్ మొత్తం 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రకటించారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవిన్యూ యంత్రాంగం విఫలం అవుతోంది. కాగా రెవిన్యూ యంత్రాంగానికి భూమి కావాలని అభ్యర్థించే వరకూ ఏపీఎండీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. అయితే పలానా చోట 150 ఎకరాలు అవసరం.. భూసేకరణలో భాగంగా అప్పగించండి అని కోరడం వెనుక మతలబును పలువురు ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.20 లక్షలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా 20 ఎకరాలు బినామీల పేరుతో దక్కించుకున్న నేతకు రూ.4కోట్లు కీలక అధికారి నజరానా ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థుల వేదన ఆరణ్య రోదన.... అన్యాక్రాంతమైన భూమిని పరిరక్షించాలని, కాట్రేవుడి గుడి, శ్మశానం, పశువుల మేత బీడు భూముల్ని కాపాడాలని 2013లో హైకోర్టులో గ్రామస్థులు రిట్ పిటిషన్ విపి నెంబర్-13660 దాఖలు చేశారు. అప్పటి నుంచి గ్రామస్థులు, రాజకీయ నేత మధ్య వివాదం తలెత్తింది. ఈపరంపరలో గ్రామంలో దాడులు సైతం చోటుచేసుకున్నారుు. పరస్పర కేసుల వరకూ దారితీశాయి. కాగా ఏపీఎండీసీ కేవలం గ్రామం వరకూ 150 ఎకరాలు మాత్రమే తీసుకుంటే, గ్రామస్థులు అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. మొత్తం గ్రామం ఖాళీ చేస్తాం, పరిహారం చెల్లించండి, లేదంటే గ్రామానికి దూరంగా భూసేకరణ చేపట్టండండి అని మొరపెట్టుకుంటున్నా విన్పించుకునే స్థితిలో యంత్రాంగం లేదని సమాచారం. అందుకు పక్కా వ్యూహం ప్రకారం ప్రభుత్వ భూమికి పరిహారం పొందాలనే అసలు లక్ష్యం ఉండడమే ముఖ్య ఉద్దేశమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామస్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోని ప్రభుత్వ భూమిని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
అక్రమార్కుల చెరలో సర్కార్ భూమి
పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం..హైదరాబాద్ మహానగారానికి అతిదగ్గర్లో ఉన్న ప్రాంతాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో గజం భూమి వేలల్లో పలుకుతున్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూస్తూ ఊరుకున్నారు. చివరకు ఈ భూములను కొన్న కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగా..స్పందించిన హైకోర్టు సర్కార్ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ తీర్పు చెప్పింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు సర్కార్ మాత్రం కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఎక్కడ భూములు కేటాయించాలో తెలియక సతమతమవుతోంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ పరిధిలో సుమారు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనంలో ఉంది. వీటిని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పినా.. రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేట్టడం లేదు. సొసైటీ పేరుతో మోసం సిద్దిపేటకు చెందిన నారాయణరావు 1980లో పటాన్చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని స్థాపించారు. పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ, పట్టా భూముల్లో వెంచర్లు చేసి సంఘం సభ్యులకు విక్రయించారు. పటాన్చెరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో పనిచేసే కార్మికుల నుంచి రూ.105 సభ్యత్వ రుసుం వసూలు చేసి సొసైటీలో సభ్యులుగా చేర్చుకున్నారు. 1980 నుంచి 1987 వరకు దాదాపుగా ఏడేళ్ల పాటు 382 ఎకరాల ప్రభుత్వ భూమి, 100 ఎకరాల పట్టా భూమిలో 150 గజాల నుంచి మొదలుపెట్టి 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి సొసైటీ సభ్యులకు విక్రయించారు. సుమారు ఐదు వేలకుపైనే సొసైటీకి సభ్యులు ఉన్నట్లు జిల్లా సహకార సంఘం నివేదికలను బట్టి తెలుస్తోంది. ఒక్కొక్క ప్లాటుకు అప్పట్లో రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. పటాన్చెరు మండలం అమీన్పూర్, రామచంద్రాపురం మండలం కొల్లూరు, తెల్లాపూర్, జిన్నారం మండలం బొల్లారంలో సర్వే నంబర్ 323/14, 232/19లో 157.08 ఎకరాలు, 324/1 సర్వే నంబర్ కింద 12.14, 325/1లో 18.34 ఎకరాలు, 326/1 లో 20.30 ఎకరాలు, 328 సర్వే నంబర్ నుంచి 340 వరకు 173 ఎకరాల ప్రభుత్వ భూమిని నారాయణ ఆక్రమించారు. ప్రస్తుతం ఈ భూములకు జిల్లా పంచాయతీ అధికారి (డీఆర్ఓ) కస్టోడియన్‌గా ఉన్నారు. ఏం చేశాడంటే.. సొసైటీ కోసం ముందు కొంత పట్టా భూమిని కొనుగోలు చేసిన నారాయణరావు దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కూడా కలుపుకున్నాడు. పేద రైతుల కోసం అసైన్డ్ చేసిన భూములను తన ఖాతాలోనే వేసుకున్నాడు. అప్పట్లో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సహకరించడంతో.. నారాయణరావుకు అడ్డూ అదుపు లేకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించారు. ఒక్కొక్క ఫ్లాటును ఇద్దరు, ముగ్గురికి చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లెక్కన ప్లాట్లు కొన్న వాళ్లు 10 వేల మంది ఉన్నారు. ఆ త ర్వాత 1997లో నారాయణ రావు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న లొసుగుల ఆధారంగా వివిధ కారణాలు చూపిస్తూ దాదాపు 4 వేల మంది పైగా సంఘం సభ్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించాడు. ఆ నోటీసులు అందుకున్న కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (సీపీఐ) అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో అప్పటి ప్రభుత్వం నారాయణరావు అక్రమ సొసైటీ మీద అప్పటి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవిని అధ్యక్షతన హౌస్‌కమిటీ వేసింది. ఈ హౌస్ కమిటీ సొసైటీ అక్రమాలపై దాదాపు మూడేళ్ల పాటు అధ్యయనం చేసింది. నారాయణరావు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి ప్లాట్లుగా చేసి విక్రయించాడని కమిటీ నిర్ధారించింది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హౌస్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. హైకోర్టు ఏం చెప్పిందంటే.. ప్లాట్లు తీసుకున్న కొందరు సభ్యులు 2006లో హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్ వేశారు. ఎనిమిదేళ్ల పాటు సమగ్ర పరిశీలన చేసిన కోర్టు హౌస్ కమిటీ సిఫార్సునే సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పట్టా భూముల్లో చేసిన ప్లాట్లను సంఘం సభ్యులకు అప్పగించాలని ఆ తీర్పులో పేర్కొంది. అయితే, తీర్పు వచ్చి దాదాపు 8 నెలలు దాటినా.. రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్వాధీన చర్యలు చేపట్టలేదు. పైగా సమస్యను ఇంకా జటిలం చేస్తూ రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీకి, ఇతర రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తరాలు రాస్తూ కాలం గడుపుతున్నారు. ఈ భూములపై ఇప్పటికే రియల్ ఎస్టేట్ గద్దల కన్ను పడింది. అర్ధబలం, అంగబలం ఉన్న వాళ్లు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని సెక్యూరిటీ గార్డుల పేరుతో రౌడీ మూకలను కాపలా పెట్టారు. మరికొంత మంది వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్న పట్టా భూమిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆయా పట్టాభూముల్లో పట్టాలున్న సొసైటీ సభ్యుల నుంచి గజానికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కాగితాయి తీసుకుంటున్నారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తే దాదాపు రూ. 500 కోట్ల విలువైన 382 ఎకరాల భూమి తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. -
దర్జాగా కబ్జా
పరుల చేతుల్లోకి ప్రభుత్వ భూమి సాక్షి ప్రతినిధి, మహ బూబ్‌నగర్ : జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్ భూములున్నట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాటిలో చాలావరకు అక్రమార్కుల కబ్జాలకు గురయ్యాయి. అయినా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మొదలుకుని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రభుత్వ, ఇతర మిగులు భూమిని వివిధ వర్గాలకు అసైన్ చేస్తూ వచ్చారు. లబ్ధిదారుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1956 నుంచి 2014 వరకు 1,67,290 మంది లబ్ధిదారులకు 2,83,267.24 ఎకరాలు ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే దశాబ్ధాల కాలంలో వివిధ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం కేటాయించిన భూమి కొన్నిచోట్ల చేతులు మారింది. అసైన్డ్ భూమి విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొందరు అసైన్డ్ భూముల్లో పాగా వేయగా, మరికొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడ్డారు. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎంత మేర అన్యాక్రాంతమయ్యాయనే వివరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగం వద్ద లేకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ గణనీయంగా పెరగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు, కబ్జారాయుళ్ల కన్ను అసైన్డ్, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములపైనా పడింది. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు కొన్నిచోట్ల అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల చెరువు శిఖం భూములు కూడా కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఇటీవల నీటిపారుదల శాఖ నిర్వహించిన చెరువుల, కుంటల సర్వేలోనూ బయటపడింది. వక్ఫ్‌భూముల్లో కబ్జాల పర్వం జిల్లాలోని వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురై కోర్టు కేసుల్లో నలుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున 600 ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమిని కొందరు బోగస్ రికార్డు లు సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో భూమిని దానం చేసిన వారికి వారసులుగా పేర్కొంటూ, రెవెన్యూ అధికారుల అండతో కొందరు వక్ఫ్ భూములకు ఎసరు పెట్టారు. వక్ఫ్‌భూములను కాపాడే లక్ష్యంతో అధికారులు 1200 ఎకరాల కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారందరూ కోర్టును ఆశ్రయించడంతో విలువై న భూమి ఎవరికి చెందుతుందో తెలియన పరిస్థితి నెల కొంది. అప్పన్నపల్లి, బోయపల్లి, నాగర్‌కర్నూలు తదితర చో ట్లా వక్ఫ్‌భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, అసైన్డ్ భూమి పరుల హస్తాల్లోకి వెళ్లడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగి హౌస్‌కమిటీ ఏర్పాటుకు దారితీసింది. జిల్లాలోని అసైన్డ్, మిగులు, ప్ర భుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపైనా దృష్టిసారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. ఆరు విడతల్లో ప్రభుత్వ భూ పంపిణీ (ఎకరాల్లో) కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ ఎస్సీలు 5,800 7,755.37 ఎస్టీలు 2,197 3,374.07 బీసీలు 8,579 12,701.30 మైనార్టీలు 131 249.32.00 ఇతరులు 1154 1,970.14 మొత్తం 17,861 26,052.00 -
దర్జాగా.. కబ్జా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. అది గుడిదయినా.. బూడిదయినాసరే.. కబ్జా పెట్టేద్దాం.. లేదంటే రికార్డులు సృష్టించి తక్కువకు కొనేద్దాం... అనే రీతిలో జిల్లాలో కూడా ఏళ్ల తరబడి కబ్జాల కథ సాగుతూనే ఉంది. రెవెన్యూ భూములతో పాటు అసైన్డ్, వక్ఫ్, భూదాన్, దేవాదాయ.. ఇలా అన్ని రకాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేసి అనుభవిస్తూనే ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, కొంతమంది సిబ్బంది లాభాపేక్ష, ‘రియల్’ వ్యాపారుల ధనార్జన కారణంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో కోట్ల రూపాయల ప్రజాధనం పరులపాలవుతోంది. ఈ కబ్జాల పర్వాన్ని నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అక్రమార్కులకు గుబులు పట్టుకుంది. సీఎం ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ భూములెక్కడ ఉన్నాయి.. వాటిలో ఆక్రమణల కు గురైన భూముల వివరాలను సేకరించేం దుకు జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. అసైన్డ్ రికార్డుల్లేవంట.. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల కొనుగోలు అంశం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని నిర్ణీత కాలపరిమితి వరకు అమ్మే అవకాశం లేకపోయినా, పేదల నుంచి అక్రమార్కులు కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. ఇదే విషయమై వారు గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా, వాటికి ఇంకా పరిష్కారం లభించలేదు. 2004 నుంచి ఏడు విడతలుగా జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో దాదాపు 27, 534 ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. అందులో ఎంతభూమిని నిజంగా లబ్ధిదారులు అనుభవిస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. ఇక, అంతకు ముందు ప్రభుత్వాలు అసైన్‌చేసిన భూముల వివరాలు రికార్డు కాలేదని అధికారు లు చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సభాసంఘం ఈ అసైన్డ్ భూముల గుట్టు తేల్చనుంది. వక్ఫ్... అంతులేని వ్యథ ఇక, వక్ఫ్ భూముల వ్యవహారం జిల్లాలో ఎప్పుడూ చర్చనీయాంశమే. జిల్లాలో దాదాపు 5,530 ఎకరాల వక్ఫ్ భూములన్నాయని రికార్డులు చెబుతున్నాయి. అయితే వాటిని సంరక్షించాల్సిన వారే కాసుల కోసం అన్యాక్రాంతం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వక్ఫ్ భూముల్లో 75 శాతం ఆక్రమణలకు గురయ్యాయని అధికారులే చెబుతున్నా.. ఈ భూములను ఓ పద్ధతి ప్రకారం సర్దేందుకు గాను కనీసం సర్వే చేసే సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇక, దేవరకొండలో అయితే వక్ఫ్ భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుండడం, జిల్లాలో కొన్ని చోట్ల గోదాములు, సినిమా హాళ్లు, షాపింగ్కాంప్లెక్సులు, పెట్రోల్‌బంకులు కట్టడం చూస్తే ఈ వక్ఫ్ భూముల కబ్జా వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే, ఇందుకు సంబంధించిన వివాదాలన్నీ కోర్టుల్లో లేదంటే ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. బోర్డు రికార్డులో ఓ తీరు.. ప్రభుత్వ రికార్డుల్లో మరో తీరు ఇక భూదాన్ భూముల విషయానికి వస్తే అసలు ఆ భూములకు సంబంధించిన రికార్డులకే జిల్లాలో పొంతన కుదిరే పరిస్థితి లేదు. ఈ భూములకు సంబంధించి భూదాన్ బోర్డు దగ్గర ఉన్న రికార్డులకు, ప్రభుత్వం దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులకూ పొంతన కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 35,449 ఎకరాల భూదాన్ భూములుండగా, అందులో 9,069 ఎకరాలు పంపిణీ చేసినట్టు బోర్డు లెక్కలు చెబుతోంది. అయినా, మిగిలిన భూములు ఎక్కడున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇందులో సగానికి పైగా అన్యాక్రాంతమైనట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో దాదాపు 14వేలకు పైగా ఉన్న దేవాదాయ భూముల్లోనూ కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. ఈ భూముల్లో దాదాపు 3వేల ఎకరాలు పరుల పాలైనట్లు అంచనా. అంతా సురక్షితమేనా! ఇక, జిల్లాలో మొత్తం 5,17,189 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతుండగా, ఆ భూమి అంతా సురక్షితంగా ఉందా లేదా అన్న దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు.. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నవారెవరు? ఎన్ని ఎకరాలు కబ్జాలో ఉంది అనే వివరాలను సేకరించే పనిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరో మూడు, నాలుగు రోజుల్లో అందే అవకాశం ఉందని, ఈ వివరాలు వచ్చాక ప్రభుత్వానికి నివేదిక పంపుతామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సభాసంఘం ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమార్కుల లీలలు వెలుగులోకి వస్తాయని ప్రజాసంఘాలంటున్నాయి. -
ప్రభుత్వ భూమిలో ‘ప్రైవేటు' పట్టా
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. సర్కారు స్థలమైతే ఏకంగా పట్టాలనే సృష్టిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రోజుకో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. వీటిని తలదన్నే రీతిలో తాజాగా సోమవారం మంథనిలో ఓ భూబాగోతం బయటపడింది. ఖాళీ స్థలంతో పాటు ఆర్డీవో వసతిగృహం, రెండు ప్రభుత్వ కార్యాలయాలున్న స్థలాన్ని పట్టా, రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని మరో ముగ్గురికి అమ్మినట్టు రిజిస్ట్రేయడంతో పాటు దానిని ఆన్లైన్లో నమోదు చేసిన తీరు అధికారులనే నివ్వెరపర్చింది. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు కూపీ లాగుతున్నారు. మంథని : మంథని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట 108 సర్వే నంబరులో 36 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో సుమారు 18 గుంటల్లో ఆర్డీవో వసతిగృహం, మరో రెండు కార్యాలయాల పక్కా భవనాలు నిర్మించారు. మిగిలిన 18 గుంటల్లో నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘానికి కేటాయించారు. ఈ సంఘానికి కేటాయించిన భూమిలో ఇటీవల ప్లాట్లు చేస్తుండడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు సంబంధిత అధికారులను సంప్రదించారు. అధికారులు దీనిపై ఆరా తీయగా.. ఈ 36 గుంటల భూమి ముస్కె రాజు అనే వ్యక్తి పేరిట పట్టా అయిన విషయం బయటపడింది. సదరు పాసు పుస్తకాలు ఆన్‌లైన్‌లోనూ నమోదయ్యాయి. మరింత లోతుగా ఆరా తీస్తే.. ఈ భూమిని మరో ముగ్గురికి విక్రయించడంతో పాటు వారి పేరిట రిజిస్ట్రేషన్ అయిన విషయం వెలుగుచూసింది. ఈ ప్రాంతంలో గుంట స్థలానికి రూ.6-8 లక్షల ధర పలుకుతోంది. అంటే ఈ భూమి విలువ సుమారు 3కోట్లు. ఎలా జరిగింది..? ఫోర్జరీ సంతకాలతో పాసుపుస్తకాలను సృష్టించడం ఈ మధ్యకాలంలో పెద్ద కష్టమేమీ కాకపోయినా ఆన్లైన్ నమోదు మాత్రం అంత ఆషామాషీ కాదు. రైతు తన పేరును ఆన్లైన్లో నమోదు చేయాలని తహశీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే.. వీఆర్వో ధ్రువీకరించిన అనంతరం తహశీల్దార్ తన డిజిటల్ సంతకం ద్వారా నమోదు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాకుండా గతంలో తహశీల్దార్ కార్యాలయంలో పనిచేసిన ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్లు మంథని ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది. విచారణ వేగవంతం ప్రభుత్వ స్థలం ఓ ప్రైవేటు వ్యక్తి పేరిట పట్టా, రిజిస్ట్రేషన్ జరిగిందని తెలిసిన వెంటనే రెవెన్యూ అధికారులు తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. సబ్‌రిజిస్ట్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందో వివరాలు సేకరించి అక్కడ సమర్పించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉందనే కోణంలో అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లో అక్రమంగా పాస్‌బుక్‌లు నమోదు చేయడాన్ని సైబర్ నేరంగా భావించి ఆ దిశగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. అలాగే పట్టా, రిజిస్ట్రేషన్ రద్దు చేయించి సదరు బాధ్యులపై చర్యలకు కఠిన చర్యలకు సిద్ధమైనట్టు తెలిసింది. పాస్‌బుక్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ పట్టాదారు పాస్‌బుక్, ఆన్లైన్ నమోదు రికార్డుల ఆధారంగానే మేం రిజిస్ట్రేషన్ చేశాం. భూమి వివరణలో పట్టా ఉండడమే కాకుండా పట్టాదారు, అనుభవదారు ఖాతాలో యజమాని పేరు నమోదైంది. అన్ని ఆధారాలున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయకపోతే తమను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో మాత తప్పేమీ లేదు. - మురళీకృష్ణ, సబ్ రిస్ట్రార్, మంథని పూర్తిగా ప్రభుత్వ భూమే.. మంథని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 108 సర్వే నంబర్లో ఉన్న 36 గుంటల భూమి ప్రభుత్వానిదే. ఈ భూమి అక్రమంగా పట్టా కావడం అయి, పాస్‌బుక్ జారీ కావడం, ఆన్‌లోన్‌లో నమోదవడం, రిజిస్ట్రేషన్ చేయడంపై వివచాణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - జల్ల సత్తయ్య, తహశీల్దార్, మంథని -
‘కంతనపల్లి’కి రూపం
మరో 12 విద్యుదుత్పాదక గేట్లు ఎల్ఎండీ తరహాలో బ్యారేజీ ఐదు గ్రామాలకు ముంపు ముప్పు ఛత్తీస్‌గఢ్‌తో సమస్యలు ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు సర్కార్‌కు డీపీఆర్ అందజేత రేపో.. మాపో ఆమోదముద్ర హన్మకొండ : కంతనపల్లి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ రూపురేఖలు సంతరించుకుంది. ఎట్టకేలకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్ట్ మ్యాప్ ఖరారు చేశారు. కంతనపల్లి నిర్మాణానికి సంబంధించి సుమారు ఆరు నెలలపాటు సర్వే చేసిన అధికారులు... డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) తయూరు చేసి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. బ్యారేజీ ప్రతిపాదనకు సర్కారు అతి త్వరలో గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 131 గేట్లతో అతి పెద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రణాళిక రూపుదిద్దుకుంది. ఈ బ్యారేజీ నిర్మాణంలో బ్యాక్ వాటర్ నిల్వ కోసం 10,306 ఎకరాల భూమి సేకరించనున్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో జిల్లాలోని ఐదు గ్రామాలు ముంపునకు గురికానున్నట్లు అధికారులు సర్వేలో గుర్తించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పరిధిలోని రెండు గ్రామాలు కూడా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో బ్యారేజీ నిర్మాణ మ్యాప్‌లో సవరణలు చేశారు. అంతర్రాష్ట్ర సమస్యలు ఉత్పన్నమైతే కంతనపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందనే కారణంతో బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని కొంత మేరకు మన రాష్ట్రం వైపుకు పెంచారు. మొత్తానికి 75 మీటర్ల ఎత్తులో... 85 మీటర్ల పరిధి జలాశయంతో తొలి దశ ప్రాజెక్ట్‌ను నిర్మాణం చేసేందుకు డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. చకచకా.. కంతనపల్లిప్రాజెక్ట్ నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ ముగిసి, అగ్రిమెంట్ కూడా పూర్తరుుంది. మొదటి దశ బ్యారేజీ నిర్మాణం పనులకు ఈపీసీ పద్ధతిన రూ. 1809 కోట్లతో టెండర్లు పిలిచారు. 9.13 శాతం లెస్తో షూ- రిత్విక్ జాయింట్ వెంచర్ రూ.1,643 కోట్లకు పనులు దక్కించుకుంది. ఈ మేరకు సంస్థ ఓ వైపు భూ స్వభావ పరీక్షలు పూర్తి చేయగా... మరోవైపు అధికారులు నిర్మాణానికి అవసరమయ్యే భూ సేకరణ, గోదావరిలో లోతు (ఎఫ్ఆర్ఎల్) తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి నివేదికలిచ్చారు. అంతేకాకుండా ఏటూరునాగారం నుంచి లక్ష్మీపురం వరకు ఇప్పుడున్న 24 కిలోమీటర్ల రోడ్డులో 12 కిలోమీటర్ల వరకు రహదారిని తిరిగి నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణం కంటే ముందుగా ఈ రోడ్డును వేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా ఏటూరునాగారంలో ఒక డివిజన్, 4 సబ్ డివిజన్ కార్యాలయాలు, కంతనపల్లి వద్ద 12 క్వార్టర్లను నిర్మాణం చేయనున్నారు. ఇక ప్రాజెక్ట్ నిర్వహణ కోసం మొత్తం 586 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉండగా... వీటిలో బ్యారేజీ వద్దే 280 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే విధంగా రూపకల్పన చేశారు. 10,360 ఎకరాల భూమి బ్యారేజీ నిర్మాణం కోసం మొత్తం 10,360 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు ప్రాజెక్ట్ రిపోర్టులో పేర్కొన్నారు. తొలుతగా కంతనపల్లి వద్ద 10,360 ఎకరాల భూమిని సేకరించాలని, ఇందులో అటవీ శాఖ భూమి లేదని, ప్రభుత్వ భూమి 20 శాతం మేరకు ఉన్నా... మిగిలినదంతా పట్టా భూమిగా గుర్తించారు. ఇక్కడ 10వేల ఎకరాల భూమిని సేకరించే క్రమంలో సుమారు 5 గ్రామాలు ముంపునకు గురవుతాయని నివేదికలో స్పష్టం చేశారు. నిర్వాసితులకు భూ కేటాయింపు ఎక్కడ చేస్తారనే అంశం, భూ సేకరణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. 75 మీటర్లు... 3.8 కిలోమీటర్లు గోదావరిలో నీటిమట్టం, పొడవుపై అధికారులు సర్వే పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాపూర్ నుంచి వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం మండలం కంతనపల్లి వరకు చేపట్టాల్సిన పనులపై ఇంజనీర్లు నివేదికలు సమర్పించారు. మొత్తం 3.8 కిలోమీటర్ల పరిధిలో 75 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణం చేయాల్సి ఉంటుం దని తేల్చారు. 75 మీటర్ల ఎత్తులో బ్యారేజీని నిర్మిస్తే... 22.25 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చని, ఎండాకాలంతో పాటుగా ఏడాది మొత్తంలో 170 రోజుల పాటు 50 టీఎంసీల నీటి ని కాల్వలు, సొరంగంద్వారా పంపిం గ్ చేయవచ్చని సర్వేలో గుర్తించారు. 85 మీటర్ల జలాశయం కంతనపల్లి ప్రాజెక్ట్‌లో పూర్తి జలాశయ మట్టాన్ని 85 మీటర్లకు నిర్ధారించారు. ప్రాజెక్టును 75 మీటర్ల ఎత్తు వరకే నిర్మాణం చేయాలని ప్లాన్‌లో పేర్కొన్నారు. బ్యారేజీ 75 మీటర్లు దాటి నిర్మాణం చేస్తే... జలాశయ మట్టం 85 మీటర్ల పైమేరకు చేరిపోయి ఛత్తీస్‌గఢ్ పరిధిలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, దీంతో అంతర్ రాష్ట్ర సమస్యలు ఉత్పన్నమవుతాయని స్పష్టంగా పేర్కొన్నారు. 131 గేట్ల ఏర్పాటు బ్యారేజీకి గేట్ల డిజైన్‌ను ఇంజనీర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని ఎల్ఎండీ రిజర్వాయర్ తరాహాలోనే 131 గేట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటుగా అదనంగా 12 నీటి విద్యుత్ ఉత్పాదక గేట్లు, 5 ప్రధాన తూము గేట్లు, స్కోర్ స్లూచెస్ కోసం 4 గేట్లను ఏర్పాటు చేసే విధంగా డిజైన్ చేశారు. త్వరలో గ్రీన్‌సిగ్నల్ మొత్తం తొలి దశ బ్యారేజీ మ్యాప్‌తో సహా డీపీఆర్‌ను కంతనపల్లి నిర్వహణ ఇంజనీరింగ్ అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి పంపించారు. దీనిపై ప్రభుత్వం కూడా రిటైర్డ్ ఇంజనీర్లతో పరిశీలన చేసింది. వారు చిన్న చిన్న తేడాలను సరి చేసి ప్రభుత్వానికి సమర్పించారు. టెండర్లు అగ్రిమెంట్ చేసి దాదాపు ఏడాది గడుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరగా కంతనపల్లి డీపీఆర్‌పై ఆమోదముద్ర వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ కాలం ఐదేళ్లు. -
కాలువపై ‘పసుపు’ పాదం!
పేరూరులో రూ.కోటిన్నర ప్రభుత్వ భూమి ఆక్రమణయత్నం పట్టపగలే జేసీబీతో పనులు పట్టించుకోని రెవెన్యూ అధికారులు తిరుపతి రూరల్: అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు దిగుతున్నారు. అమాయకులను ముందు పెట్టి రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. పట్టపగలే కాలువలను జే సీబీలతో చదును చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. రూ. కోటిన్నర భూమి కబ్జా పేరూరు పంచాయతీ సర్వేనెం.164లో 17 ఎకరాల వి స్తీర్ణంలో కాలువ ఉంది. 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ కాలువపై పుదిపట్లకు చెందిన మాజీ మంత్రి అనుచరుడి కన్నుపడింది. దోబీఘాట్ కావాలంటూ జిల్లా అధికారులకు తన అనుచరుల ద్వారా వినతి పత్రం ఇప్పిం చాడు. ఆగమేఘాల మీద 59 సెంట్లను మంజూరు చేయించుకున్నాడు. అంత స్థలం దోబీఘాట్‌కు ఎందు కు ఇళ్ల స్థలాలు వేద్దాం అంటూ అనుచరులను ఒప్పిం చాడు. దాదాపు ఎకరాపైగా కాలువ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. ఆదివారం సెలవుదినం. వర్షం పడుతున్నా రెండు జేసీబీలతో కాలువ పూడ్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. మాజీ మంత్రి అనుచరుడు సాగిస్తున్న భూదందాను చూసి మరికొందరు అధికార పార్టీ నేతలు కాలువ ఆక్రమణకోసం పోటీపడ్డారు. గతంలో 16 ఇంటి పట్టాలు ఇచ్చారంటూ గొల్లపల్లెకు చెందిన రజకులు సైతం కాలువను చదును చేస్తున్నారు. కాగా అధికార పార్టీ నేతల కాలువ కబ్జా యత్నాలన్నీ రెవెన్యూ సిబ్బంది కనుసన్నల్లోనే సాగుతున్నాయనే అరోపణలు వెల్లువెత్తున్నాయి. అందుకే తాము ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల కబ్జాలను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు. ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు దోబీఘాట్‌కు ఈ మధ్యే స్థలం ఇచ్చాం కానీ ఎవ్వరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. కాలువను అక్రమించాలని చూస్తే చర్యలు తీసుకుంటాం. -భాస్కర్, గ్రామ రెవెన్యూ అధికారి, పేరూరు -
ప్రభుత్వ భూమిలో ప్లాట్లు..తమ్ముళ్లకు కోట్లు!
రూ. 9కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ ప్లాట్లుగా వేసి విక్రయం టీడీపీ నాయకుడి నిర్వాకం ఆ భూమిలో ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు బందరు బైపాస్ రోడ్డు వెంబడి ఆక్రమణల పర్వం మచిలీపట్నం : పట్టణంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇటీవల ఒక నాయకుడు పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ స్థలం తనదేనంటూ పోలీసుల అండతో హడావుడి చేస్తే.. ఇప్పుడు ఓ నేత ఏకంగా బైపాస్ రోడ్డు వెంబడి మూడు స్తంభాల సెంటరు నుంచి డంపిగ్ యార్డు వరకు ఉన్న 2.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. డ్రెయిన్‌ను పూడ్చివేసి రోడ్డుగా మార్చారు. ఆక్రమించిన స్థలాన్ని మెరక చేసి, ప్లాట్లు వేసి గజం రూ.7వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండు నెలలుగా.. రాష్ట్ర విభజన అనంతరం మచిలీపట్నంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే బలరామునిపేటకు చెందిన ఓ నాయకుడు మరికొందరితో కలిసి రెండు నెలల క్రితం హిందూ శ్మశానవాటిక, విశ్వబ్రాహ్మణుల శ్మశానవాటికల పక్కనే సర్వే నంబరు 176/5లో ఉన్న 2.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. మెరక చేసి ప్లాట్లుగా మార్చి నకిలీ పత్రాల సాయంతో విక్రయాలు ప్రారంభించారు. ఈ నెల రెండో తేదీన జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలోనూ భూ ఆక్రమణ చర్చకు వచ్చింది. అయినా ప్లాట్లు విక్రయం ఆగకపోవటం గమనార్హం. వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు కేటాయించినా.. బైపాస్కు భూసేకరణ సమయంలో ఈ భూమిని ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. ఆ తర్వాత అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు కూడా పరిశీలించి ప్రభుత్వ భూమేనని నిర్దారించారు. మచిలీపట్నం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఘంటసాల మండలం శ్రీకాకుళం సమీపంలోని కృష్ణానది నుంచి పైప్‌లైన్ వేసి రా వాటర్‌ను ఈ స్థలం వద్దకు తరలించాలని ప్రతిపాదనలు చేశారు. రా వాటర్‌ను ఫిల్టర్ చేసేందుకు ఈ భూమిలో ఫిల్టర్ ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.2కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించిన నివేదిక, ఫైళ్లు, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం మారగానే ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించేశారు. లోతట్టుగా ఉన్న భూమిని మెరకచేశారు. రోడ్డు పక్కనే ఉన్న డ్రెయిన్‌ను పూడ్చి తాత్కాలిక రోడ్డును నిర్మించారు. యథేచ్ఛగా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. గజం రూ. 7వేలు ప్రభుత్వ భూమిని ఆక్రమించి మెరక చేసిన టీడీపీ నాయకులు గజం రూ.7వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2.75 ఎకరాలు 13,200 గజాల స్థలం కాగా, ప్రస్తుతం టీడీపీ నాయకులు విక్రయిస్తున్న ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.9.24 కోట్లు ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని ఆక్రమించినా పట్టించుకోవడం లేదని ఈ నెల 2వ తేదీన జరిగిన మచిలీపట్నం పురపాలక సంఘ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. రెండు రోజుల అనంతరం ఆ భూమిని పరిశీలించిన పురపాలక శాఖ అధికారులు ఆ తర్వాత నోరుమెదపలేదు. ప్రజల అవసరాల కోసం ఫిల్టర్ ప్లాంట్ నిర్మించాలని కేటాయించిన భూమి ఆక్రమణకు గురికావటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని, వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు. ఇది పురపాలక సంఘానికి చెందిన భూమే పంపుల చెరువుకు, డంపింగ్ యార్డుకు మధ్యలో ఉన్న భూమి పురపాలక సంఘానికి చెందినదే. ఇక్కడ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి గతంలో నిలుపుదల చేశాం. రెండు రోజుల్లో ఇది పురపాలక సంఘానికి చెందిన భూమేనని బోర్డు ఏర్పాటు చేస్తాం. - మారుతి దివాకర్, మున్సిపల్ కమిషనర్, మచిలీపట్నం -
మాజీ మంత్రిగారి భూ మాయ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూ మాయ లు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని బహుళ అంతస్తుల భవనం నిర్మించడం పై సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాలు గల్లా అరుణకుమారి కుటుంబం పరమయ్యా యి. కేవలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ వ్యవహారాలు నడిపినట్లు సమాచారం. ప్రధానంగా వీరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై కన్నేశారు. ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ అవసరాలకోసం కొనుగోలు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయించడం, ఆ తరువాత ఆ భూముల్లో గల్లా అనుచరులు, బంధువులు పాగావేసి అక్కడి రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు పూర్తిస్థాయిలో సహకరించాయని చెప్పవచ్చు. పూతలపట్టు పంచాయతీలోని సర్వే నెంబరు 328/1లో 2.51 ఎకరాలు పట్నం బాలసుబ్రమణ్యం అనే వ్యక్తికి బతుకుదెరువుకోసం ప్రభుత్వం పట్టా ఇచ్చింది. డీకేటీ పట్టా లు కేవలం అనుభవించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ చేసేందుకు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేస్తారు. భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి ప్రభుత్వ పరంగా సొమ్ము చెల్లిస్తారు. ఈ విషయంలో పేదలకు ఇచ్చిన భూములైనా సరే, ప్రభుత్వ అవసరాల కోసం ఇవ్వక తప్పదు. అందులో భాగంగా అప్పటి కలెక్టర్ 2005 డిసెంబర్ 9న ఈ ప్రాంతంలోని కొందరి భూములు ఏపీఐఐసీకి కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి వారి భూములకు పరిహారం ఇచ్చారు. బాలసుబ్రమణ్యంకు చెం దిన భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి, 2006 మార్చి 14న డబ్బు ఇచ్చివేసింది. అయితే అంతకు ముందే అంటే 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడు బాలసుబ్రమణ్యం వద్ద ఈ భూమిని కొనుగోలు చేసి పాకాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేదు. గతంలో అసైన్మెంట్ చట్టం ప్రకారం పట్టా పొందిన వ్యక్తి 20 ఏళ్ల తరువాత తహశీల్దార్ వద్ద ఎన్వోసీ తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆ చట్టాన్ని పదేళ్ల క్రితం ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములకు ఎన్వోసీలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం లేదు. అయితే గల్లా అరుణకుమారి మంత్రి కావడంతో ఆమె చెప్పినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తలూపారు. సుబ్రమణ్యం వద్ద నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు. సుబ్రమణ్యానికి అవార్డ్ ఎలా పాసైంది? సుబ్రమణ్యం తన భూమిని (డీకేటీ) 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇదే భూమికి 2006 మార్చి 14న 6/2005-06 నెంబరుతో అవార్డ్ పాస్ చేశారు. అంటే గల్లా రామచంద్రనాయుడు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం పరిశీలించకుండా సుబ్రమణ్యానికి డబ్బు చెల్లించింది. ప్రభుత్వం ఎలా చేసింది? ఎందుకు చేసింది? ఎవరు ఇలా చేయమన్నారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కలెక్టర్ వీటిపై సమగ్రమైన విచారణ కు ఆదేశించాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాలు గా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్న వారు లేరు. కొనడానికి వారెవరు? అమ్మడానికి వీరెవరు? ప్రభుత్వం పేదలకు సాగుకోసం భూములు ఇస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ హక్కులేదు. ఒక వేళ ఏ పేదవాడైనా ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మితే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా లేదు. అయితే మాజీ మంత్రి కుటుంబం వరకు వచ్చే సరికి అన్నీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని.. ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని గల్లా అరుణకుమారి వందల ఎకరాల భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారికి అనుకూలంగా ఉన్నాయనుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకోసం కావాలంటూ ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్లు ఇవ్వడం, ఆ తరువాత ఏపీఐఐసీ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఏపీఐఐసీకి ఇచ్చే బదులు తమకు ఇస్తే వారికంటే ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామంటూ పేదలను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. ఒకసారి ఏపీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చి, అవార్డ్ పాస్ చేసిన భూములను కూడా స్వాధీనం చేసుకున్నారంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్లుగానే భావించాల్సి వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు. -
భూం..ఫట్!
=దర్జాగా గెడ్డ పోరంబోకు ఆక్రమణ =21 ఎకరాలకు పైగా కబ్జా చేసిన టీడీపీ నేత =పొక్లెయిన్లతో భూమి చదును =కదలని రెవెన్యూ సిబ్బంది అర సెంటు ప్రభుత్వ భూమిలో ఏ నిరుపేదైనా గుడిసె వేసుకోగలడా? అంత సాహసం చేస్తే బతికి బట్టకట్టగలడా? పాపం పేదవాడని రెవెన్యూ అధికారులు ఔదార్యం ప్రదర్శించగలరా? చట్టం చట్రంలో బిగించేస్తారు. జీవితాంతం ఊచలు లెక్కబెట్టిస్తారు. అలాంటి వాళ్లే 21 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోతుంటే చోద్యం చూస్తున్నారు. చదును చేస్తున్న యంత్రాల శబ్దాలు వినిపించకుండా చెవులు మూసుకున్నారు. అక్కడ నిర్మించిన రేకులషెడ్డు కనిపించకుండా కళ్లు మూసుకున్నారు. మాకవరపాలెం మండలం తామరంలో తెలుగుదేశం నేత, రాచపల్లి మాజీ సర్పంచ్ కబ్జాకాండ ఇది... మాకవరపాలెం, న్యూస్‌లైన్: తామరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 61/3లో 21 ఎకరాలకు పైగా గెడ్డ పోరంబోకు భూమి ఉంది. ఈ భూముల చుట్టూ ఎకరా రూ.30 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ భూమిపై రాచపల్లి మాజీ సర్పంచ్ కన్ను పడింది. ఆ భూమిని మూడురోజులుగా పొక్లెయిన్, అయిదు ట్రాక్టర్లతో చదును చేసే పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సుమారు 10 ఎకరాల వరకు భూమిని చదును చేసేశారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న గెడ్డను సైతం కప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చదును చేసిన భూమిలో రేకులషెడ్డు నిర్మించేశారు. చుట్టూ కంచె నిర్మాణానికి సిమెంటు స్తంభాలను సిద్ధం చేసుకున్నారు. రాచపల్లి కూడలి నుంచి నేరుగా ఈ భూమిలోకి వెళ్లేందుకు ప్రస్తుతం ఉపాధి పనులతో రోడ్డు నిర్మించడంతో కబ్జాదారుకు అన్నివిధాలా కలిసొచ్చింది. అన్‌రాక్ రిఫైనరీ కూడా సమీపంలో ఉండటంతో రోజురోజుకు ఇక్కడి భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో కబ్జాదారు ఈ భూమిలోకి వెళ్లేందుకు మధ్యలో గెడ్డపై సిమెంటు గొట్టాలను వేసి మార్గం సుగమం చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వివేషం. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై తహశీల్దారు పి.గంగాధరరావును న్యూస్‌లైన్ వివరణ కోరగా ఆ సర్వే నంబరులో ఉన్నది గెడ్డ పోరంబోకు భూమేనని ధ్రువీకరించారు. వెంటనే పనులు నిలుపు చేసి ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తానని తెలిపారు.