150 గజాల వరకూ ఉచితం!
- ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో పేదల కేటగిరీ పరిధి పెంపు
- మిగతా కేటగిరీల్లోనూ రాయితీలు పెంపు.. 250 గజాల వరకూ రిజిస్ట్రేషన్ ధరలో 25% చెల్లిస్తే క్రమబద్ధీకరణ
- 500 గజాల వరకు 50 %, ఆపై విస్తీర్ణమున్న స్థలాలకు 75% కడితే చాలు
- అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
- నేడు కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అనుకున్నంత స్పందన లేకపోవటం, ఆశించినంత ఆదాయం రాకపోవటంతో ఈ విధానానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న పేదలకు లబ్ధి కల్పించడంతో పాటు సర్కారుకు ఆదాయం ఒనగూరేలా బహుళ ప్రయోజనాలు ఉండేలా మార్పులు చేసేదిశగా మరో కసరత్తు ప్రారంభించింది.
ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా క్రమబద్ధీకరించే స్థలం పరిమితిని 125 గజాల నుంచి 150 గజాలకు పెంచాలని భావిస్తోంది. అంతేకాదు మిగతా కేటగిరీల్లో ఇస్తున్న రాయితీలనూ పెంచాలని నిర్ణయించింది. శుక్రవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశముంది.
రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా గత నెల 30న ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా 125 గజాల్లోపు స్థలంలో నివాసాలు ఏర్పరచుకున్న నిరుపేదలకు ఉచితంగానే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక మధ్యతరగతి వర్గాల కోసం 125 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాలపై రిజిస్ట్రేషన్ ధరలో ప్రభుత్వం 50 శాతం రాయితీ ఇచ్చింది. 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు రిజిస్ట్రేషన్ ధరలో 75 శాతం చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్దేశించింది. 500 గజాలపైన స్థలానికి పూర్తి మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్రమబద్ధీకరణకు తొలుత ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. తర్వాత దరఖాస్తు గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. గత ప్రభుత్వ హయాంలో జీవో 166 ప్రకారం క్రమబద్ధీకరణ కోసం ఏడాదిన్నర వ్యవధిలో 1.40 లక్షల దరఖాస్తులు రాగా... తాజాగా ప్రభుత్వం చేపట్టిన క్రమబద్ధీకరణకు ఇరవై రోజుల వ్యవధిలోనే 1.89 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా దాదాపు మూడు లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ విభాగం అంచనా. కానీ రాష్ట్ర విభజన ప్రభావంతో మార్కెట్లో భూముల ధరలు తగ్గినా, రిజిస్ట్రేషన్ ధరలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటివే అమలవుతుండడంతో... భారీ విస్తీర్ణంలో స్థలాలను ఆక్రమించిన కబ్జాదారులు ఈ క్రమబద్ధీకరణకు దూరంగానే ఉన్నారు. దీంతోపాటు 125 గజాలకు మించిన విస్తీర్ణంలోనివాసమున్న నిరుపేదలు డబ్బులు చెల్లించే స్తోమత లేక వెనుకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణ పథకం పురోగతిపై సీఎం కేసీఆర్ గురువారం రెవెన్యూ, సీసీఎల్‌ఏ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఇప్పుడున్న మార్గదర్శకాల్లో మార్పులు చేసి... పేదలకు మరింత ప్రయోజనం ఉండేలా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు. క్రమబద్ధీకరణపై సరిగా ప్రచారం చేయకపోవడం వల్లే ఆశించిన స్పందన రాలేదని.. ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దీంతో నిరుపేదలకు సంబంధించిన ఉచిత క్రమబద్ధీకరణ పరిమితిని 150 గజాల వరకు పెంచాలని నిర్ణయించారు.
ఇక రుసుము చెల్లించే కేటగిరీల్లో.. 150 గజాల నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ ధరలో 25 శాతం... 250 నుంచి 500 గజాల్లోపు స్థలాలకు 50 శాతం... 500 గజాలపైబడిన స్థలాలకు 75 శాతం ధరను చెల్లిస్తే క్రమబద్ధీకరించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంత రాయితీ పెం చితే.. ఏ మేరకు స్పందన వస్తుంది, ఎంత ఆదా యం సమకూరుతుందనే వివరాలపై సైతం అధికారులు చర్చించారు. తప్పనిసరి పరిస్థితుల్లో శిఖం భూములను కూడా డీనోటిఫై చేసి క్రమబద్ధీకరించేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలుండటంతో.. అలాంటి వాటిని కూడా క్రమబద్ధీకరించే అంశం పరిశీలనలో ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.