భూం..ఫట్!
=దర్జాగా గెడ్డ పోరంబోకు ఆక్రమణ
=21 ఎకరాలకు పైగా కబ్జా చేసిన టీడీపీ నేత
=పొక్లెయిన్లతో భూమి చదును
=కదలని రెవెన్యూ సిబ్బంది
అర సెంటు ప్రభుత్వ భూమిలో ఏ నిరుపేదైనా గుడిసె వేసుకోగలడా? అంత సాహసం చేస్తే బతికి బట్టకట్టగలడా? పాపం పేదవాడని రెవెన్యూ అధికారులు ఔదార్యం ప్రదర్శించగలరా? చట్టం చట్రంలో బిగించేస్తారు. జీవితాంతం ఊచలు లెక్కబెట్టిస్తారు. అలాంటి వాళ్లే 21 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా అయిపోతుంటే చోద్యం చూస్తున్నారు. చదును చేస్తున్న యంత్రాల శబ్దాలు వినిపించకుండా చెవులు మూసుకున్నారు. అక్కడ నిర్మించిన రేకులషెడ్డు కనిపించకుండా కళ్లు మూసుకున్నారు. మాకవరపాలెం మండలం తామరంలో తెలుగుదేశం నేత, రాచపల్లి మాజీ సర్పంచ్ కబ్జాకాండ ఇది...
మాకవరపాలెం, న్యూస్‌లైన్: తామరం రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 61/3లో 21 ఎకరాలకు పైగా గెడ్డ పోరంబోకు భూమి ఉంది. ఈ భూముల చుట్టూ ఎకరా రూ.30 లక్షల వరకు పలుకుతోంది. దీంతో ఆ భూమిపై రాచపల్లి మాజీ సర్పంచ్ కన్ను పడింది. ఆ భూమిని మూడురోజులుగా పొక్లెయిన్, అయిదు ట్రాక్టర్లతో చదును చేసే పనులు ముమ్మరం చేశారు. ఇప్పటికే సుమారు 10 ఎకరాల వరకు భూమిని చదును చేసేశారు. అక్కడితో ఆగకుండా పక్కనే ఉన్న గెడ్డను సైతం కప్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
చదును చేసిన భూమిలో రేకులషెడ్డు నిర్మించేశారు. చుట్టూ కంచె నిర్మాణానికి సిమెంటు స్తంభాలను సిద్ధం చేసుకున్నారు. రాచపల్లి కూడలి నుంచి నేరుగా ఈ భూమిలోకి వెళ్లేందుకు ప్రస్తుతం ఉపాధి పనులతో రోడ్డు నిర్మించడంతో కబ్జాదారుకు అన్నివిధాలా కలిసొచ్చింది. అన్‌రాక్ రిఫైనరీ కూడా సమీపంలో ఉండటంతో రోజురోజుకు ఇక్కడి భూముల ధరలు పెరుగుతున్నాయి. దీంతో కబ్జాదారు ఈ భూమిలోకి వెళ్లేందుకు మధ్యలో గెడ్డపై సిమెంటు గొట్టాలను వేసి మార్గం సుగమం చేసుకున్నాడు.
ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం వివేషం. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. దీనిపై తహశీల్దారు పి.గంగాధరరావును న్యూస్‌లైన్ వివరణ కోరగా ఆ సర్వే నంబరులో ఉన్నది గెడ్డ పోరంబోకు భూమేనని ధ్రువీకరించారు. వెంటనే పనులు నిలుపు చేసి ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తానని తెలిపారు.