మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయం
సాక్షి, అమరావతి బ్యూరో: పేదల భూమిని ఆక్రమించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా పనులు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలో 3.65 ఎకరాల స్థలంలో మూడు బ్లాకులుగా టీడీపీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణం చేపట్టారు. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం ఖరీదు రూ.70 కోట్ల పైమాటే. వాస్తవానికి 1993లో అప్పటి ప్రభుత్వం ఆత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని 392 సర్వే నంబర్‌లో 3.50 ఎకరాల భూమిని సాగు నిమిత్తం షేక్ బాజీకి కేటాయించింది. అప్పటి నుంచి ఆ భూమిపైనే ఆధారపడి ఆయన జీవనం సాగించారు. బాధితుల్లో ఒకరు టీడీపీ మంగళగిరి మండలం తెలుగు యువత అధ్యక్షుడు కావడం గమనార్హం.
ఆక్రమణకు బీజం పడిందిలా..
2014లో షేక్ బాజీ మరణాంతరం ఆ భూమిని తమ పేరిట బదలాయించాలని ఆయన కుమారుడు షేక్ సూఫీబాబా మంగళగిరి రెవెన్యూ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు. రాష్ట్ర విభజన, ఆ తర్వాత రాజధాని అమరావతి ప్రకటనతో ఈ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. షేక్ సూఫీబాబా పేరిట భూమిని బదలాయించకుండా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సూఫీబాబా హైకోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు సంబంధిత భూమిని నిజమైన హక్కుదారులైన సూఫీబాబా పేరిట బదలాయించాలని ఆదేశాలు జారీ చేసింది.
కోర్టుకు తప్పుడు సమాచారం
ఆత్మకూరులోని సర్వే.నం.392లో ఉన్న భూమి షేక్ బాజీది కాదని రెవెన్యూ అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించారు. ఆ భూమి నిజమైన హక్కుదారుడు జొన్నాదుల సాంబశివరావు అంటూ తప్పుడు సమాచారాన్ని కోర్టుకు అందజేశారు. దీంతో బాధితుడు షేక్ సూఫీబాబా మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి పనులు చేపట్టొదంటూ న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఇవేమీ పట్టించుకోని అధికారులు సూఫీబాబా సాగు చేసుకుంటున్న కంది పంటను రాత్రికి రాత్రే దున్నేసి చదును చేశారు.
99 సంవత్సరాల పాటు లీజుకు..
2017 నవంబర్‌లో టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూ కేటాయింపు పూర్తికాకముందే శంకుస్థాపన చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. శంకుస్థాపన చేసిన తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో ఆ స్థలాన్ని 99 ఏళ్ల పాటు ఎకరాకు ఏడాదికి రూ.1,000 నామమాత్రపు రుసుంతో లీజుకు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించడంపై బాధితులు గగ్గోలు పెట్టినా ఆ పార్టీ నాయకులు లెక్కచేయలేదు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
2.20 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం
మొత్తం 3.65 ఎకరాల్లో సుమారు 2.20 లక్షల చదరపు అడుగుల్లో మూడు బ్లాకులుగా టీడీపీ ఆఫీసు నిర్మాణం సాగుతోంది. అండర్ గ్రౌండ్‌లో రెండు ఫ్లోరులతో పాటు జీ+3 విధానంలో నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.
‘సిట్’తో విచారణ జరిపించాలి
‘‘అధికారం అండతో మా భూమిని తెలుగుదేశం పార్టీ కబ్జా చేసింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరా భూమి రూ.20 కోట్లు పలుకుతోంది. హైకోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని అధికారం అండతో, అధికారుల సహకారంతో ఆక్రమించుకున్నారు. మా స్థలాన్ని మాకు అందజేయాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలి’’
– షేక్ సూఫీబాబా, బాధితుడు
రాత్రికి రాత్రే కబ్జా చేసేశారు
‘‘స్థల వివాదం హైకోర్టులో ఉంది. కోర్టు కమిషన్ వేసింది. కమిషన్ సభ్యులు వస్తారని సమాచారం రావడంతో రాత్రికి రాత్రే మొత్తం పంటను ఆధారాలు లేకుండా మా పార్టీ నాయకులే దున్నేశారు. 3.65 ఎకరాల్లో నాకు 15 సెంట్ల భూమి ఉంది. న్యాయం చేస్తామని చెప్పి మూడేళ్లవుతోంది. ఇంతవరకు పట్టించుకున్న నాథుడే లేడు. మైనార్టీలమనే చులకన భావంతోనే తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇలా చేస్తున్నారు’’
– షేక్ సుబానీ, మంగళగిరి పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment