మాయా భవంతి! | TDP state office building which is not on the municipal records | Sakshi
Sakshi News home page

మాయా భవంతి!

Published Thu, Jul 4 2019 4:19 AM | Last Updated on Thu, Jul 4 2019 4:19 AM

TDP state office building which is not on the municipal records - Sakshi

టీడీపీ కార్యాలయం

సాక్షి, గుంటూరు: అదో మాయా భవంతి.. లీజుకు తీసుకున్న స్థలాన్ని రెన్యువల్‌ చేసుకోకపోవడం ఒక అంశమైతే పక్కనే ఉన్న జాగాను సైతం ఆక్రమించి అధికారం అండతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకోవడం మరో కోణం. కార్పొరేషన్‌ రికార్డుల్లో మాత్రం అసలు అక్కడ ఓ భవనం ఉన్న దాఖలాలే లేవు. చెప్పాలంటే అసలు కార్పొరేషన్‌ స్థలాన్నే ఆక్రమించి భవన నిర్మాణాన్ని చేపట్టారు. గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం నిర్మాణం వెనుక నిర్వాకాలు ఇవీ. ఇలాంటి భవనం నుంచే టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇక తన కార్యకలాపాలన్నీ కొనసాగిస్తానంటూ ప్రకటించడం గమనార్హం. 

పన్నుతో సరిపుచ్చాలంటూ పైరవీలు...
చిరు వ్యాపారులు చిన్న రేకుల షెడ్డు వేస్తేనే పొక్లెయిన్‌లతో వెళ్లి కూల్చివేసే టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు నగరం నడిబొడ్డున అనుమతులు లేకుండా నిర్మించిన టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనం గురించి పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోట్ల రూపాయల విలువ చేసే స్థలం కబ్జాకు గురైనా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా, అద్దె, పన్ను రూపంలో కార్పొరేషన్‌ ఖజానాకు భారీ గండిపడుతున్నా గుంటూరు నగరపాలక సంస్థకు కనీసం చీమకుట్టినట్లయినా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ కట్టడాలపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో అనుమతులు లేని టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి పన్ను విధించి సరిపుచ్చాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. అక్రమ కట్టడాన్ని సక్రమంగా మార్చుకునేందుకు రెవెన్యూ విభాగంలో తమకు అనుకూలంగా వ్యవహరించే ఓ అధికారి ద్వారా టీడీపీ నేతలు పైరవీలు నిర్వహిస్తున్నారు. సదరు అధికారి టీడీపీకి చెందిన ఓ సీనియర్‌ మాజీ ఎమ్మెల్యేకు బంధువు కావడం గమనార్హం. 

లీజుకు తీసుకుని... పక్కనే ఆక్రమించి
గుంటూరు అరండల్‌పేట 12/3 టీఎస్‌ నంబరు 826లోని వెయ్యి గజాల కార్పొరేషన్‌ స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 1999 జూలై 1వతేదీన 30 ఏళ్ల లీజుపై తీసుకున్నారు. ఏటా రూ.25 వేల చొప్పున నగరపాలక సంస్థకు అద్దె చెల్లించడంతోపాటు మూడేళ్లకోసారి లీజు రెన్యూవల్, 33 శాతం అద్దె పెంచేలా  ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే టీడీపీ నేతలు ఆ పక్కనే ఉన్న 1,637 చదరపు గజాల కార్పొరేషన్‌ స్థలాన్ని సైతం ఆక్రమించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మూడంతస్తుల భారీ భవనాన్ని నిర్మించి టీడీపీ జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. 2014లో టీడీపీ తిరిగి అధికారంలోకి రాగానే అందులో ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం స్థలానికి ప్రహరీని నిర్మించారు. ఇంత జరుగుతున్నా ఈ అక్రమ కట్టడానికి నగరపాలక సంస్థ నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. 20 ఏళ్లుగా సదరు భవనానికి అనుమతులు లేకుండా, రూపాయి కూడా పన్ను చెల్లించకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండటం గమనార్హం.

ఖజానాకు భారీగా గండి
టీడీపీ కార్యాలయ భవనం కోసం వెయ్యి గజాలు మాత్రమే కార్పొరేషన్‌ నుంచి లీజుకు తీసుకున్నారు. అది కూడా మూడేళ్లుగా రెన్యువల్‌ చేసుకోకపోవడం గమనార్హం. మరోవైపు ఆ పక్కనే సుమారు రూ.30 కోట్ల విలువ చేసే కార్పొరేషన్‌కే చెందిన 1,637 గజాల స్థలాన్ని కూడా ఆక్రమించి టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి 20 ఏళ్లుగా రూపాయి కూడా పన్ను కట్టని పరిస్థితి నెలకొంది. కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికైనా మేలుకొనివిలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి అనుమతులు లేవు
గుంటూరు అరండల్‌పేట 12/3లో ఉన్న టీడీపీ రాష్ట్ర కార్యాలయ భవనానికి అనుమతులు లేవు. సుమారు 15 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించారు. ఇప్పటివరకు ఈ భవనానికి పన్ను వేయలేదు. అనుమతులు లేకపోవడం వల్లే పన్ను విధించలేదు. రికార్డులు పరిశీలించి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి నోటీసులు జారీచేస్తాం. 
– చక్రపాణి, గుంటూరు సిటీ ప్లానర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement