మాజీ మంత్రిగారి భూ మాయ | galla aruna kumariGHMC Public land Registration CBI Inquiry | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రిగారి భూ మాయ

Published Sun, Apr 13 2014 1:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

మాజీ మంత్రిగారి భూ మాయ

మాజీ మంత్రిగారి భూ మాయ

సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ మంత్రి గల్లా అరుణకుమారి భూ మాయ లు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని బహుళ అంతస్తుల భవనం నిర్మించడం పై సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అదే తరహాలో చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందల ఎకరాలు గల్లా అరుణకుమారి కుటుంబం పరమయ్యా యి. కేవలం అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ వ్యవహారాలు నడిపినట్లు సమాచారం. ప్రధానంగా వీరు పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములపై కన్నేశారు.
 
 ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వ అవసరాలకోసం కొనుగోలు చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయించడం, ఆ తరువాత ఆ భూముల్లో గల్లా అనుచరులు, బంధువులు పాగావేసి అక్కడి రైతులకు ఎంతో కొంత డబ్బు చెల్లించి వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు పూర్తిస్థాయిలో సహకరించాయని చెప్పవచ్చు. పూతలపట్టు పంచాయతీలోని సర్వే నెంబరు 328/1లో 2.51 ఎకరాలు పట్నం బాలసుబ్రమణ్యం అనే వ్యక్తికి బతుకుదెరువుకోసం ప్రభుత్వం పట్టా ఇచ్చింది. డీకేటీ పట్టా లు కేవలం అనుభవించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వారు పరిశ్రమల అభివృద్ధికి భూసేకరణ చేసేందుకు అప్పుడప్పుడు నోటీసులు జారీ చేస్తారు. భూములను రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి ప్రభుత్వ పరంగా సొమ్ము చెల్లిస్తారు. 
 
 ఈ విషయంలో పేదలకు ఇచ్చిన భూములైనా సరే, ప్రభుత్వ అవసరాల కోసం ఇవ్వక తప్పదు. అందులో భాగంగా అప్పటి కలెక్టర్ 2005 డిసెంబర్ 9న ఈ ప్రాంతంలోని కొందరి భూములు ఏపీఐఐసీకి కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఆ తరువాత అభ్యంతరాలు స్వీకరించి వారి భూములకు పరిహారం ఇచ్చారు. బాలసుబ్రమణ్యంకు చెం దిన భూమిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి, 2006 మార్చి 14న డబ్బు ఇచ్చివేసింది. అయితే అంతకు ముందే అంటే 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడు బాలసుబ్రమణ్యం వద్ద ఈ భూమిని కొనుగోలు చేసి పాకాల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించుకున్నాడు.
 
 రిజిస్ట్రేషన్ ఎలా చేశారు? 
 ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు లేదు. గతంలో అసైన్‌మెంట్ చట్టం ప్రకారం పట్టా పొందిన వ్యక్తి 20 ఏళ్ల తరువాత తహశీల్దార్ వద్ద ఎన్‌వోసీ తీసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఆ చట్టాన్ని పదేళ్ల క్రితం ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములకు ఎన్‌వోసీలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించే అవకాశం లేదు. అయితే గల్లా అరుణకుమారి మంత్రి కావడంతో ఆమె చెప్పినట్లు రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తలూపారు. సుబ్రమణ్యం వద్ద నుంచి భూమిని రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చారు.
 
 సుబ్రమణ్యానికి అవార్డ్ ఎలా పాసైంది?
 సుబ్రమణ్యం తన భూమిని (డీకేటీ) 2006 ఫిబ్రవరి 18న గల్లా రామచంద్రనాయుడికి అమ్మినట్లు రిజిస్ట్రేషన్ జరిగింది. ఇదే భూమికి 2006 మార్చి 14న 6/2005-06 నెంబరుతో అవార్డ్ పాస్ చేశారు. అంటే గల్లా రామచంద్రనాయుడు కొనుగోలు చేసిన భూమిని ప్రభుత్వం పరిశీలించకుండా సుబ్రమణ్యానికి డబ్బు చెల్లించింది. ప్రభుత్వం ఎలా చేసింది? ఎందుకు చేసింది? ఎవరు ఇలా చేయమన్నారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు. కలెక్టర్ వీటిపై సమగ్రమైన విచారణ కు ఆదేశించాల్సి ఉంది. ఎనిమిది సంవత్సరాలు గా ఈ వ్యవహారాన్ని పట్టించుకున్న వారు లేరు.
 
 కొనడానికి వారెవరు? 
 అమ్మడానికి వీరెవరు?
 ప్రభుత్వం పేదలకు సాగుకోసం భూములు ఇస్తే వాటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ హక్కులేదు. ఒక వేళ ఏ పేదవాడైనా ప్రభుత్వం ఇచ్చిన భూమిని అమ్మితే కొనుగోలు చేసిన వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఈ భూములకు రిజిస్ట్రేషన్ చేసే అవకాశం కూడా లేదు. అయితే మాజీ మంత్రి కుటుంబం వరకు వచ్చే సరికి అన్నీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగానే జరిగాయి.
 
 ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని..
 ఏపీఐఐసీని అడ్డంపెట్టుకుని గల్లా అరుణకుమారి వందల ఎకరాల భూములను అడ్డగోలుగా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వారికి అనుకూలంగా ఉన్నాయనుకున్న భూములను ప్రభుత్వ అవసరాలకోసం కావాలంటూ ఏపీఐఐసీ ద్వారా నోటిఫికేషన్‌లు ఇవ్వడం, ఆ తరువాత ఏపీఐఐసీ వారు పట్టీ పట్టనట్లు వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఏపీఐఐసీకి ఇచ్చే బదులు తమకు ఇస్తే వారికంటే ఒక వెయ్యి ఎక్కువే ఇస్తామంటూ పేదలను మభ్యపెట్టి భూములు లాక్కున్నారు. ఒకసారి ఏపీఐఐసీ నోటిఫికేషన్ ఇచ్చి, అవార్డ్ పాస్ చేసిన భూములను కూడా స్వాధీనం చేసుకున్నారంటే ప్రభుత్వాన్ని కూడా మోసం చేసినట్లుగానే భావించాల్సి        వస్తుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement