సామాన్యుడి విజయం!
- గల్లాను మట్టి కరిపించిన చెవిరెడ్డి
- పనిచేయని అరుణమ్మ ఎత్తుగడలు
చంద్రగిరి, న్యూస్‌లైన్: రాజకీయ అనుభవం లేని వ్య క్తి.. ధన బలమూ లేని వ్యక్తి.. తాను నమ్మిన సి ద్ధాంతం కోసం ఎంత వరకైనా పోరాటం చేయగల యోధుడు... సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి రాజకీయాల్లో ఎదురులేని విజయాలను సొంతం చేసుకుంటున్నాడు ఓ సామాన్య వ్యక్తి. రాజకీయ కురువృద్ధురాలు, సుదీర్ఘ రాజకీయ కుటుంబ నేపథ్యం, అశేష ధన బలం ఉన్న వ్యక్తిని ఎన్నికల్లో ఢీకొని మట్టి కరిపిం చాడు ఓ సామాన్య వ్యక్తి. వరుస విజయాలతో దూసుకెళుతున్న మాజీ మంత్రి గల్లా అరుణకుమారిని ఓడిం చిన ఆ సామాన్యుడు చంద్రగిరిలో చారిత్రాత్మక విజ యాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సామాన్యుడే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.
సేవ చేయాలనే తపన, నమ్ముకున్న వారి కోసం ప్రాణాలైనా ఇచ్చి కాపాడుకోవాలనుకునే తత్వంతో పాటు, విశ్వసనీయతను వైఎస్ కుటుంబం నుంచి సొంతం చేసుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే పార్టీ బలోపేతానికి చెవిరెడ్డి చేసిన కృషి మరువలేనిది. రాజకీయంగా, వ్యక్తిగతంగా రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆయన వెనకడుగు వేయలేదు. నమ్ముకున్న కార్యకర్తల కోసం అండగా నిలబడ్డారు.
ఢిల్లీలో రాజకీయ దిగ్గజం షీలాదీక్షిత్‌పై పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే సంచలన విజయం సాధించిన సామాన్యుడు అరవింద్ కేజ్రీవాల్‌తో నియోజకవర్గ ప్రజలు చెవిరెడ్డిని పోలుస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వరుసగా ఎమ్మెల్యేగా గెలవడం, మూడు పర్యాయాలు వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారిపై విజయం అంటే అంత ఆషామాషీ కాదు. అయినా పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే విజయాన్ని నమోదు చేసుకున్న చెవిరెడ్డిని నియోజకవర్గ ప్రజలు మరో ‘సామాన్యుడు’ అని మెచ్చుకుంటున్నారు.
పనిచేయని ‘గల్లా’ ఎత్తుగడలు...
సార్వత్రిక ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని గల్లా అరుణకుమారి వేసిన రాజకీయ ఎత్తుగడలు ఓటర్ల ముందు బెడిసికొట్టాయి. తనతో పాటు కాంగ్రెస్ క్యాడర్ వెంట వస్తుందని, వారి ఓట్లన్నీ తనకే పడతాయని, ఇక టీడీపీ ఓట్లూ తనకేనని భావించిన గల్లా చంద్రగిరి ఎమ్మెల్యే బరిలోకి మరోసారి దిగారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు తనతో పాటే వస్తుందని ఆశపడి పోటీకి దిగిన గల్లాకు చుక్కెదురైంది. ఆమెకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ముందు రెండు పార్టీల ఓట్లు కలసినా ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాయి. ఎన్నికల్లో అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడినా ఆమెకు చెవిరెడ్డి చేతిలో ఓటమి తప్పలేదు.