దర్జాగా కబ్జా
పరుల చేతుల్లోకి ప్రభుత్వ భూమి
సాక్షి ప్రతినిధి, మహ బూబ్‌నగర్ : జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్ భూములున్నట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాటిలో చాలావరకు అక్రమార్కుల కబ్జాలకు గురయ్యాయి. అయినా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మొదలుకుని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రభుత్వ, ఇతర మిగులు భూమిని వివిధ వర్గాలకు అసైన్ చేస్తూ వచ్చారు. లబ్ధిదారుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 1956 నుంచి 2014 వరకు 1,67,290 మంది లబ్ధిదారులకు 2,83,267.24 ఎకరాలు ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే దశాబ్ధాల కాలంలో వివిధ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం కేటాయించిన భూమి కొన్నిచోట్ల చేతులు మారింది. అసైన్డ్ భూమి విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొందరు అసైన్డ్ భూముల్లో పాగా వేయగా, మరికొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడ్డారు. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎంత మేర అన్యాక్రాంతమయ్యాయనే వివరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగం వద్ద లేకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ గణనీయంగా పెరగడంతో రియల్‌ఎస్టేట్ వ్యాపారులు, కబ్జారాయుళ్ల కన్ను అసైన్డ్, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములపైనా పడింది. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు కొన్నిచోట్ల అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల చెరువు శిఖం భూములు కూడా కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఇటీవల నీటిపారుదల శాఖ నిర్వహించిన చెరువుల, కుంటల సర్వేలోనూ బయటపడింది.
వక్ఫ్‌భూముల్లో కబ్జాల పర్వం
జిల్లాలోని వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురై కోర్టు కేసుల్లో నలుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున 600 ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమిని కొందరు బోగస్ రికార్డు లు సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో భూమిని దానం చేసిన వారికి వారసులుగా పేర్కొంటూ, రెవెన్యూ అధికారుల అండతో కొందరు వక్ఫ్ భూములకు ఎసరు పెట్టారు.
వక్ఫ్‌భూములను కాపాడే లక్ష్యంతో అధికారులు 1200 ఎకరాల కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారందరూ కోర్టును ఆశ్రయించడంతో విలువై న భూమి ఎవరికి చెందుతుందో తెలియన పరిస్థితి నెల కొంది. అప్పన్నపల్లి, బోయపల్లి, నాగర్‌కర్నూలు తదితర చో ట్లా వక్ఫ్‌భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, అసైన్డ్ భూమి పరుల హస్తాల్లోకి వెళ్లడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగి హౌస్‌కమిటీ ఏర్పాటుకు దారితీసింది. జిల్లాలోని అసైన్డ్, మిగులు, ప్ర భుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపైనా దృష్టిసారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది.
ఆరు విడతల్లో ప్రభుత్వ భూ పంపిణీ (ఎకరాల్లో)
కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ
ఎస్సీలు 5,800 7,755.37
ఎస్టీలు 2,197 3,374.07
బీసీలు 8,579 12,701.30
మైనార్టీలు 131 249.32.00
ఇతరులు 1154 1,970.14
మొత్తం 17,861 26,052.00