లక్ష సైనికుల  కోటి కన్నుల కెమెరా! | Gauri Gills Wins The 10th Prix Pictet Award In Photo Series Captures | Sakshi
Sakshi News home page

లక్ష సైనికుల  కోటి కన్నుల కెమెరా!

Published Wed, Oct 11 2023 9:30 AM | Last Updated on Wed, Oct 11 2023 9:57 AM

Gauri Gills Wins The 10th Prix Pictet Award In Photo Series Captures - Sakshi

నా చేతిలో కెమెరా ఉంటే నాకు భయమనేదే లేదు’ అనేది ఫొటోగ్రాఫర్‌ గౌరీ గిల్‌కు ఇష్టమైన మాట. ఈ కారణం వల్లే కావచ్చు ఆమె ఏ భయమూ లేకుండా మారుమూల పల్లెల నుంచి మహా అరణ్యాల వరకు వెళ్లింది. తన భుజాల మీద కెమెరా ఉంటే, తన చుట్టూ లక్షల సైన్యం ఉన్నట్లే. వర్తమాన చరిత్ర, సంస్కృతి, సంబరాన్ని తన కెమెరా కంటితో పట్టుకుంది గౌరీ గిల్‌. తన ఫొటో సిరీస్‌ ‘నోట్స్‌ ఫ్రమ్‌ ది డిజర్ట్‌’తో ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్‌ పిక్‌టెట్‌ అవార్డ్‌ గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన మల్టీనేషనల్‌ ప్రైవేట్‌ బ్యాంక్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ పిక్‌టెట్‌ ‘ప్రిక్స్‌ పిక్‌టెట్‌’ (ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ ఇన్‌ ఫొటోగ్రఫీ)కి 2008లో శ్రీకారం చుట్టింది...

చండీగఢ్‌లో పుట్టిన గౌరి గిల్‌ దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో బీఎఫ్‌ఏ చేసింది. న్యూయార్క్‌లోని ‘పార్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ డిజైన్‌’లో ఫొటోగ్రఫీలో బీఎఫ్‌ఏ, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో ఎంఎఫ్‌ఏ చేసింది. అమెరికా, ఇండియాలో ఉన్న బంధువులను ఫొటోలు తీయడంతో తన ప్రయాణం మొదలైంది. రాజస్థాన్‌లోని అట్టడుగు వర్గాల జీవితాలను అధ్యయనం చేసిన తరువాత తాను చేసిన ఫొటో ప్రాజెక్ట్‌ ‘నోట్స్‌ ఫ్రమ్‌ ది డెజర్ట్‌’కు మంచి పేరు వచ్చింది. ‘ది మార్క్‌ ఆన్‌ ది వాల్‌’ ‘జన్నత్‌’... మొదలైన ఎగ్జిబిషన్‌లు, ప్రాజెక్ట్‌లతో ప్రశంసలు అందుకుంది.

నోట్స్‌ ఫ్రమ్‌ ది డెజర్ట్‌ ప్రాజెక్ట్‌ విషయానికి వస్తే... ఈ ప్రాజెక్ట్‌ కోసం రాజస్థాన్‌లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. సంచారుల నుంచి రైతుల వరకు ఎంతోమందితో మాట్లాడింది. కాలాలతో పాటు మారే వ్యక్తుల జీవితాలను గమనించింది. తాను పరిశీలించిన జీవితాల గురించి డైరీలో రాసుకుంది. ఆ తరువాత తన కెమెరా ప్రయాణం రాజస్థాన్‌ మారుమూల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఆదివాసుల ఇళ్ల దగ్గరకు చేరింది. వర్లీ ఆర్ట్‌ను ఒడిసిపట్టుకుంది. ఫలానా ఊళ్లో ఫలానా ప్రత్యేకత ఉందనే మాట చెవికి సోకగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతుంది.

మోహడా అనే ఊళ్లో గ్రామస్థులు పురాణ పాత్రల మాస్క్‌లను ధరించి పెద్ద ఊరేగింపు తీస్తారు. ఈ మాస్క్‌లనే సబ్జెక్ట్‌గా తీసుకొని ఫొటోప్రాజెక్ట్‌ చేసింది. ఒకరోజు ఒక గ్రామంలోని పశువుల ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్‌ లేడు. అయితే ఆ డాక్టర్‌ సీట్‌లో దోమ మాస్క్‌ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. పేషెంట్‌ సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో మాస్క్‌ పెట్టుకున్నాడు. ఆ ఆస్పత్రిలోని పాత సామాను, గోడలకు వేసిన రంగులు, ఆస్పత్రి చుట్టుపక్కల రకరకాల ఆవులు, వాటిని కాచుకు కూర్చున్న రైతులు... ఈ అంశాలన్నీ వచ్చేలా ఫొటోలు తీసింది. ఈ ఫోటోల నుంచి ఆలోచించిన వారికి ఆలోచించినన్ని కోణాలు కనిపిస్తాయి. ఎవరి వ్యాఖ్యానాలూ అవసరం లేకుండానే సమాధానాలు దొరుకుతాయి.

మొదట్లో ఒక పక్షపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసింది గౌరి. తన ఆసక్తి గ్రామాలు, మారుమూల పల్లెల్లోని స్కూళ్లపై ఉండేది. అయితే తన ఉద్యోగం ద్వారా పల్లెలకు వెళ్లే అవకాశం రాలేదు. దీంతో పల్లెబాట పట్టడానికి ఉద్యోగాన్ని వదిలింది. ఎన్నో స్కూళ్ల చుట్టూ తిరిగింది. ‘ఇది స్కూల్‌ కాదు. ఇదే అసలు సిసలు ప్రపంచం’ అనుకుంది. ‘ది మార్క్‌ ఆన్‌ ది వాల్‌’ ప్రాజెక్ట్‌తో ప్రభుత్వ పాఠశాలల్లోని గోడలపై ఉన్న రాతలు, చిత్రాలను డాక్యుమెంట్‌ చేసింది.

‘ట్రేసెస్‌’ పేరుతో సమాధులపై చేసిన ప్రాజెక్ట్‌ మరో అద్భుతం. నిజానికి గౌరీ గిల్‌ అద్భుతాలు సృష్టించడానికి కెమెరా పట్టుకోలేదు. భిన్న సంస్కృతులు, భౌగోళిక అందాలపై ఆసక్తే అద్భుతాలను సృష్టించి ఆమెను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్‌ని చేశాయి. 2011లో కెనడాలోని ప్రతిష్ఠాత్మకమైన ఫొటోగ్రఫీ అవార్డ్‌ గ్రాంజ్‌ గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గౌరికి వినడం ఇష్టమైన పని. విన్న విషయాలను విశ్లేషించుకొని తన కెమెరాకు ముడిసరుకుగా మార్చుకోవడం మరింత ఇష్టమైన పని. 

(చదవండి: కార్‌ డిజైనర్‌ థార్‌ డిజైనర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement