the Irregulars
-
చంపాస్తున్నారు
ధనార్జనే ధ్యేయంగా ఇసుకాసురులు చేస్తున్న ఆగడాలతో చంపావతి నదికి గర్భశోకం మిగులుతోంది. అక్రమార్కులు నదిని ఆక్రమించుకుని సొంతంగా ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసుకుం టూ ఇసుకను తోడేస్తున్నారు. అధికార పక్షం అండదండలుండడంతో అధికారులు కూడా అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతూ ఇసుక మాఫియా జిల్లాలో ఎక్కడికక్కడ తిష్ఠ వేసింది. విజయనగరం, సాక్షిప్రతినిధి: చిన్న మరుగుదొడ్డి కట్టుకునేందుకు కూడా ఇసుక దొరకడం కష్టమవుతున్న ఈ రోజుల్లో చంపావతి నది ఒడ్డును సైతం లాగేసి రెండు కిలోమీటర్ల దూరంలో వందల లోడ్ల ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. గజపతినగరం మండలం కెంగువ గ్రామం వెంబడి చంపావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిలో ఇసుక మేటలు బాగానే ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగు దేశం నాయకుడొకరు నదిలో ఉన్న ఇసుకను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఇసుక రీచ్ మంజూరు కాకుండానే ఇక్కడి ఇసుకను గ్రామ పరిసరాల్లోనూ, పొలిమేరల్లోనూ ఎక్కడ బడితే అక్కడ డంపింగ్‌చేసి నిల్వలు పెంచుకుంటున్నారు. వర్షాకాలంలో ఇసుక ధర పెరిగి వ్యాపారం బంగారంలా సాగుతుంది. అందుకే ప్రస్తుతం తవ్వుతున్న ఇసుక అంతా అమ్ముకోకుండా కొద్ది కొద్దిగా అమ్ముతూ మరికొంత దాచుకుంటు న్నారు. మూడు నెలలుగా ఈ ఇసుక దందా జరుగుతోంది. రోజుకు 20 యూనిట్ల మేరకు నది నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. మరిన్ని ట్రాక్టర్లున్నా..!: కెంగువ అనధికార రీచ్‌లో ఇసుక తరలించేందుకు ఏ ట్రాక్టరు యజమానీ ముందుకు రాకపోవడం విశేషం. అనధికార రీచ్‌ను నడుపుతున్న టీడీపీ నాయకుడి వాహనం ఒక్కటే రోజంతా ఇసుకను తరలించి డంపింగ్ చేస్తూ నిల్వలను పెంచుతున్నారు. గ్రామంలో సుమారు ఆరు నుంచి పది ట్రాక్టర్ల వరకూ ఉన్నట్టు భోగట్టా! కానీ వీరెవరూ ఈ ఇసుకను తరలించడానికి ముందుకు రావడం లేదంటే అధికార పక్షం దన్ను ఎంతగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఇసుక ట్రాక్టరు లోడ్‌కు రూ.1500 నుంచి రెండు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. వ్యాపారం జరుగుతుండగానే ఇసుక లోడ్లను నిల్వలు చేస్తున్నారు. కమిటీలు ఏం చేస్తున్నట్లో..!: గ్రామస్థాయిలోనూ, మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ ఇసుక అక్రమ రవాణా నిరోధక కమిటీలను కలెక్టర్ ఆధ్వర్యంలో వేశారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే మూడు విడతలుగా భారీ జరిమానాలు అమలు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ కమిటీల్లో ఎస్సై, తహశీల్దార్, వీఆర్వో తదితరులున్నా ఎక్కడా తనిఖీలు లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదని స్పష్టమవుతోంది. ఈ కమిటీలు కూడా చూసీ చూడనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని జిల్లా వ్యాప్తంగా విమ ర్శ లు వస్తున్నాయి. ప్రారంభంలో కాస్త కఠినంగా వ్యవహరించిన జిల్లా, మండల స్థాయి యంత్రాంగం ఇప్పుడు ఆ స్థాయిలో వ్యవహ రించడం లేదని, తిరిగి అక్రమార్కులకే వంత పాడుతూ ఇసుక రవాణాకు పరోక్షంగా సహకరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఈ అక్రమ డంపింగ్‌ను నిలిపివేయాలని కోరుతున్నారు. -
అటవీ సంపద హాంఫట్
అడవి పండింది...కాకులు తిన్న చందంగా తయారైంది అటవీ సంపద పరిస్థితి. అటవీ భూముల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి పెంచుతున్న సరివి తోటలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు అటవీ శాఖాధికారులు పూర్తిగా వత్తాసు పలకడంతో అటవీ సంపద హాంఫట్ అవుతోంది. చీరాల: ఒంగోలు అటవీ రేంజ్ పరిధిలోని వేటపాలెం ఫారెస్ట్ సెక్టార్లో అడవీధిపాలెం, జీడిచెట్లపాలెం, మోటుపల్లి గ్రామాలున్నాయి. ఈ పంచాయతీల పరిధిలో 360 ఎకరాలకుపైగా అటవీ భూములున్నాయి. సుమారు 200 ఎకరాల్లో అటవీ శాఖ సరివి చెట్లు పెంచుతోంది. వన సంర క్షణ సమితి పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో ఈ చెట్లు పెంచుతున్నారు. చెట్లు ఒక సైజుకొచ్చిన తరువాత బహిరంగ టెండర్ ద్వారా వేలం వేసి టన్ను రేటు ఎవరు ఎక్కువకు కోడ్ చేస్తే వారికి టెండర్ ఇవ్వాల్సి ఉంటుంది. వేలం ద్వారా వచ్చిన మొత్తంలో సగం ప్రభుత్వానికి, మిగిలిన సగం ఆ పరిధిలో ఉన్న గ్రామస్తులు, లేక గ్రామాభివృద్ధికి కేటాయించాలి. కానీ వేటపాలెం అటవీ సెక్టార్ పరిధిలో నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. వన సంరక్షణ పథకం కింద గ్రామస్తులతో ఒక క మిటీని నియమించి ఆ కమిటీ ఆమోదంతోనే టెండర్లు నిర్వహించాలనే నిబంధన ఉంది. కానీ అసలు ఆ కమిటీ ఊసే లేదు. అంతా అటవీ అధికారుల కనుసన్నల్లోనే టెండర్లు, ఇతర వ్యవహారాలు సాగుతున్నాయి. దీంతోనే అక్రమాలకు తెరలేచింది. అటవీ సంపదను ఇష్టారాజ్యంగా మేసేస్తున్నారు. రాత్రి వేళల్లో కొందరు అక్రమార్కులు అటవీ భూముల్లో ఉన్న సరివి చెట్లను కొట్టి రిక్షాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి లారీల్లో జిల్లాలు దాటి అటవీ సంపద తరలిపోతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. ప్రస్తుతం సుమారు వంద ఎకరాల్లో బాగా పెరిగిన సరివి చెట్లున్నాయి. వాటికి ఎటువంటి టెండర్లు నిర్వహించడం లేదు. కానీ రోజూ రాత్రి వేళల్లో కొందరు అటవీ భూముల్లో చొరబడి సరివి చెట్లు నరికేసి తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అటవీశాఖ అధికారులకు సమాచారం పక్కాగానే ఉంది. కానీ వారు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు తెలిసినా మౌనం దాలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పలుమార్లు సంబంధితశాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామానికి చెందిన వడ్లమూడి అన్నమయ్య వాపోతున్నాడు. స్థానికంగా ఉండని అటవీ శాఖ అధికారులు.. వేటపాలెం ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉండాలి. అలానే భూముల సమీపంలో బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. నెలకు ఒకటి, రెండుసార్లు మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అందుకే అక్రమార్కులకు దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న చందంగా మారింది ఈ అటవీ సంపద. గ్రామస్తులకు పైసా దక్కని వైనం... వనసంరక్షణ పథకం కింద అమ్మిన అటవీ సంపదలో గ్రామాభివృద్ధికి లేక గ్రామస్తులకు సగం మొత్తం ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అటువంటి ది ఏమీ ఇక్కడ జరగలేదు. గ్రామానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని గ్రామస్తులు అంటున్నారు. -
దర్జాగా కబ్జా
పరుల చేతుల్లోకి ప్రభుత్వ భూమి సాక్షి ప్రతినిధి, మహ బూబ్‌నగర్ : జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్ భూములున్నట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాటిలో చాలావరకు అక్రమార్కుల కబ్జాలకు గురయ్యాయి. అయినా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మొదలుకుని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రభుత్వ, ఇతర మిగులు భూమిని వివిధ వర్గాలకు అసైన్ చేస్తూ వచ్చారు. లబ్ధిదారుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1956 నుంచి 2014 వరకు 1,67,290 మంది లబ్ధిదారులకు 2,83,267.24 ఎకరాలు ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే దశాబ్ధాల కాలంలో వివిధ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం కేటాయించిన భూమి కొన్నిచోట్ల చేతులు మారింది. అసైన్డ్ భూమి విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొందరు అసైన్డ్ భూముల్లో పాగా వేయగా, మరికొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడ్డారు. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎంత మేర అన్యాక్రాంతమయ్యాయనే వివరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగం వద్ద లేకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ గణనీయంగా పెరగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు, కబ్జారాయుళ్ల కన్ను అసైన్డ్, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములపైనా పడింది. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు కొన్నిచోట్ల అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల చెరువు శిఖం భూములు కూడా కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఇటీవల నీటిపారుదల శాఖ నిర్వహించిన చెరువుల, కుంటల సర్వేలోనూ బయటపడింది. వక్ఫ్‌భూముల్లో కబ్జాల పర్వం జిల్లాలోని వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురై కోర్టు కేసుల్లో నలుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున 600 ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమిని కొందరు బోగస్ రికార్డు లు సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో భూమిని దానం చేసిన వారికి వారసులుగా పేర్కొంటూ, రెవెన్యూ అధికారుల అండతో కొందరు వక్ఫ్ భూములకు ఎసరు పెట్టారు. వక్ఫ్‌భూములను కాపాడే లక్ష్యంతో అధికారులు 1200 ఎకరాల కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారందరూ కోర్టును ఆశ్రయించడంతో విలువై న భూమి ఎవరికి చెందుతుందో తెలియన పరిస్థితి నెల కొంది. అప్పన్నపల్లి, బోయపల్లి, నాగర్‌కర్నూలు తదితర చో ట్లా వక్ఫ్‌భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, అసైన్డ్ భూమి పరుల హస్తాల్లోకి వెళ్లడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగి హౌస్‌కమిటీ ఏర్పాటుకు దారితీసింది. జిల్లాలోని అసైన్డ్, మిగులు, ప్ర భుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపైనా దృష్టిసారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. ఆరు విడతల్లో ప్రభుత్వ భూ పంపిణీ (ఎకరాల్లో) కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ ఎస్సీలు 5,800 7,755.37 ఎస్టీలు 2,197 3,374.07 బీసీలు 8,579 12,701.30 మైనార్టీలు 131 249.32.00 ఇతరులు 1154 1,970.14 మొత్తం 17,861 26,052.00 -
‘గూడుపుఠాణి
సాక్షి, కరీంనగర్ : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై 36 రోజులపాటు చేస్తున్న సీబీసీఐడీ విచారణలో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం మూడు మండలాల్లో.. అదీ తొలి విడత విచారణలోనే 710 మంది అక్రమార్కులున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి విచారణ, రికార్డులు లోతుగా పరిశీలిస్తే సంఖ్య వెయ్యి దాటుతుందని స్వయంగా అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు అక్రమార్కులపై దసరా తర్వాత చర్యలు తీసుకునేందుకు సర్కారు నిర్ణయించింది. తొలి విడత క్షేత్రస్థాయి విచారణను రెండు రోజుల్లో పూర్తి చేసి.. రికార్డులు పరిశీలించేందుకు సీఐడీ బృందాలు కసరత్తు చేస్తున్నాయి. పరిశీలన ఐదురోజుల్లోగా పూర్తి చే సి నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఐడీ డీఎస్పీ మహేందర్ నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దూకుడు.. ప్రభుత్వ వైఖరితో ఇందిరమ్మ ఇళ్ల అనర్హులు.. దళారులు.. ప్రజాప్రతినిధుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెల 14 నుంచి మల్హర్ మండలం రుద్రారం, మహాముత్తారం మండలం పెగడపల్లి, వీణవంక మండలం రెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐ రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. వీటి పరిధిలో మంజూరై.. నిర్మాణం పూర్తయిన ఇల్లు మొత్తం 2708 ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణ బృందాలు నిగ్గు తేల్చాయి. వెయ్యికి పైగా మంది అక్రమార్కులు ఉంటారని సీఐడీ చెబుతోంది. కేవలం మూడు మండలాలు.. నాలుగు గ్రామాల్లోనే వెయ్యి మందికి పైగా అక్రమార్కులున్నారంటే జిల్లావ్యాప్తంగా ఇంకెంత మంది అక్రమార్కుల బండారం బయటపడుతుందోననే చ ర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. అక్రమార్కుల్లో గృహనిర్మాణశాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పారిశ్రామిక వేత్తలు, సింగరేణి కార్మికులూ ఉన్నారని సీఐడీ విచారణలో తేలింది. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. రెండో విడత జిల్లావ్యాప్తంగా..? ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై తొలి విడతగా ప్రభుత్వం జిల్లాలోని రెండు నియోజకవర్గాలు.. నాలుగు గ్రామాల్లో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణ పూర్తయిన తర్వాత సీఐడీ విచారణ అధికారులు ఇచ్చే నివేదికల అనుగుణంగా రెండో విడత విచారణ చేపట్టాలని యోచిస్తోంది. అన్ని చోట్లా ఊహించని విధంగా అక్రమాలు వెలుగులోకి రావడం.. విచారణలో అవి నిర్ధరణ కావడంతో రెండో విడత విచారణ జిల్లావ్యాప్తంగా చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విచారణ కోసం సీఐడీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చే యాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క ఇప్పటి వరకు చేపట్టిన విచారణలో సీఐడీ అధికారులకు లభించిన హౌసింగ్ సిబ్బంది సహకారం అంతంతే. విచారణకు సహకరించని హుజూరాబాద్ డీఈఈని హౌసింగ్ పీడీ నర్సింగరావు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మంథని డీఈఈపైనా సీఐడీ డీఎస్పీ మహేందర్ ఇదే ఆరోపణ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందిరమ్మ ఇళ్లపై ఆరా! మహాముత్తారం/ మల్హర్ : మండలంలోని పెగడపల్లిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన జాటోత్ రజిత, వీరమ్మ, వావిల్లా హేమలత, జాటోత్ లహరియా, కీరిబాయి, జాటోత్ గౌతమిబాయి పేరిట మంజూరైన గృహాలను తనిఖీ చయగా.. హేమలత పేరిట సిబ్బంది రెండు విడతల బిల్లులు కాజేసినట్లు తేలింది. మరోవైపు పెగడపల్లి పరిధిలోని ప్రేమ్‌నగర్, ఆంజనేయపల్లి, మామిడిగూడెంలో 2006 నుంచి 2012 వరకు మంజూరైన 400 గృహాలను పరిశీలించారు. మల్హర్ మండలంలోని రుద్రారంలోనూ సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. హౌసింగ్ అధికారుల తీరుపై సీఐడీ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రారంలో 1133 ఇళ్లను సర్వే చేయగా.. 44 పాత ఇళ్లకు, 181 కట్టని ఇళ్లకు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. 15 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందారని, 115 పూర్తి కానివి, 56 బినామీ, 15 అవివాహితులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్లించారు. 95 ఇళ్లకు రెండుసార్లు బిల్లులు వచ్చినట్లు నిర్ధరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన డీఈ భాస్కర్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
కన్నుపడింది..కప్పేశారు!
అమలాపురంలో గెడ్డ, చెరువు ఆక్రమణ రూ.2 కోట్ల విలువైన భూమికి టెండర్ గెడ్డ, చెరువులను కప్పేసి కొబ్బరి, టేకు సాగు ఆర్డీవో తనిఖీతో వెలుగులోకి కుంభకోణం రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు నక్కపల్లి,న్యూస్‌లైన్: కన్నుపడిందే తడవు అక్రమార్కులు చెలరేగిపోయారు. ఏకంగా చెరువు, కాలువలను పొక్లయిన్‌తో కప్పేసి చదును చేసేశారు. దాదాపు రూ. 2 కోట్ల విలువైన భూమిని దర్జాగా ఆక్రమించేసి టేకు, కొబ్బరి సాగు చేపట్టేశారు. ఇంత జరిగినా మండల రెవెన్యూ సిబ్బందికి ఈ విషయం తెలియదట. అసలు వారికి సమాచారమే లేదట. గురువారం మండలంలోని ప్రభుత్వ భూముల వివరాల సేకరణకు వచ్చిన నర్సీపట్నం ఆర్డీవో సూర్యారావు పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానిక రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినందునే రెవెన్యూ సిబ్బంది నోరు మెదపలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... అమలాపురం సర్వే నంబర్ 270లో 18.7 ఎకరాలు గెడ్డ ప్రాంతం, సర్వే నంబర్ 295లో 4.17 ఎకరాలు చెరువు గర్భం ఉంది. వీటిని ఆనుకుని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్.ఈశ్వరరెడ్డి కుటుంబీకులకు సర్వేనంబర్ 294/1లో 1.2 ఎకరాలు, సర్వే నంబర్ 294/2లో 1.22 ఎకరాలు, 294/3ఎలో 1.85 ఎకరాలు, 294/3బిలో 0.25 సెంట్లు జిరాయితీ భూమి ఉంది. ఈ భూములను ఆనుకుని రెవెన్యూ రికార్డుల్లో గెడ్డగా నమెదయిన 5 ఎకరాలతోపాటు పద్దరాజు చెరువుగా రికార్డుల్లో ఉన్న 4.17 ఎకరాల్లో కొంతభూమిని అప్పలకొండ, సూర్యనారాయణరాజు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించేశారు. అందులో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని విస్తరించేశారు. కబ్జా భూముల్లో బోర్లు ఏర్పాటు కోసం విద్యుత్లైన్లు ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. చెరువును అడ్డంగా తవ్వి జిరాయితీ, ఆక్రమిత భూముల్లోకి రాకపోకలు సాగించేందుకు పక్కారోడ్డు కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. కొంతమంది సిబ్బంది సహాయంతో ఆక్రమిత భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు సంపాదించేందుకు కబ్జాదార్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భోగట్టా. కోస్తాతీరం వెంబడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పీసీపీఐఆర్‌లో నక్కపల్లి మండలం క్లస్టర్‌గా ఉంది. పీసీపీఐఆర్కోసం సేకరించే భూముల్లో అమలాపురం కూడా ఉండటంతో ఆక్రమణదార్లు ప్రభుత్వ భూములపై దృష్టిసారించారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో భూముల ధర ఎకరా రూ15 నుంచి 20 లక్షలు పలుకుతోంది. ప్రభుత్వం సేకరించినా దాదాపు ఇదేధర ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిరాయితీతోపాటు డీఫారం పట్టాభూములకు 70 శాతం నష్టపరిహారం వచ్చే అవకాశం ఉండటంతో కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూములపై పడుతోంది. ఆక్రమణపై ఫిర్యాదు అందడం వల్లే తనిఖీలకు వచ్చారని మరికొందరు చెప్పుకుంటున్నారు. అనుమానంతో పరిశీలన ఆక్రమణలపై ఎటువంటి ఫిర్యాదు అందలేదు. మండలంలోని ప్రభుత్వ భూముల పరిశీలనకు మాత్రమే అమలాపురం వచ్చాను. చెరువు గర్భంలోంచి రోడ్డు వేయడం చూసి అనుమానంతో ఆరాతీశాను. రోడ్డువేసిన ప్రాంతాన్ని ఆనుకుని సాగులో ఉన్న భూములు ప్రభుత్వానివని రెవెన్యూ అధికారుల నుంచి వివరణ వచ్చింది. దీంతో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని గుర్తించాను. అయితే ఎంత భూమి ఆక్రమణకు గురైందన్న దానిపై పూర్తి వివరాలు సర్వేచేసి ఇవ్వాలని తహశీల్దార్, సర్వేయర్లను ఆదేశించడం జరిగింది. నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయి. - సూర్యారావు, నర్సీపట్నం ఆర్డీవో