అటవీ సంపద హాంఫట్ | Wildlife hamphat | Sakshi
Sakshi News home page

అటవీ సంపద హాంఫట్

Published Wed, Feb 25 2015 2:30 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

Wildlife hamphat

అడవి పండింది...కాకులు తిన్న చందంగా తయారైంది అటవీ సంపద పరిస్థితి. అటవీ భూముల్లో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి పెంచుతున్న సరివి తోటలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాకు అటవీ శాఖాధికారులు పూర్తిగా వత్తాసు పలకడంతో అటవీ సంపద హాంఫట్ అవుతోంది.
 
చీరాల: ఒంగోలు అటవీ రేంజ్ పరిధిలోని వేటపాలెం ఫారెస్ట్ సెక్టార్‌లో అడవీధిపాలెం, జీడిచెట్లపాలెం, మోటుపల్లి గ్రామాలున్నాయి. ఈ పంచాయతీల పరిధిలో 360 ఎకరాలకుపైగా అటవీ భూములున్నాయి. సుమారు 200 ఎకరాల్లో అటవీ శాఖ సరివి చెట్లు పెంచుతోంది. వన సంర క్షణ సమితి పథకం కింద ప్రభుత్వం మంజూరు చేసే నిధులతో  ఈ చెట్లు పెంచుతున్నారు. చెట్లు ఒక సైజుకొచ్చిన తరువాత బహిరంగ టెండర్ ద్వారా వేలం వేసి టన్ను రేటు ఎవరు ఎక్కువకు కోడ్ చేస్తే వారికి టెండర్ ఇవ్వాల్సి ఉంటుంది.  వేలం ద్వారా వచ్చిన మొత్తంలో సగం ప్రభుత్వానికి, మిగిలిన సగం ఆ పరిధిలో ఉన్న గ్రామస్తులు, లేక గ్రామాభివృద్ధికి కేటాయించాలి. కానీ వేటపాలెం అటవీ సెక్టార్ పరిధిలో నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. వన సంరక్షణ పథకం కింద గ్రామస్తులతో ఒక క మిటీని నియమించి ఆ కమిటీ ఆమోదంతోనే టెండర్లు నిర్వహించాలనే నిబంధన ఉంది.

కానీ అసలు ఆ కమిటీ ఊసే లేదు. అంతా అటవీ అధికారుల కనుసన్నల్లోనే టెండర్లు, ఇతర వ్యవహారాలు సాగుతున్నాయి. దీంతోనే అక్రమాలకు తెరలేచింది. అటవీ సంపదను ఇష్టారాజ్యంగా మేసేస్తున్నారు. రాత్రి వేళల్లో కొందరు అక్రమార్కులు అటవీ భూముల్లో ఉన్న సరివి చెట్లను కొట్టి రిక్షాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అక్కడ నుంచి లారీల్లో జిల్లాలు దాటి అటవీ సంపద తరలిపోతోంది. కొన్నేళ్లుగా ఇదే తంతు సాగుతోంది. ప్రస్తుతం సుమారు వంద ఎకరాల్లో బాగా పెరిగిన సరివి చెట్లున్నాయి. వాటికి ఎటువంటి టెండర్లు నిర్వహించడం లేదు.

కానీ రోజూ రాత్రి వేళల్లో కొందరు అటవీ భూముల్లో చొరబడి సరివి చెట్లు నరికేసి తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అటవీశాఖ అధికారులకు సమాచారం పక్కాగానే ఉంది. కానీ వారు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులకు తెలిసినా మౌనం దాలుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు పలుమార్లు సంబంధితశాఖ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని గ్రామానికి చెందిన వడ్లమూడి అన్నమయ్య వాపోతున్నాడు.
 
స్థానికంగా ఉండని అటవీ శాఖ అధికారులు..
వేటపాలెం ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉండాలి. అలానే భూముల సమీపంలో బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు ఉండాలి. కానీ ఇక్కడ ఎవరూ స్థానికంగా ఉండటం లేదు. నెలకు ఒకటి, రెండుసార్లు మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. అందుకే అక్రమార్కులకు దోచుకున్న వాడికి దోచుకున్నంత అన్న చందంగా మారింది ఈ అటవీ సంపద.
 
గ్రామస్తులకు పైసా దక్కని వైనం...
 వనసంరక్షణ పథకం కింద అమ్మిన అటవీ సంపదలో గ్రామాభివృద్ధికి లేక గ్రామస్తులకు సగం మొత్తం ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అటువంటి ది ఏమీ ఇక్కడ జరగలేదు. గ్రామానికి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదని గ్రామస్తులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement