ప్రభుత్వ భూమిలో ప్లాట్లు..తమ్ముళ్లకు కోట్లు!
- రూ. 9కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ
- ప్లాట్లుగా వేసి విక్రయం
- టీడీపీ నాయకుడి నిర్వాకం
- ఆ భూమిలో ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదనలు
- బందరు బైపాస్ రోడ్డు వెంబడి ఆక్రమణల పర్వం
మచిలీపట్నం : పట్టణంలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. అధికార పార్టీ నేతలు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఇటీవల ఒక నాయకుడు పేదలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్న ప్రభుత్వ స్థలం తనదేనంటూ పోలీసుల అండతో హడావుడి చేస్తే.. ఇప్పుడు ఓ నేత ఏకంగా బైపాస్ రోడ్డు వెంబడి మూడు స్తంభాల సెంటరు నుంచి డంపిగ్ యార్డు వరకు ఉన్న 2.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. డ్రెయిన్‌ను పూడ్చివేసి రోడ్డుగా మార్చారు. ఆక్రమించిన స్థలాన్ని మెరక చేసి, ప్లాట్లు వేసి గజం రూ.7వేలు చొప్పున విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం తెలిసినా మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రెండు నెలలుగా..
రాష్ట్ర విభజన అనంతరం మచిలీపట్నంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే బలరామునిపేటకు చెందిన ఓ నాయకుడు మరికొందరితో కలిసి రెండు నెలల క్రితం హిందూ శ్మశానవాటిక, విశ్వబ్రాహ్మణుల శ్మశానవాటికల పక్కనే సర్వే నంబరు 176/5లో ఉన్న 2.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. మెరక చేసి ప్లాట్లుగా మార్చి నకిలీ పత్రాల సాయంతో విక్రయాలు ప్రారంభించారు. ఈ నెల రెండో తేదీన జరిగిన మున్సిపల్ పాలకవర్గ సమావేశంలోనూ భూ ఆక్రమణ చర్చకు వచ్చింది. అయినా ప్లాట్లు విక్రయం ఆగకపోవటం గమనార్హం.
వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు కేటాయించినా..
బైపాస్‌కు భూసేకరణ సమయంలో ఈ భూమిని ప్రభుత్వానికి చెందినదిగా గుర్తించారు. ఆ తర్వాత అప్పటి కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు కూడా పరిశీలించి ప్రభుత్వ భూమేనని నిర్దారించారు. మచిలీపట్నం ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఘంటసాల మండలం శ్రీకాకుళం సమీపంలోని కృష్ణానది నుంచి పైప్‌లైన్ వేసి రా వాటర్‌ను ఈ స్థలం వద్దకు తరలించాలని ప్రతిపాదనలు చేశారు. రా వాటర్‌ను ఫిల్టర్ చేసేందుకు ఈ భూమిలో ఫిల్టర్ ప్లాంట్‌ను నిర్మించాలని నిర్ణయించారు. దీనికోసం రూ.2కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించిన నివేదిక, ఫైళ్లు, పబ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభుత్వం మారగానే ఈ భూమిపై కన్నేసిన టీడీపీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించేశారు. లోతట్టుగా ఉన్న భూమిని మెరకచేశారు. రోడ్డు పక్కనే ఉన్న డ్రెయిన్‌ను పూడ్చి తాత్కాలిక రోడ్డును నిర్మించారు. యథేచ్ఛగా ప్లాట్లుగా విక్రయిస్తున్నారు.
గజం రూ. 7వేలు
ప్రభుత్వ భూమిని ఆక్రమించి మెరక చేసిన టీడీపీ నాయకులు గజం రూ.7వేలు చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 2.75 ఎకరాలు 13,200 గజాల స్థలం కాగా, ప్రస్తుతం టీడీపీ నాయకులు విక్రయిస్తున్న ధర ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.9.24 కోట్లు ఉంటుంది. ఇంతటి విలువైన భూమిని ఆక్రమించినా పట్టించుకోవడం లేదని ఈ నెల 2వ తేదీన జరిగిన మచిలీపట్నం పురపాలక సంఘ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను నిలదీశారు. రెండు రోజుల అనంతరం ఆ భూమిని పరిశీలించిన పురపాలక శాఖ అధికారులు ఆ తర్వాత నోరుమెదపలేదు. ప్రజల అవసరాల కోసం ఫిల్టర్ ప్లాంట్ నిర్మించాలని కేటాయించిన భూమి ఆక్రమణకు గురికావటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి ఆక్రమణలను అడ్డుకోవాలని, వాటర్ ఫిల్టర్ ప్లాంట్‌ను నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
ఇది పురపాలక సంఘానికి చెందిన భూమే
పంపుల చెరువుకు, డంపింగ్ యార్డుకు మధ్యలో ఉన్న భూమి పురపాలక సంఘానికి చెందినదే. ఇక్కడ ఫిల్టర్ ప్లాంట్ నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇక్కడ ఆక్రమణలు జరుగుతున్న విషయాన్ని గుర్తించి గతంలో నిలుపుదల చేశాం. రెండు రోజుల్లో ఇది పురపాలక సంఘానికి చెందిన భూమేనని బోర్డు ఏర్పాటు చేస్తాం.
- మారుతి దివాకర్, మున్సిపల్ కమిషనర్, మచిలీపట్నం