♦ మనియార్‌పల్లిలో బహిర్గతం
♦ ప్రభుత్వ భూమి సర్కార్‌కే విక్రయం
♦ భూ పంపిణీ పథకం అపహాస్యం
కోహీర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపంపిణీ పథకం పక్కదారి పట్టింది. ఓ గ్రామంలో ప్రభు త్వ భూమిని ప్రభుత్వానికే విక్రయిం చడం విమర్శలకు దారితీసింది. వాటిని అందుకున్న లబ్ధిదారులు ఏమిపాలుపోక అయోమయంలో పడిపోయారు. మండలంలోని మనియార్‌పల్లి, గొడిగార్‌పల్లి గ్రామాల్లో మొదటి విడత భూపంపిణీ జరిగింది. గొడిగార్‌పల్లిలో బండరాళ్లతో నిండిన భూములను పంపిణీ చేశారు. మనియార్‌పల్లిలో ప్రభుత్వ భూమినే తిరిగి కొనుగోలు చేసి పంపిణీ చేశారన్న ఆరోపణలు రావడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.యానియార్‌పల్లికి 31 మార్చి 2015న భూ పంపిణీ పథకం మంజూరైంది. గ్రామ శివారులోని సయ్యద్ షఫియొద్దీన్, వికారొద్దీన్, సిరాజొద్దీన్, అబ్దుల్ నజీర్, ముతాసిమ్‌లకు చెందిన 170, 186, 187వ సర్వే నంబర్ భూములకు సంబంధించిన 35.30 ఎకరాల భూమిని ఎంపిక చేశారు.
ఈ భూమిని 11 మంది లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయడానికి వీలుగా 16 ఏప్రిల్ 2015న ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. సదరు భూమిని స్థానిక అధికారులతోపాటు ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, అప్పటి జేసీ శరత్, ఎస్సీ కార్పొరేషన్ అధికారి చరణ్‌దాస్, ఎస్సీ కార్పొరేషన్ డెరైక్టర్ జైరాజ్ తదితరులు పరిశీలించారు. రూ.4.40 లక్షలకు ఎకరా చొప్పున కొనుగోలుకు నిర్ణయించారు. ఆ భూమిలో బోరు వేసి సాగుకు అనుగుణంగా తయారు చేసి ఇవ్వాలని నిబంధన పెట్టారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన 2 జూన్ 2015న మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. అయితే 170 సర్వే నంబర్‌లోని 9 ఎకరాలు, 186 సర్వే నంబర్‌లోని 16.67 ఎకరాల భూమి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఉన్నతాధికారులకు పంపిణీ నివేదికలో సైతం ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు.
నివేదికలో సమర్పించిన వివరాల ప్రకారం 1954-55 సంవత్సరంలో భూములకు సంబంధించి రికార్డులు అందుబాటులో లేవు. చౌపస్‌లాలో నాట్ అవైల్ అని రాసి ఉంది. 1959-60లో 170 సర్వే నంబర్ బిచ్చప్ప, 186 సర్వే నంబర్ జాఫర్ పేరిట భూమిని కేటాయించారు. ఆ భూమి 1972-73 పట్టాభూమిగా మార్చారు. 1958 తర్వాత ప్రభుత్వ భూములను అమ్మొద్దు, కొనొద్దు అనే నిబంధన ఉంది. ప్రభుత్వ భూమి కొనడానికి అమ్మడానికి వీలులేని పరిస్థితుల్లో ప్రభుత్వమే కొనుగోలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంది. ఈ విషయమై ఆర్డీఓ మధుకర్‌రెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు.