ప్రజల వద్దకు మద్యం
‘ప్రజల వద్దకు పాలన’ తరహాలో జిల్లాలో ‘ప్రజల వద్దకు మద్యం’ విధానం అందుబాటులోకి వచ్చేసింది. ‘గ్రేప్స్ ఆన్ వీల్స్’ అమ్మకాలు అందరికీ తెలిసిందే. తాజాగా ‘మద్యం ఆన్ వీల్స్’....ఇదీ గ్రామాల్లో ప్రస్తుత ట్రెండ్. బెల్ట్‌షాపుల స్థానంలో బైక్‌లపై మద్యం సరఫరాకు శ్రీకారం చుట్టారు.
మద్యం వ్యాపారులు ప్రారంభించిన ఈ పద్ధతి చూస్తుంటే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనా విధానాలను బాగా వంటపట్టించుకున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో ఆయన కూడా ప్రజల వద్దకు పాలన అంటూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన విషయాన్ని ఎవరు మాత్రం మరువగలరు.!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గ్రామాల్లో మొబైల్ లిక్కర్ సేల్స్ ప్రారంభమయ్యాయి. బెల్టు షాపుల నియంత్రణకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో కొందరు లెసైన్సీలు మార్కెటింగ్ సిబ్బందిని నియమించి మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గతంలో బెల్టు షాపులను ప్రోత్సహించిన లెసైన్సీలే ఇప్పుడు ఆ మార్గం మూతప డటంతో మద్యం ప్రియులు ఫోన్ చేసిన వెంటనే ద్విచక్ర వాహనాలపై సరకు సరఫరా చేస్తున్నారు.
బెల్టు షాపులకు అయ్యే ఖర్చు కంటే మార్కెటింగ్ సిబ్బందికి ఇచ్చే జీతాల ఖర్చు తక్కువగా ఉండటంతో లెసైన్సీలు డోర్‌డెలివరీ మార్గాన్ని ఎంచుకున్నారు. బెల్టు షాపులు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఎక్సైజ్ సిబ్బందిని బాధ్యులుగా చేసి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో వీటిని నియంత్రించేందుకు ఆ శాఖ గట్టిగానే కృషి చేస్తోంది.జిల్లాలో మొత్తం బెల్టు షాపులు లేకుండా చేశామని ఎక్సైజ్ శాఖ చెబుతున్నప్పటికీ 45 శాతం షాపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
బెల్టుషాపులు మూసివేసిన లెసైన్సీలు అమ్మకాలు పెంచుకునేందుకు ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. మద్యం కొత్త నోటిఫికేషన్‌కు ముందు జిల్లాలో 1023 బెల్టు షాపులు ఉన్నాయి. లెసైన్సులు ఇచ్చిన తరువాత అప్పటి జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్ ఎక్సైజ్ అధికారులతో బెల్టుషాపులపై సమావేశం నిర్వహించి మే 18 నాటికి అన్నీ మూతపడాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖ సిబ్బంది బెల్టుషాపులపై దాడులు చేసి 89 కేసులు నమోదు చేసి, 69 మందిని అరెస్టు చేసింది. ఇది మూన్నాళ్ల ముచ్చటైంది.
కొందరు లెసైన్సీలు బెల్టుషాపులకు మద్యం సరఫరా చేయడం ప్రారంభించారు. ఇంకా అనేక గ్రామాల్లో బెల్టుషాపులు కొనసాగుతూనే ఉన్నాయి.ప్రభుత్వ ఉత్తర్వులకు భయపడి సగం మంది వ్యాపారులు బెల్టుషాపులను మూసివేసి, అమ్మకాలు పెంచుకునేందుకు మొబైల్ సేల్స్‌ను ప్రారంభించారు.ఈ సేల్స్ పెరగడానికి కూడా ప్రస్తుత పరిస్థితులు కొంత కారణమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాలు లేకపోవడం, ఒకవేళ ఉన్నప్పటికీ దూరంగా ఉండటంతో మద్యం ప్రియులు ఈ మొబైల్ సేల్స్‌ను ఆశ్రయిస్తున్నారు.లెసైన్సీలకు సెల్‌ఫోన్‌లో మద్యం ఆర్డరు ఇస్తున్నారు.
మార్కెటింగ్ సిబ్బంది ఆ ఆర్డరు ప్రకారం సరకును 30 నిమిషాల్లోపే డెలివరీ చేస్తున్నారు. ఎంఆర్‌పీపై రూ.10 అధికంగా తీసుకుంటున్నప్పటికీ మద్యం ప్రియులు అడిగిన వెంటనే ఎక్కడ కోరితే అక్కడకు సరఫరా చేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకూ అవసరమైన సిబ్బంది లేకపోవడమే కాకుండా రెండు మూడు బాటిళ్లు ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడానికి న్యాయపరమైన ఆటంకాలు ఎదురవుతున్నాయి. బాటిళ్ల మూతలపై హాలోగ్రామ్ లేబుల్‌ను ఏర్పాటు చేసి ఈ మొబైల్ సేల్స్‌ను అరికట్టాలనే ఉద్దేశంలో అధికారులు ఉన్నారు. ఈ లేబుల్ ఉన్న బాటిల్ ఏ లెసైన్సీ విక్రయించిందీ తెలుసుకునే అవకాశం ఉండటంతో మార్కెటింగ్ సిబ్బంది వద్ద సరకు దొరికినప్పుడు ఆ లెసైన్సీపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ నిర్ణయానికి వచ్చింది.