ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా | Government forgot the Alcohol ban | Sakshi
Sakshi News home page

ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా

Published Sat, Apr 9 2016 1:30 PM | Last Updated on Fri, Aug 17 2018 7:40 PM

ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా - Sakshi

ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా

రూ. వెయ్యి కోట్ల ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా
 
♦ రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవాహానికి గేట్లు ఎత్తివేత..
♦ టెట్రా ప్యాక్‌ల్లో సరఫరాకు నిర్ణయం
♦ సరిహద్దుల్లో అక్రమ మద్యం అరికట్టడానికేనంట..
♦ 180 ఎం.ఎల్. ప్యాక్ రూ.45!
♦ టెట్రా అమ్మకాలను ప్రోత్సహించాలని ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు
♦ 20% చీప్ లిక్కర్ ఉత్పత్తి చేయాల్సిందేనంటూ డిస్టిలరీలకు ఆదేశాలు
♦ మద్య నిషేధం ఊసే మరిచిన ప్రభుత్వం..
♦ అమలుకాని బెల్టుషాపుల రద్దు సంతకం
 
 సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే బెల్టుషాపుల్ని ఎత్తివేస్తామని, మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీఇచ్చారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమన్నారు. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఇందుకు పూర్తిగా భిన్నం. బెల్టుషాపుల్ని రద్దు చేస్తున్నట్టు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే చంద్రబాబు సంతకం చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు రద్దయిన దాఖలాల్లేవు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకుపైగా బెల్టుషాపులు అనధికారికంగానే నడుస్తూనే ఉన్నాయి. మరో వైపు మద్యం ద్వారా భారీఎత్తున ఆదాయం పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. అమ్మకాల్ని భారీఎత్తున పెంచారు.

రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.10,250 కోట్ల ఆదాయం లభించగా.. ప్రస్తుతం రూ.12,647 కోట్లకు చేరింది. ఇప్పుడిదీ చాలదన్నట్టుగా రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ చీప్ లిక్కర్‌ను పరవళ్లు తొక్కించేందుకు, తద్వారా అదనపు ఆదాయం రూపేణా రూ.వెయ్యికోట్లను జనం నుం చి లాగేందుకు ప్రభుత్వం ఐడి యా వేసింది. ఇందులో భాగంగా అందమైన టెట్రా ప్యాకెట్లలో చీప్ లిక్కర్‌ను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం చర్యలు చేపట్టాలంటూ ఎక్సైజ్ శాఖకు తాజాగా ఆదేశాలు సైతం జారీ చేసింది.


 ఎన్‌డీపీపై సాకులు..: ఖజానాకు అదనంగా రూ.వెయ్యికోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. దీనికి చీప్ లిక్కర్ మార్గంగా కనిపించింది. అంతే.. అందమైన టెట్రా ప్యాక్‌లలో చీప్ లిక్కర్‌ను సరఫరా చేయాలని ఆదేశాలిచ్చింది.

కానీ ఎక్కడ విమర్శలు వస్తాయోననే భావనతో.. రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకున్న ఎన్‌డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, వీటిని అరికట్టేందుకుగాను చీప్ లిక్కర్ పొట్లాలను తీసుకొస్తున్నట్టు చెబుతోంది. తాజా నిర్ణయం ప్రకారం.. 180 ఎం.ఎల్., 90 ఎం.ఎల్. పరిమాణం గల టెట్రా ప్యాకెట్లల్లో  చీప్‌లిక్కర్‌ను విక్రయించనున్నారు. 180 ఎం.ఎల్. టెట్రా ప్యాక్‌ను రూ.45కి, 90 ఎం.ఎల్.  ప్యాక్‌ను రూ.22కు విక్రయించనున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రతి డిస్టిలరీ 20 శాతం, అంతకంటే ఎక్కువగానే చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయాల్సిందేనని ప్రభుత్వం ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ చేసినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి.

 20 శాతం ఉత్పత్తి చేయాల్సిందే..
 రాష్ట్రంలో మొత్తం 14 లెసైన్సుడ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ఫ్రూఫ్ లీటర్లు. మొత్తం ఉత్పత్తి చేసే మద్యంలో 20 శాతం చీప్ లిక్కర్‌ను అవి ఉత్పత్తి చేయాలి. లెసైన్సు మంజూరు చేసేటప్పుడు ఈ మేరకు డిస్టిలరీలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ప్రస్తుతం డిస్టిలరీలు చీప్ లిక్కర్‌ను తగినంత ఉత్పత్తి చేయట్లేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని చిన్న చిన్న బాటిల్స్‌లో నింపి పంపడం ఖర్చుతో కూడినదిగా డిస్టిలరీలు భావించడంతో నిబంధనల ప్రకారం అవి నడుచుకోవట్లేదు. చీప్ లిక్కర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టట్లేదు. ఎక్సైజ్ అధికారులూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు.

అదేసమయంలో గోవా, తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీగా రాష్ట్రానికి చౌక మద్యాన్ని దిగుమతి చేసుకుని డిస్టిలరీలు మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ బాటిల్‌ను రూ.10కి కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు రూ.35 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడుతోందని, అనుకున్నమేరకు ఆదాయం ఉండట్లేదని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే చీప్ లిక్కర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. దాన్ని అందమైన ప్యాక్‌లలో పెట్టి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని భావించింది. దీంతో నిబంధనల మేరకు 20 శాతం చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయాల్సిందేనంటూ డిస్టిలరీలకు స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా లిక్కర్ పొట్లాల రూపంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్సైజ్ అధికారులకూ అమ్మకాలకు సంబంధించి టార్గెట్లు విధించాలని యోచిస్తోంది.
 
 డిస్టిలరీలు సరఫరా చేసే చీప్ లిక్కర్‌లో అధికంగా ఆల్కహాల్
మద్యం డిస్టిలరీలు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చీప్ లిక్కర్‌లో మద్యం ఫ్రూఫ్ స్ట్రెంత్ 25.5 శాతం లోపుండాలి. అయితే 26.4 శాతంగా నమోదవుతోంది. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేసిన అనంతరం మద్యం షాపులకు సరఫరా చేయాలి. కానీ డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం ప్రభుత్వ ల్యాబ్‌లకు పరీక్షలకు పంపకుండా నేరుగా మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అయిన సరుకును ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిపితే అధికశాతం ఆమ్లగుణంతో పాటు ఆల్కహాల్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వేసవిలో అందుబాటులోకి తెచ్చే చీప్ లిక్కర్‌ను మందుబాబులు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
 
 మద్యనిషేధంపై చర్యలేవీ?
 రాష్ట్రంలో మద్యనిషేధంపై దశలవారీగా చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే రెండేళ్లవుతున్నా.. ఏ జిల్లాలోనూ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ.. మద్యపాన నియంత్రణ కమిటీనిగానీ ఏర్పాటు చేయలేదు. మద్యనిషేధంపై టీడీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ మద్యంతాగిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి పట్టలేదు.

విజయవాడలో నకిలీ మద్యం ఘటన వెలుగుచూడడం తెలిసిందే. ఒకవైపు బిహార్ వంటి రాష్ట్రాలు మద్య నిషేధం విధిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సాక్షాత్తూ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే విజయవాడలో మీడియాతో వ్యాఖ్యానించడం పరిశీలనాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement