సత్యవాడలో టీడీపీ నేత బెల్టుషాపు. దీనిని ఎక్సైజ్ శాఖ మూసివేసింది.
తణుకు : ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో మద్యం తాగి ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటనపై అనుమానాలు వీడలేదు. స్నేహితుల దినోత్సవం రోజున మందుపార్టీ చేసుకున్న ఐదుగురు యువకుల్లో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు తణుకు ప్రైవేటు ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. గ్రామానికి చెందిన పొనగంటి సుధీర్‌కుమార్, అంబటి ప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా మడిచర్ల శివవర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరితో పాటు మద్యం తాగిన పెద్దిశెట్టి నాని, గుండా కార్తీక్‌లు క్షేమంగానే ఉన్నారు. ఇదిలా ఉంటే వీరి మృతి వెనుకకారణాలు తెలియకపోయినప్పటికీ కల్తీ మద్యం కారణంగానే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు ఎక్సైజ్, పోలీసు శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే గ్రామం శివారులో పసలపూడి రోడ్డులో సత్యవాడ గ్రామ మాజీ సర్పంచి, టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న రెస్టారెంటు, బెల్టుషాపులోనే మద్యం, ఆహారం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. మద్యంలో కల్తీ జరిగిందా లేక ఫుడ్‌పాయిజన్ అయ్యిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భిన్నకోణాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యవాడ ఘటనను అటు పోలీసు, ఇటు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గ్రామంలోని బెల్టుషాపులో కొనుగోలు చేసిన మద్యం, బీరు సీసాలను స్వా«ధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ లేబొరేటరీకి పరీక్షల నిమిత్తం పంపారు. మూడు బీర్లు తాగేసినప్పటికీ మద్యం సీసాలో మాత్రం కొంతమేర మద్యం మిగిలి ఉంది. అయితే సాధారణ మద్యంతో పోల్చితే సీసాలో ఉన్న మద్యం చిక్కగా ఉండటంతోపాటు భిన్నమైన వాసన వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదనపు కిక్కు కోసం మద్యంలో మరేదైనా వాళ్లే కలుపుకొన్నారా..? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా మద్యంలో ఏదైనా కలిపారా అనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. తొలుత ఫుడ్‌పాయిజన్ కారణంగానే ఇద్దరు యువకులు మృతి చెందినట్లు భావించినప్పటికీ పోస్టుమార్టంలో మాత్రం వారి కడుపులో ఎలాంటి ఆహారం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఈ క్రమంలో కేవలం మద్యంలో మాత్రమే కల్తీ జరిగినట్లు పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. అయితే మద్యం కొనుగోలు చేసిన బెల్టుషాపునకు సరఫరా చేస్తున్న వడ్లూరు, సూర్యారావుపాలెం మద్యం షాపుల్లో సంబంధిత బ్యాచ్‌కు చెందిన మద్యం బాటిళ్లను ఎక్సైజ్‌శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త కోసం వెనక్కు తీసుకున్నారు. ఒకవేళ కల్తీ జరిగితే ఎవరు చేశారు..? ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది అనే విషయాలపై అధికారులు దృష్టి సారించారు. మరోవైపు మద్యం తాగిన ముగ్గురితోపాటు వచ్చిన మరో ఇద్దరు యువకుల కదలికలపైనా పోలీసులు దృష్టి పెట్టారు. మృతి చెందిన యువకులతోపాటు ప్రాణాలతో బయట పడిన వారి సెల్‌ఫోన్ నంబర్లు ఆధారంగా ముందు ఎవరితో మాట్లాడారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
అక్రమ మద్యం విక్రయాలపై దృష్టి
ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో జరిగిన ఘటనతో ఎక్సైజ్‌శాఖ ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. ఎక్కడా బెల్టుషాపులు లేవని ప్రగల్భాలు పలికిన అధికార పార్టీ నాయకులు, ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పుడు సత్యవాడ ఘటనతో కలిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. సత్యవాడ గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్‌ను మూసివేయించిన అధికారులు నిర్వాహకులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకుడు, గ్రామ మాజీ సర్పంచి కావడంతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు దీంతోపాటు గ్రామంలోని పలు బెల్టుషాపులు ఉన్నట్లు గ్రామస్తులే చెబుతున్నారు. ఆయా బెల్టుషాపులకు స్థానిక ఎమ్మెల్యే సమీప బంధువుకు చెందిన మద్యం దుకాణాల నుంచే మద్యం సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క బెల్టుషాపులే లేవని చెబుతున్న ఎక్సైజ్‌శాఖ అధికారులు తాజాగా సత్యవాడ ఘటనలో వెలుగు చూస్తున్న వాస్తవాలతో ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment