కొత్త మద్యం పాలసీ వచ్చేసింది
► జిల్లాలో 430 దుకాణాలకు నోటిఫికేషన్
► 75 శాతం తగ్గిన లైసెన్సు ఫీజులు
► లాభాల్లో 6 శాతం కుదింపు
► 30 ఆఖరు.. 31న లాటరీలో దుకాణాలు
నూతన మద్యం పాలసీ విడుదలైంది. మొత్తం ప్రక్రియ సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి రూపొందించారు. జిల్లాలో 430 దుకాణాలకు రెండు స్లాబ్‌లుగా విభజన చేసి జిల్లా ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ ఎన్.వెంకటశివ ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు. చిత్తూరు నగరంలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో 2017–19 మద్యం పాలసీకి సంబంధించిన విధివిధానాలు ప్రకటించారు.
చిత్తూరు: ఇప్పటి వరకు జిల్లాలో మద్యం దుకాణాలు వార్డుల వారీగా ఏర్పాటు చేశారు. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులపై 500 మీటర్లకు లోపు మద్యం దుకాణాలు ఈ నెలాఖరుకు మూసేయాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త పాలసీలో మండలం, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను యూనిట్‌గా తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు గుడి, బడిలాంటి నిబంధనల్ని అమలు చేస్తూ రెండు స్లాబ్‌లుగా నోటిఫికేషన్ ఇచ్చారు.
ఇప్పటికే జిల్లాలో ఉన్న 183 మద్యం దుకాణాలకు సుప్రీం తీర్పు వర్తించదు. వీళ్లకు జూలై 1వ తేదీ నుంచి మార్చి 30, 2019 వరకు(24 నెలలు) కొత్త పాలసీ అమలు చేస్తారు. ఇక సుప్రీం తీర్పు అమలు చేస్తే జిల్లాలో 247 దుకాణాలు ఇతర ప్రాంతాలకు మార్చుకోవాలి. ఈ దుకాణాలు నిబంధనలకు లోబడి ఏప్రిల్ 1 నుంచి జూన్ 30, 2019 (27 నెలలు) వరకు లైసెన్సులు జారీ చేస్తారు.
ఇవీ ఫీజులు
మద్యం దుకాణాల లైసెన్సుల ఫీజులు ప్రభుత్వం భారీగా తగ్గించేసింది. గత పాలసీతో పోలిస్తే 75 శాతం లైసెన్సు ఫీజు తగ్గించారు. అయితే వ్యాపారులకు వచ్చే లాభాల్లో అదనపు ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాలనే నిబంధన అమలు చేశారు. దీంతో ఇప్పటి వరకు సగటు వ్యాపారికి వస్తున్న 18 శాతం లాభాన్ని ఏకంగా 6 శాతం తగ్గించి, 12 శాతానికి కుదించారు. ఇక దరఖాస్తులు చేసే ముందు వ్యాపారులు వాళ్ల పాన్ వివరాలు, ఐటీ వివరాలు, ఇతర వివరాలన్నింటినీ www.appic-ationr.exirehpfr.ap.gov.in అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
దీన్ని ప్రింట్ తీసుకుని చిత్తూరులోని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అందజేయాలి. లైసెన్సు ఫీజును 5 వేల జనాభాలోపు ఉంటే రూ.7.05 లక్షలు, 10 వేల వరకు రూ.8.05 లక్షలు, 25 వేల వరకు రూ.9.25 లక్షలు, 50 వేల వరకు రూ.10 లక్షలు, 3 లక్షల వరకు రూ.11.25 లక్షలు, 5 లక్షల జనాభా వరకు రూ.12.50 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. దీంతో పాటు దరఖాస్తుతో రుసుము రూ.5 వేలు, రిజిస్ట్రేషన్ ఫీజు మండలంలో రూ.50 వేలు, మున్సిపాలిటీల్లో రూ.75 వేలు, కార్పొరేషన్లో రూ.లక్ష, ఈఎండీగా రూ.3 లక్షలు(రీఫండబుల్) జత చేయాలి. వ్యాపారులకు టోకెన్లు అందజేసి ఈ నెల 31న ఉదయం 10 గంటలకు చిత్తూరులోని సాంబయ్యకండ్రిగ వద్ద ఉన్న ఆర్‌ఎల్ కల్యాణ మండపంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ విధానంలో దుకాణాల లైసెన్సులు కేటాయిస్తారు.
జిల్లాలో మొత్తం 430 దుకాణాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 206 దుకాణాలు, తిరుపతి పరిధిలో 224 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ ఫీజుల కింద జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.6 కోట్ల ఆదాయం లభించే అవకాశాలున్నాయి. లైసెన్సుల ద్వారా రూ.50 కోట్లు సమకూరనుంది.
నిబంధనలు
ఒక వ్యక్తికి ఒక్క దుకాణం మాత్రమే కేటాయిస్తారు. లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి మరో దుకాణం వచ్చినా లైసెన్సు జారీ చేయరు. ఇక తిరుపతి నగరంలోని అలిపిరి రోడ్డు, టీటీడీ భవనాల పరిసరాల్లో మద్యం దుకాణాలు పెట్టడానికి వీల్లేదు.