- పేరూరులో రూ.కోటిన్నర ప్రభుత్వ భూమి ఆక్రమణయత్నం
- పట్టపగలే జేసీబీతో పనులు
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
తిరుపతి రూరల్: అధికార పార్టీ నేతలు భూకబ్జాలకు దిగుతున్నారు. అమాయకులను ముందు పెట్టి రూ.కోట్లాది విలువైన ప్రభుత్వ భూములను మింగేస్తున్నారు. పట్టపగలే కాలువలను జే సీబీలతో చదును చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
రూ. కోటిన్నర భూమి కబ్జా
పేరూరు పంచాయతీ సర్వేనెం.164లో 17 ఎకరాల వి స్తీర్ణంలో కాలువ ఉంది. 60 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ కాలువపై పుదిపట్లకు చెందిన మాజీ మంత్రి అనుచరుడి కన్నుపడింది. దోబీఘాట్ కావాలంటూ జిల్లా అధికారులకు తన అనుచరుల ద్వారా వినతి పత్రం ఇప్పిం చాడు. ఆగమేఘాల మీద 59 సెంట్లను మంజూరు చేయించుకున్నాడు.
అంత స్థలం దోబీఘాట్‌కు ఎందు కు ఇళ్ల స్థలాలు వేద్దాం అంటూ అనుచరులను ఒప్పిం చాడు. దాదాపు ఎకరాపైగా కాలువ స్థలాన్ని చదును చేయిస్తున్నారు. ఆదివారం సెలవుదినం. వర్షం పడుతున్నా రెండు జేసీబీలతో కాలువ పూడ్చివేత పనులు ముమ్మరంగా జరిగాయి. మాజీ మంత్రి అనుచరుడు సాగిస్తున్న భూదందాను చూసి మరికొందరు అధికార పార్టీ నేతలు కాలువ ఆక్రమణకోసం పోటీపడ్డారు.
గతంలో 16 ఇంటి పట్టాలు ఇచ్చారంటూ గొల్లపల్లెకు చెందిన రజకులు సైతం కాలువను చదును చేస్తున్నారు. కాగా అధికార పార్టీ నేతల కాలువ కబ్జా యత్నాలన్నీ రెవెన్యూ సిబ్బంది కనుసన్నల్లోనే సాగుతున్నాయనే అరోపణలు వెల్లువెత్తున్నాయి. అందుకే తాము ఫిర్యాదు చేసినా రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతల కబ్జాలను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు.
ఎవ్వరికీ పట్టాలు ఇవ్వలేదు
దోబీఘాట్‌కు ఈ మధ్యే స్థలం ఇచ్చాం కానీ ఎవ్వరికీ ఇంటి పట్టాలు ఇవ్వలేదు. కాలువను అక్రమించాలని చూస్తే చర్యలు తీసుకుంటాం.
-భాస్కర్, గ్రామ రెవెన్యూ అధికారి, పేరూరు