పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం..హైదరాబాద్ మహానగారానికి అతిదగ్గర్లో ఉన్న ప్రాంతాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకోవడంతో గజం భూమి వేలల్లో పలుకుతున్న ప్రాంతాలు. అలాంటి ప్రాంతంలో దాదాపు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమార్కులు స్వాధీనం చేసుకుని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూస్తూ ఊరుకున్నారు.
చివరకు ఈ భూములను కొన్న కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లగా..స్పందించిన హైకోర్టు సర్కార్ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ తీర్పు చెప్పింది. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు సర్కార్ మాత్రం కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారికి ఎక్కడ భూములు కేటాయించాలో తెలియక సతమతమవుతోంది.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెదక్ జిల్లా పటాన్‌చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ పరిధిలో సుమారు రూ.500 కోట్ల విలువైన 382 ఎకరాల ప్రభుత్వ భూమి పరాధీనంలో ఉంది. వీటిని ప్లాట్లుగా చేసి విక్రయించినా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పినా.. రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేట్టడం లేదు.
సొసైటీ పేరుతో మోసం
సిద్దిపేటకు చెందిన నారాయణరావు 1980లో పటాన్‌చెరు ఇండస్ట్రీయల్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీని స్థాపించారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో ప్రభుత్వ, పట్టా భూముల్లో వెంచర్లు చేసి సంఘం సభ్యులకు విక్రయించారు. పటాన్‌చెరు ఇండస్ట్రీయల్ ప్రాంతంలో పనిచేసే కార్మికుల నుంచి రూ.105 సభ్యత్వ రుసుం వసూలు చేసి సొసైటీలో సభ్యులుగా చేర్చుకున్నారు. 1980 నుంచి 1987 వరకు దాదాపుగా ఏడేళ్ల పాటు 382 ఎకరాల ప్రభుత్వ భూమి, 100 ఎకరాల పట్టా భూమిలో 150 గజాల నుంచి మొదలుపెట్టి 500 గజాల చొప్పున ప్లాట్లు చేసి సొసైటీ సభ్యులకు విక్రయించారు. సుమారు ఐదు వేలకుపైనే సొసైటీకి సభ్యులు ఉన్నట్లు జిల్లా సహకార సంఘం నివేదికలను బట్టి తెలుస్తోంది.
ఒక్కొక్క ప్లాటుకు అప్పట్లో రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేశారు. పటాన్‌చెరు మండలం అమీన్‌పూర్, రామచంద్రాపురం మండలం కొల్లూరు, తెల్లాపూర్, జిన్నారం మండలం బొల్లారంలో సర్వే నంబర్ 323/14, 232/19లో 157.08 ఎకరాలు, 324/1 సర్వే నంబర్ కింద 12.14, 325/1లో 18.34 ఎకరాలు, 326/1 లో 20.30 ఎకరాలు, 328 సర్వే నంబర్ నుంచి 340 వరకు 173 ఎకరాల ప్రభుత్వ భూమిని నారాయణ ఆక్రమించారు. ప్రస్తుతం ఈ భూములకు జిల్లా పంచాయతీ అధికారి (డీఆర్‌ఓ) కస్టోడియన్‌గా ఉన్నారు.
ఏం చేశాడంటే..
సొసైటీ కోసం ముందు కొంత పట్టా భూమిని కొనుగోలు చేసిన నారాయణరావు దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కూడా కలుపుకున్నాడు. పేద రైతుల కోసం అసైన్డ్ చేసిన భూములను తన ఖాతాలోనే వేసుకున్నాడు. అప్పట్లో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా సహకరించడంతో.. నారాయణరావుకు అడ్డూ అదుపు లేకుండా అక్రమ రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపించారు. ఒక్కొక్క ఫ్లాటును ఇద్దరు, ముగ్గురికి చొప్పున రిజిస్ట్రేషన్ చేశారు. ఈ లెక్కన ప్లాట్లు కొన్న వాళ్లు 10 వేల మంది ఉన్నారు. ఆ త ర్వాత 1997లో నారాయణ రావు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న లొసుగుల ఆధారంగా వివిధ కారణాలు చూపిస్తూ దాదాపు 4 వేల మంది పైగా సంఘం సభ్యుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నట్లు నోటీసులు పంపించాడు.
ఆ నోటీసులు అందుకున్న కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అప్పటి నర్సాపూర్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి (సీపీఐ) అసెంబ్లీలో లేవనెత్తారు. దీంతో అప్పటి ప్రభుత్వం నారాయణరావు అక్రమ సొసైటీ మీద అప్పటి మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవిని అధ్యక్షతన హౌస్‌కమిటీ వేసింది. ఈ హౌస్ కమిటీ సొసైటీ అక్రమాలపై దాదాపు మూడేళ్ల పాటు అధ్యయనం చేసింది. నారాయణరావు ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి ప్లాట్లుగా చేసి విక్రయించాడని కమిటీ నిర్ధారించింది. ఆయన చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని హౌస్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది.
హైకోర్టు ఏం చెప్పిందంటే..
ప్లాట్లు తీసుకున్న కొందరు సభ్యులు 2006లో హైకోర్టులో వేర్వేరుగా రిట్ పిటిషన్ వేశారు. ఎనిమిదేళ్ల పాటు సమగ్ర పరిశీలన చేసిన కోర్టు హౌస్ కమిటీ సిఫార్సునే సమర్థిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 21న తీర్పు వెలువరించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పట్టా భూముల్లో చేసిన ప్లాట్లను సంఘం సభ్యులకు అప్పగించాలని ఆ తీర్పులో పేర్కొంది. అయితే, తీర్పు వచ్చి దాదాపు 8 నెలలు దాటినా.. రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్వాధీన చర్యలు చేపట్టలేదు. పైగా సమస్యను ఇంకా జటిలం చేస్తూ రాష్ట్ర కో-ఆపరేటివ్ సొసైటీకి, ఇతర రిజిస్ట్రేషన్ శాఖకు ఉత్తరాలు రాస్తూ కాలం గడుపుతున్నారు. ఈ భూములపై ఇప్పటికే రియల్ ఎస్టేట్ గద్దల కన్ను పడింది.
అర్ధబలం, అంగబలం ఉన్న వాళ్లు ఎక్కడికక్కడ భూములను ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ చేసుకుని సెక్యూరిటీ గార్డుల పేరుతో రౌడీ మూకలను కాపలా పెట్టారు. మరికొంత మంది వ్యక్తులు తమ ఆధీనంలో ఉన్న పట్టా భూమిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఆయా పట్టాభూముల్లో పట్టాలున్న సొసైటీ సభ్యుల నుంచి గజానికి రూ.500 నుంచి రూ.1000 వరకు చెల్లించి రిజిస్ట్రేషన్ కాగితాయి తీసుకుంటున్నారు. జిల్లా మంత్రి హరీశ్‌రావు స్పందిస్తే దాదాపు రూ. 500 కోట్ల విలువైన 382 ఎకరాల భూమి తక్షణమే ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
అక్రమార్కుల చెరలో సర్కార్ భూమి
Published Fri, Nov 28 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement