రూ.4 కోట్ల స్థలం కబ్జా! | Rs 4 crore to take place! | Sakshi
Sakshi News home page

రూ.4 కోట్ల స్థలం కబ్జా!

Published Tue, Jan 6 2015 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:15 PM

రూ.4 కోట్ల స్థలం కబ్జా!

రూ.4 కోట్ల స్థలం కబ్జా!

సాక్షి ప్రతినిధి,కడప: ప్రభుత్వ భూమి పక్కాగా అన్యాక్రాంతమైంది. పరిరక్షించాల్సిన యంత్రాంగం మత్తులో ఉంది. ప్రభుత్వ భూమికే ప్రజాధనం పరిహారంగా అప్పగించాలని రాష్ట్ర ఘనుల శాఖ సిద్ధమౌతోంది. ఓ రాజకీయ నాయకుడు, ఉన్నతాధికారి పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగించారు. అక్రమంగా పరిహారం పొందేందుకు సిద్ధం చేశారు. గ్రామస్థుల గతి ఏం కావాలి.. అని ప్రశ్నించిన నేరానికి వేధింపులు, ఛీత్కారాలు ఎదురవుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి.

ఓబులవారిపల్లె మండలం మంగంపేట పంచాయతీ కాపుపల్లె పరిధిలో సర్వే నంబర్ 8లో 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అందులో సుమారు 20 ఎకరాలు ఓ మాజీ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరో 5ఎకరాలను ఏపీఎండీసీ ఆక్రమించి వేస్ట్ డంప్ వేస్తోంది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది, పరిర క్షించండి అంటూ 2013లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు.

ఇప్పటికీ హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. అయితే అనూహ్యంగా ఏపీఎండీసీ ఉన్నతాధికారి ఒకరు మాజీ ప్రజాప్రతినిధితో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వ భూమికి అక్రమంగా ప్రజాధనం అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

భూసేకరణ ముసుగులో....
ఏపీఎండీసీ వేస్ట్ డంపు కోసం భూమి అవసరం ఉందని, 150 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తులు చేసుకుంది.  ఏపీఎండీసీ ఆశిస్తున్న 150 ఎకరాల భూమికి మధ్యలో సర్వేనంబర్ 8లోని 72.77 ప్రభుత్వ భూమి సైతం ఉంది. దానిలోని 20 ఎకరాలను ఇప్పటికే బినామీ పేర్లుతో రాజకీయ నేత దక్కించుకున్నారు. ఓ వైపు తహశీల్దార్ మొత్తం 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రకటించారు.

అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవిన్యూ యంత్రాంగం విఫలం అవుతోంది. కాగా రెవిన్యూ యంత్రాంగానికి భూమి కావాలని అభ్యర్థించే వరకూ ఏపీఎండీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. అయితే పలానా చోట 150 ఎకరాలు అవసరం.. భూసేకరణలో భాగంగా అప్పగించండి అని కోరడం వెనుక మతలబును పలువురు ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.20 లక్షలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా 20 ఎకరాలు బినామీల పేరుతో దక్కించుకున్న నేతకు రూ.4కోట్లు కీలక అధికారి నజరానా ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది.

గ్రామస్థుల వేదన ఆరణ్య రోదన....
అన్యాక్రాంతమైన భూమిని పరిరక్షించాలని, కాట్రేవుడి గుడి, శ్మశానం, పశువుల మేత బీడు భూముల్ని కాపాడాలని 2013లో హైకోర్టులో గ్రామస్థులు రిట్ పిటిషన్ విపి నెంబర్-13660 దాఖలు చేశారు. అప్పటి నుంచి గ్రామస్థులు, రాజకీయ నేత మధ్య వివాదం తలెత్తింది. ఈపరంపరలో గ్రామంలో దాడులు సైతం చోటుచేసుకున్నారుు. పరస్పర కేసుల వరకూ దారితీశాయి.

కాగా ఏపీఎండీసీ  కేవలం గ్రామం వరకూ 150 ఎకరాలు మాత్రమే తీసుకుంటే, గ్రామస్థులు అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. మొత్తం గ్రామం ఖాళీ చేస్తాం, పరిహారం చెల్లించండి, లేదంటే గ్రామానికి దూరంగా భూసేకరణ చేపట్టండండి అని మొరపెట్టుకుంటున్నా విన్పించుకునే స్థితిలో యంత్రాంగం లేదని సమాచారం. అందుకు పక్కా వ్యూహం ప్రకారం ప్రభుత్వ భూమికి పరిహారం పొందాలనే అసలు లక్ష్యం ఉండడమే ముఖ్య ఉద్దేశమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామస్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోని ప్రభుత్వ భూమిని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement