సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. అది గుడిదయినా.. బూడిదయినాసరే.. కబ్జా పెట్టేద్దాం.. లేదంటే రికార్డులు సృష్టించి తక్కువకు కొనేద్దాం... అనే రీతిలో జిల్లాలో కూడా ఏళ్ల తరబడి కబ్జాల కథ సాగుతూనే ఉంది. రెవెన్యూ భూములతో పాటు అసైన్డ్, వక్ఫ్, భూదాన్, దేవాదాయ.. ఇలా అన్ని రకాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేసి అనుభవిస్తూనే ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, కొంతమంది సిబ్బంది లాభాపేక్ష, ‘రియల్’ వ్యాపారుల ధనార్జన కారణంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో కోట్ల రూపాయల ప్రజాధనం పరులపాలవుతోంది. ఈ కబ్జాల పర్వాన్ని నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అక్రమార్కులకు గుబులు పట్టుకుంది. సీఎం ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ భూములెక్కడ ఉన్నాయి.. వాటిలో ఆక్రమణల కు గురైన భూముల వివరాలను సేకరించేం దుకు జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది.
అసైన్డ్ రికార్డుల్లేవంట..
ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల కొనుగోలు అంశం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని నిర్ణీత కాలపరిమితి వరకు అమ్మే అవకాశం లేకపోయినా, పేదల నుంచి అక్రమార్కులు కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. ఇదే విషయమై వారు గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా, వాటికి ఇంకా పరిష్కారం లభించలేదు. 2004 నుంచి ఏడు విడతలుగా జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో దాదాపు 27, 534 ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. అందులో ఎంతభూమిని నిజంగా లబ్ధిదారులు అనుభవిస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. ఇక, అంతకు ముందు ప్రభుత్వాలు అసైన్‌చేసిన భూముల వివరాలు రికార్డు కాలేదని అధికారు లు చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సభాసంఘం ఈ అసైన్డ్ భూముల గుట్టు తేల్చనుంది.
వక్ఫ్... అంతులేని వ్యథ
ఇక, వక్ఫ్ భూముల వ్యవహారం జిల్లాలో ఎప్పుడూ చర్చనీయాంశమే. జిల్లాలో దాదాపు 5,530 ఎకరాల వక్ఫ్ భూములన్నాయని రికార్డులు చెబుతున్నాయి. అయితే వాటిని సంరక్షించాల్సిన వారే కాసుల కోసం అన్యాక్రాంతం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వక్ఫ్ భూముల్లో 75 శాతం ఆక్రమణలకు గురయ్యాయని అధికారులే చెబుతున్నా.. ఈ భూములను ఓ పద్ధతి ప్రకారం సర్దేందుకు గాను కనీసం సర్వే చేసే సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇక, దేవరకొండలో అయితే వక్ఫ్ భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుండడం, జిల్లాలో కొన్ని చోట్ల గోదాములు, సినిమా హాళ్లు, షాపింగ్‌కాంప్లెక్సులు, పెట్రోల్‌బంకులు కట్టడం చూస్తే ఈ వక్ఫ్ భూముల కబ్జా వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే, ఇందుకు సంబంధించిన వివాదాలన్నీ కోర్టుల్లో లేదంటే ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం.
బోర్డు రికార్డులో ఓ తీరు..
ప్రభుత్వ రికార్డుల్లో మరో తీరు
ఇక భూదాన్ భూముల విషయానికి వస్తే అసలు ఆ భూములకు సంబంధించిన రికార్డులకే జిల్లాలో పొంతన కుదిరే పరిస్థితి లేదు. ఈ భూములకు సంబంధించి భూదాన్ బోర్డు దగ్గర ఉన్న రికార్డులకు, ప్రభుత్వం దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులకూ పొంతన కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 35,449 ఎకరాల భూదాన్ భూములుండగా, అందులో 9,069 ఎకరాలు పంపిణీ చేసినట్టు బోర్డు లెక్కలు చెబుతోంది. అయినా, మిగిలిన భూములు ఎక్కడున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇందులో సగానికి పైగా అన్యాక్రాంతమైనట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో దాదాపు 14వేలకు పైగా ఉన్న దేవాదాయ భూముల్లోనూ కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. ఈ భూముల్లో దాదాపు 3వేల ఎకరాలు పరుల పాలైనట్లు అంచనా.
అంతా సురక్షితమేనా!
ఇక, జిల్లాలో మొత్తం 5,17,189 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతుండగా, ఆ భూమి అంతా సురక్షితంగా ఉందా లేదా అన్న దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు.. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నవారెవరు? ఎన్ని ఎకరాలు కబ్జాలో ఉంది అనే వివరాలను సేకరించే పనిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరో మూడు, నాలుగు రోజుల్లో అందే అవకాశం ఉందని, ఈ వివరాలు వచ్చాక ప్రభుత్వానికి నివేదిక పంపుతామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సభాసంఘం ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమార్కుల లీలలు వెలుగులోకి వస్తాయని ప్రజాసంఘాలంటున్నాయి.
దర్జాగా.. కబ్జా
Published Thu, Nov 27 2014 3:22 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement