సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం వేగంగా జరుగుతోంది. రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు పూర్తవుతున్నాయి. శుక్రవారం సాయంత్రానికి 10.31 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 79,953 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాకినాడ జిల్లాలో 79,892 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. పల్నాడు, వైఎస్సార్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 50 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన రిజిస్ట్రేషన్లను వారం రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రిజిస్ట్రేషన్లు పూర్తయిన లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్ల పంపిణీని త్వరలో చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు పేదలకు స్థలాలు ఇచ్చినా వాటిపై పూర్తి హక్కులు ఇవ్వకుండా డి–పట్టాలు మాత్రమే జారీ చేశారు. తొలిసారిగా వైఎస్ జగన్ అన్ని హక్కులతో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పించి ఆ దిశగా అడుగులు వేశారు.
ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడే వాటికి వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలని చూసినా చట్టపరమైన ఇబ్బందుల వల్ల ఆ పని ఆలస్యమైంది. అన్ని సమస్యలను అధిగమించి, అసైన్డ్ భూముల చట్టానికి సవరణ చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ల తర్వాత జారీ చేసే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్‌లుగా మారనున్నాయి. అప్పుడు రెవెన్యూ శాఖ ఎన్‌ఓసీ అవసరం లేకుండానే పేదలు వాటిని నిరభ్యంతరంగా అమ్ముకునే అవకాశం ఏర్పడుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ అయిన నాటి నుంచి వాటిపై ప్రైవేటు భూముల మాదిరిగానే రుణాలు, ఇతర సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment