పక్కాగా భూ హక్కులు | Assembly approval of AP Land Titling Act 2019 | Sakshi
Sakshi News home page

పక్కాగా భూ హక్కులు

Published Tue, Jul 30 2019 3:55 AM | Last Updated on Tue, Jul 30 2019 8:16 AM

Assembly approval of AP Land Titling Act  2019 - Sakshi

సాక్షి, అమరావతి: యజమానులకే కాకుండా కొనుగోలుదారులకు సైతం భూమి హక్కులపై పూర్తి భరోసా కల్పించే ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు–2019ను రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదించింది. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టంలేదని.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకుని ఈ బిల్లు తెచ్చారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ప్రశంసించారు. ల్యాండ్‌ మాఫియాకు, అక్రమ రిజిస్ట్రేషన్లకు, నకిలీ రికార్డులకు చెక్‌ పెట్టడమే ధ్యేయంగా పకడ్బందీగా శాశ్వత భూ హక్కుల కల్పన బిల్లును రూపొందించామని ఆయనన్నారు. ఈ సందర్భంగా మంత్రి బోస్‌ ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ఆవశ్యకత, విశేషాలు, ఉపయోగాలను ఆయన వివరించారు. పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో భూముల విలువ పెరగడం, భూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం, ల్యాండ్‌ మాఫియా విచ్చలవిడిగా విజృంభించడం, నకిలీ రికార్డులు సృష్టించి వాస్తవ రికార్డులు తారుమారు చేస్తుండటంవల్ల భూ యజమానులు దారుణంగా నష్టపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ రికార్డుల బూజు దులిపి ప్రక్షాళన చేసేందుకు ఈ చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

చట్టం తీరుతెన్నులు ఇలా..
‘ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టు–2019 చాలా పటిష్టమైన చట్టం. దీని ప్రకారం స్థిరాస్తి హక్కుల రిజిస్టర్‌ను రూపొందిస్తాం. దీనిలోని స్థిరాస్తిని యజమాని తప్ప మరెవ్వరూ విక్రయించడానికి వీలులేకుండా ఈ చట్టం ఉపకరిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం స్థిరాస్తులను శాశ్వత రిజిస్టర్, వివాద రిజిస్టర్, కొనుగోలు రిజిస్టర్లలో నమోదు చేస్తాం. దీని ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రకారం ఆటో మ్యుటేషన్‌ వ్యవస్థ తెస్తాం. భూమి హక్కులకు భవిష్యత్తులో ఇన్సూరెన్సు కూడా కల్పించాలనే ఆలోచన ఉంది. అలాగే, ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. ఇందుకోసం సర్వే నంబర్ల వారీగా భూములకు సంబంధించి భూ యాజమాన్య రికార్డు (1బి రిజిస్టర్‌), రీసర్వే రిజిస్టర్‌ (ఆర్‌ఎస్‌ఆర్‌), భూ అనుభవ రిజిస్టర్‌ (అడంగల్‌) వివరాలను బహిరంగంగా ప్రకటిస్తారు. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికి నెల రోజుల గడువు ఇస్తారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  హోదాకు తగ్గని అధికారి నేతృత్వంలో రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ అథారిటీ ఏర్పాటుచేస్తారు. ఈ అధికారి కింద ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారులను నియమిస్తారు. భూమి హక్కులను రిజిస్టర్‌ చేసే బాధ్యత ల్యాండ్‌ టైట్లింగ్‌ అధికారిదే. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత నెలరోజుల్లో ఫిర్యాదులు రాని భూముల వివరాలను జిల్లా, మండలం, గ్రామం, సర్వే నంబర్ల వారీగా రిజిస్టర్‌ చేస్తారు. ఇది తాత్కాలిక టైట్లింగ్‌ రిజిస్టర్‌గా ఉంటుంది.

ఈ జాబితాతో తుది నోటిఫికేషన్‌ జారీచేసి అభ్యంతరాలు కోరతారు. రెండేళ్లలో అభ్యంతరాలు లేకపోతే ఆయా భూముల యజమానులను శాశ్వత హక్కుదారులుగా గుర్తించి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. వీటిని ఆన్‌లైన్‌లో పెడతారు. ఈ ఆస్తుల యజమానులకు ప్రశ్నించ వీలులేని హక్కులు లభిస్తాయి. వీటిపై ఎవరూ కోర్టుకు వెళ్లడానికి కూడా వీలుండదు’.. అని ఉప ముఖ్యమంత్రి వివరించారు.  ‘అలాగే, ఫైనల్‌ నోటిఫికేషన్‌ జారీచేశాక రెండేళ్లలో అభ్యంతరాలు వచ్చిన భూములన్నింటినీ సర్వే నంబర్ల వారీగా అనుభవదారుల పేర్లు రాసి వివాద రిజిస్టర్‌లో నమోదుచేస్తారు. ఇందులోని భూమిపై హక్కులు తమవేనని భావించే వారు జిల్లా స్థాయిలో జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని ట్రిబ్యునల్‌లో కేసు వేయాలి. ట్రిబ్యునల్‌ తీర్పుపై ఎవరూ సవాల్‌ చేయకపోతే ఆ భూములన్నీ శాశ్వత టైట్లింగ్‌ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఒకవేళ ట్రిబ్యునల్‌ తీర్పుపై ఎవరైనా సవాల్‌ చేయాలంటే నెల రోజుల్లోగా న్యాయమూర్తి నేతృత్వంలోని స్టేట్‌ లెవల్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లవచ్చు. భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలున్నా ఈ రెండు ట్రిబ్యునళ్లకే వెళ్లాలి. కోర్టుకు వెళ్లడానికి వీల్లేదు. ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఆ కేసులను కోర్టులు ట్రిబ్యునళ్లకే పంపుతాయి. కోర్టులకు అధికారాలు ఉండవు. రాష్ట్రస్థాయి ట్రిబ్యునల్‌ తీర్పుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టులో సవాల్‌ చేయవచ్చు. హైకోర్టులో భూ వివాదాలను విచారించడానికి ప్రత్యేకంగా ఒక బెంచి ఉంటుంది. జిల్లా, రాష్ట్రస్థాయి ట్రిబ్యునళ్లకు జ్యుడీషియల్‌ హోదా ఉంటుంది’.. అని బోస్‌ చెప్పారు.

ఇది సాహసోపేత బిల్లు : ధర్మశ్రీ
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఈ బిల్లుపై మాట్లాడుతూ.. ఇది సాహసోపేతమైనదని, ప్రస్తుత పరిస్థితుల్లో దీని అవసరం ఎంతో ఉందన్నారు. రెవెన్యూ బూజు దులిపే బిల్లు తెచ్చినందుకు సీఎంను అభినందిస్తున్నామని చెప్పారు. స్థిరాస్తి యజమానులతోపాటు, కొనేవారికి కూడా రక్షణ కల్పించే ఈ బిల్లు చాలా గొప్పదని గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ కూడా ఈ బిల్లును తేవడం సాహసోపేతమైన చర్య అని కొనియాడారు. అదే సమయంలో సరిగా చేయకపోతే దుస్సాహసమవుతుందన్నారు. గత 70ఏళ్లలో ఇది జరగనందున జాగ్రత్తగా చేయాలని సూచించారు. కాగా, మార్కెట్‌ కమిటీలకు గౌరవ చైర్మన్లు, సభ్యులుగా నియమితులయ్యే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దవకుండా చూసే చట్ట సవరణ బిల్లును కూడా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టగా శాసనసభ ఆమోదించింది.  

పాదయాత్రలో వచ్చిన వినతులే ప్రేరణ
‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. జిల్లా కలెక్టరు ఆఫీసును కూడా అమ్మి రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటనలున్నాయి. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయడానికి వీల్లేదనే అధికారం రిజిస్ట్రేషన్‌ అధికారికి లేదు. నిషేధిత ఆస్తుల జాబితా (పీఓబీ) పెట్టడంవల్ల ప్రస్తుతం ప్రభుత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయడంలేదు. ప్రైవేటు ఆస్తులను మాత్రం యజమానికి తెలియకుండా వేరే వారు అమ్మేసి రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. ఇలా యజమానులే కాక కొనుగోలుదారులు సైతం నష్టపోతున్నారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంవల్లే ఇవి జరుగుతున్నాయని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తించారు. దీంతో అధికారంలోకి రాగానే నిపుణులతో చర్చించి ఈ బిల్లుకు రూపకల్పన చేశారు’ అని బోస్‌ వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement