అవ్హాడ్ భద్రత ప్రభుత్వానిదే..
♦ స్పష్టం చేసిన రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే
♦ అవ్హాడ్‌పై దాడి సిగ్గుచేటన్న ఎన్సీపీ అధినేత శరద్‌పవార్
♦ ‘చిక్కీ’ కుంభకోణం విషయంలో జాతీయ పత్రికకు నోటీసు
♦ ఘనంగా సీఎం పుట్టిన రోజు వేడుకలు
♦ శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన విద్యార్థులు
ముంబై : ఎన్సీపీకి చెందిన శాసన సభ్యుడు జితేంద్ర అవ్హాడ్ భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని రెవెన్యూ శాఖ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే అసెంబ్లీలో స్పష్టం చేశారు. అవ్హాడ్‌పై జరగుతున్న దాడి గురించి బుధవారం సభలో ఎన్సీపీ సభ్యుడు దిలీప్ వల్సే పాటిల్ లేవనెత్తారు. సాంగ్లీలో అవ్హాడ్‌పై దాడి జరిగిందని, ఫోన్, సోషల్ మీడియా ద్వారా ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పారు. అవ్హాడ్‌పై దాడిపై ఆందోళన చెందుతూ సీఎం ఫడ్నవీస్‌కు ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ లేఖ కూడా రాశారని తెలిపారు. ‘కార్యసాధక, ప్రగతిశీల భావాలున్న వ్యక్తులపైనే రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. అలాంటి వారిపై దాడులు జరగడం సిగ్గుచేటు.
అవ్హాడ్‌పై జరుగుతున్న దాడిపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఆయనకు భద్రత ఏర్పాటు చేయాలి. ఒక సీఎంగా, హోంశాఖ మంత్రిగా అవ్హాడ్‌కు భద్రత కల్పించడం మీ కర్తవ్యం. మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తారనే అనుకుంటున్నాను’ అని పవార్ లేఖలో పేర్కొన్నారు. దాడి చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రభుత్వాన్ని దిలీప్ వల్సే పాటిల్ డిమాండు చేశారు. స్పందించిన స్పీకర్ హరిబావ్ బగ్డే, మొత్తం వ్యవహారంపై ఓ ప్రకటన చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్యేలను మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు రక్షణ ఏర్పాటు చేయడం మా బాధ్యత. అవ్హాడ్‌కు భ ద్రత కల్పిస్తాం. బెదిరింపుల విషయంపై విచారణకు ఆదేశిస్తాం’ అని ఖడ్సే సభలో చెప్పారు.
ఆ పత్రికపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
‘చిక్కీ’ కుంభకోణానికి సంబంధించిన నివేదికను విధానసభలో చర్చించక ముందే ప్రచురించిన ఓ జాతీయ పత్రికపై బీజేపీ శాసనసభ్యుడు ప్రశాంత్ బాంబ్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేశారు. ‘చిక్కీ’ కొనుగోలు విషయంలో రూ.206 కోట్ల కుంభకోణం జరిగిందంటూ రాష్ట్ర మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి పంకజ ముండే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘అసెంబ్లీలో వార్తా నివేదిక గురించి ఇంకా చర్చ జరగలేదు. సంబంధిత శాఖ నుంచి నిజానిజాలు బేరీజు వేసుకున్న తర్వాత వార్తను ప్రచురించాల్సి ఉంటుంది. కానీ ఆ పత్రిక అవేమీ చేయలేదు. మంత్రి వివరణను ప్రచురించినప్పటికీ పాత విషయాలపై మాత్రమే కేంద్రీక ృతమై ఉంది.
ఇది ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చడమే’ అని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ నియోజవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ బాంబ్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారం మీద ప్రశ్నోత్తరాల సమయంలో రాతపూర్వకంగా మంత్రి సమాధానమిచ్చిందని, రేట్ కాంట్రాక్ట్ బేసిస్ మీదే చిక్కీ, కిచిడీ కొనుగోళ్లు జరిపామని, అయితే ఆ పద్దతిలో రూ. కోటి ఆపైన కొనుగోళ్లపై రాష్ట్రంలో నిషేధం ఉందని ఒప్పుకున్నట్లు ఆ పత్రిక ప్రచురించింది. దీనికి వివరణ ఇచ్చిన పంకజ ముండే, ‘రేట్ కాంట్రాక్ట్ సిస్టమ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం నిజమే. ఈ పద్దతి ప్రకారం వస్తువు ధర, కాంట్రాక్టర్ వంటి విషయాలను ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. టెండర్ల ప్రక్రియను పరిశ్రమలు లేదా ఆర్థిక శాఖలు చూసుకుంటాయి. ఇక్కడ రేట్ కాంట్రాక్ట్ లిస్ట్ పైనే వస్తువులు అమ్మకం జరుగుతుందనే విషయం తెలుస్తోంది. మళ్లీ టెండర్లు పిలవాల్సిన పనిలేదు’ అని వివరించారు.
ప్రైవేటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ విధించేందుకు కొత్త చట్ట తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి వినోద్ తావడే విధాన సభలో తెలిపారు. కొత్త చట్టానికి న్యాయ శాఖ ఇప్పటికే పచ్చజెండా ఊపిందని, అడ్వొకేట్ జనరల్ నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లు 100 శాతం ఫలితాలు తీసుకొస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయని, దీనిపై ప్రభుత ్వం తీసుకుంటున్న చర్యలేంటో తెలపాలని కాలింగ్ అటెన్షన్ మోషన్ ద్వారా బీజేపీ సభ్యుడు సర్దార్ తారా సింగ్ మంత్రిని ప్రశ్నించారు. దీనికి వివరణ ఇచ్చిన తావడే, ‘ప్రైవేటు కోచింగ్ క్లాసులపై ప్రభుత్వ నియంత్రణ లేదు. ప్రైవేటు కోచింగ్ క్లాసులపై నియంత్రణ అనే ప్రతిపాదన గతంలో సభ ముందుకు వచ్చింది. అయితే ఇప్పటికే చట్టం రూపుదిద్దుకోలేదు’ అని చెప్పారు.
‘శౌర్య’కు కాల్బాదేవీ మృతుల పేర్లు
కాల్బాదేవీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన నలుగురు అగ్నిమాపక శాఖ అధికారుల పేర్లను శౌర్య పతకాలకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాసన మండలిలో ఎన్సీపీ ఎమ్మెల్సీ సునీల్ తట్కరే ఇచ్చిన కాలింగ్ అటెన్షన్ మోషన్‌లో మాట్లాడుతూ మంత్రి రంజత్ పాటిల్ తెలిపారు. ఆ అధికారులకు అమరవీరులుగా గుర్తింపు ఇస్తారా అని ప్రశ్నించిన కపిల్ పాటిల్‌కు సమాధానమిస్తూ, సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన వారికే ఆ గుర్తింపు ఇస్తారని రంజిత్ వివరించారు. అయితే వారందరి పేర్లను శౌర్య పథకాలకు రాష్ట్రపతికి సిఫారసు చేశామని చెప్పారు.
సీఎంవోకు ధన్యవాదాలు: సీఎం
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పినందుకు సీఎంవోకు ధన్యవాదాలు. అంతకంటే ముందుగా జల్‌యుక్త్ శివార్ పథకానికి ఒక రోజు జీతాన్ని విరాళమిచ్చినందుకు నా హృదయపూర్వక అభినందనలు’ అని సీఎం ఫడ్నవీస్ పేర్కొన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా జలసంరక్షణ పథకానికి సీఎం కార్యాలయ ఉద్యోగులు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని ట్వీట్ చేవారు. జల్ యుక్త్ శివార్‌కు రూ.25 వేలు చొప్పున విరాళమిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు ఆశిశ్ శేలర్, అమిత్ సతామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘నాపుట్టిన రోజును జరుపుకోవద్దు. ప్రకటనలు, బానర్లు కట్టొద్దు. ఆ డబ్బును జలయుక్త్ శివార్‌కు విరాళమివ్వండి’ అని సందేశమిచ్చారు.