
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రభుత్వం దరఖాస్తు (డీకేటీ) పట్టా రూపంలో ఇచ్చిన నివాస స్థలాలు ఎవరి అధీనంలో ఉంటే వాటిపై వారికే హక్కులు కల్పించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. 2019 జనవరి 21వ తేదీకి ముందు చేతులు మారిన నివాస స్థల డీకేటీ పట్టాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి జిల్లా కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి డీకేటీ పట్టాల రూపంలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు చాలావరకు అనధికార లావాదేవీల ద్వారా చేతులు మారాయి. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్(పీఓటీ) చట్టం ప్రకారం వీటి క్రయవిక్రయాలకు ఆస్కారం లేదు. అందువల్ల విక్రయ రిజిస్ట్రేషన్లు జరగవు.
ఈ నేపథ్యంలో అనధికారికంగా కొనుగోలు చేసిన స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే డీకేటీ పట్టాల రూపంలో ఇళ్ల స్థలాలు తీసుకున్న వారు ఆర్థిక సమస్యలుంటే 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు పీఓటీ చట్టానికి సవరణ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించింది. దీంతో గతేడాది జనవరి 21వ తేదీకి ముందు నివాస స్థలం ఎవరి అధీనంలో ఉంటే వారికే పట్టా ఇవ్వాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేసింది. గతంలోనే ఈ మెమో ఇచ్చినప్పటికీ కొందరు కలెక్టర్లు/ రెవెన్యూ అధికారులు సందేహాలు వ్యక్తం చేశారు.
వాటిని నివృత్తి చేస్తూ తాజాగా ప్రభుత్వం మరో మెమో పంపింది. వేరే వారికి ఇచ్చిన నివాస స్థలాలను ఎవరు పడితే వారు కొనుగోలు చేసినా, స్వాధీనం చేసుకున్నా పట్టా ఇవ్వడం కుదరదు. ఇల్లు గానీ, నివాస స్థలం గానీ లేనివారికి మాత్రమే ఇలా పట్టా ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. పీఓటీ చట్ట సవరణ నేపథ్యంలో ఇప్పటివరకూ ఇళ్ల స్థలాలు పొందినవారు వాటిని 20 ఏళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment