సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సమైక్యాంధ్ర ఉద్యమం 75వ రోజుకు చేరుకుంది. విజయదశమి పండగ రోజూ ఉధ్యమం ఉధృతంగా సాగింది. ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
నెల్లూరులోని ఎన్జీఓ భవన్‌లో ఉద్యోగులు రిలే దీక్ష చేశారు. గాంధీబొమ్మ సెంటర్‌లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఉదయగిరిలోని దీక్షా శిబిరంలో ఉపాధ్యాయులు, ఎన్జీఓలు చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ సెంటర్‌లో ఒంటికాలుపై నిలుచుని నిరసన తెలియజేశారు. బస్టాండ్ సెంటర్‌లో జరిగిన రిలేదీక్షలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు. కావలిలోనూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ, సమైక్యాంధ్ర జేఏసీల ఆధ్వర్యంలో సమైక్యవాదులు దీక్షలు కొనసాగించారు. వెంకటగిరిలోని కాశీపేట సెంటర్‌లో పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సూళ్లూరుపేట, నాయుడుపేటలో జేఏసీల ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి. ఆత్మకూరులోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లోనూ సమైక్యవాదులు రిలేదీక్షలు కొనసాగించారు. గూడూరులోని టవర్‌క్లాక్ సెంటర్‌లో రిలేదీక్షలు కొనసాగాయి. సోనియా, దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలకు గుమ్మడి కాయలకు తగిలించి పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పగలగొట్టారు.